రెక్కల కష్టం

Difficulty of wingsషావుకారు తను ఎదురుగా నిలబడిన ధర్మయ్యతో ”తొందరపడకు ధర్మయ్య, నేను కావాలంటే ఇంకో సంవత్సరం ఆగుతాను. బాకీ తీర్చే ఆలోచన చేయద్దుగాని మీ కుటుంబాన్ని వీధిన పడేసిన పాపం నాకొద్దు” అంటాడు. ఆ మాటలకు ధర్మయ్య ”షావుకారు గారూ.. అలా అనుకోవద్దు. నాకు అవసరమైనప్పుడల్లా లేదు అనకుండా, ముందు బాకీ గురించి గానీ, వడ్డీ గురించి గానీ అడగకుండా డబ్బు ఇచ్చారు. పిల్ల పెళ్ళికి పొలం అమ్మిన డబ్బులు చాలకపోతే అప్పటికప్పుడు నేను అడిగిన లక్ష రూపాయలు ఇచ్చారు. ఉన్న ఎకరంన్నర పొలంలో వానలు పడక, పంటలు సరిగ్గా పండక, పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో, మీకు వడ్డీ కట్టలేదు సరి కదా, కూతురు అల్లుడు రాకపోకలని, మొదటి పండక్కి అల్లుడికి బంగారం అని, ఇంట్లో ఖర్చులు అని, సారె అని మళ్లీ మీ దగ్గర అప్పు చేశాను. పిల్ల పురుడని బారసాలని మళ్ళీ అప్పు. ఈ మూడేళ్లలో పొలం మీద ఆదాయం లేకపోవడంతో మీ దగ్గర అప్పులు చేస్తూనే ఉన్నాను తప్ప ఒక్కసారి కూడా వడ్డీ కూడా కట్టలేదు. మీరు మంచితనంతో నామీద అభిమానంతో ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. ఇవాళ్లే కదా అడిగారు. నేను కూడా ఆ మంచితనాన్ని నిలబెట్టుకోవాలి కదా. నాకున్నది ఎకరంన్నర పొలం, ఇల్లు, ఇంటి వెనకాల పశువులు కట్టే స్థలం.
పొలం అమ్మేస్తే జీవనాధారం ఉండదు. ఇంటి వెనకాల స్థలం అమ్ముదామంటే మా తాత బతికున్నంత కాలం ”ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ స్థలం మాత్రం అమ్మకు ఎవరికీ ఇవ్వకు. ఈ స్థలం నీ పాలిట లక్ష్మి. కావాలంటే ఇల్లు పొలం అమ్ముకో. నీ ఆడబిడ్డలకు కట్నంగా ఇచ్చేసుకో. ఈ స్థలం మాత్రం నువ్వే అట్టి పెట్టుకో” అని ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు. అందుకే ఇల్లు అమ్మాలని నిర్ణయించుకున్నా. మీరే ఇల్లు కొనుక్కుంటే సంతోషం. లేదా ఏదో ఒక రకంగా ఇల్లు అమ్ముడయ్యే ఉపాయం ఆలోచించి పుణ్యం కట్టుకోండి. మేం వీధిని పడతామని మీరు బెంగ పెట్టుకోకండి. పొలంలో పశువుల్ని కట్టి, ఇంటి వెనకాల ఉన్న స్థలంలో చిన్న ఇల్లు వేసుకుంటాను. పిల్లవాడు చాలా తెలివైనవాడు చదువుకుంటానంటున్నాడు. ఎలాగోలా వాడిని చదివిస్తే వాడి బతుకు తెరువు వాడే చూసుకుంటాడు. చిన్నపిల్లలకి ఆ మిగిలిన ఎకరంనర పొలం అమ్మయినా పెళ్లి చేస్తాను. భయమేం లేదు. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఇల్లు అమ్ముడు అయ్యేటట్లు చూడండి” అని కచ్చితంగా చెప్పేసి నమస్కరించి వెనక్కి తిరిగి భుజంపై కండువా దులుపుకుంటూ వెళ్లిపోయాడు ధర్మయ్య.
ధర్మయ్య వెళ్ళిన వైపే చూస్తూ ఒక నిట్టూర్పు వదిలాడు షావుకారు. ఆపూటే షావుకారు ఆ ఊర్లో పెద్ద మనుషులకు కూడా ఒక మాట చెప్తే మంచిదని, వారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. వారంతా మర్నాడు సాయంత్రం సమావేశమయ్యారు. వారిలో పెద్దవాడు డబ్బు కలవాడు అయిన రామిరెడ్డి ”మన ధర్మయ్య ఎంత మంచివాడు .. కల్లాకపటం తెలియనివాడు. వాడికి పాపం పదేళ్ళలోపే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళు నాన్న కూడా మరో రెండేళ్లలో పోయాడు. ఉన్న ఒక్క తాతే ధర్మయ్యను వాడి చెల్లి పార్వతమ్మను పెంచి పెద్ద చేశాడు. తాత కష్టం చూసి తాత వెనక చిన్నప్పటినుండే పొలం వెళ్లేవాడు. పట్టుమని 18 ఏళ్లు కూడా రాకుండానే ఇంటి బాధ్యతను నెత్తి మీద వేసుకున్నాడు. బాధ్యతగా చెల్లికి పెళ్లి చేశాడు. తండ్రి స్నేహితుడి కూతుర్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో ముచ్చటైన కుటుంబం. ఎప్పుడూ ధర్మయ్య గురించి మంచిగా వినటమే కానీ, చిన్న చెడుమాట కూడా నేను వినలేదు. ఊళ్లో ఎవరికి కష్టమొచ్చినా సహాయానికి ముందుంటాడు. చాలా మంచివాడు. అలాంటి ధర్మయ్యకి ఇల్లమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమిటో?” అన్నాడు.
ఆ మాటలు విన్న మిగిలిన వాళ్లంతా కూడా ”అవును నిజం. ధర్మానికి రావాల్సిన కష్టం కాదు ఇది” అన్నారు.
అందరూ బాగా ఆలోచించి ఇంటికి న్యాయమైన ధరను నిర్ణయించి, ధర్మయ్యకి కబురు చేసి ఆ ధర చెప్పారు. ఆ ధరకి ధర్మయ్య అంగీకరించడంతో షావుకారే ఇంటిని కొనటానికి ఒప్పుకున్నాడు. నిర్ణయించిన ధర ప్రకారం షావుకారు అప్పు వడ్డీతో సహా తీరిపోగా ఇంకా పాతికవేలు ధర్మయ్య చేతికి వచ్చాయి.
ధర్మయ్య డబ్బులు తీసుకుని షావుకారుతో ”అయ్యా నేను వెనక ఇల్లు కట్టుకునే వరకు ఆ ఇంట్లోనే ఉండటానికి అనుమతి ఇవ్వండి” అని అడగటంతో అక్కడి వారందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
షావుకారు ముందుకొచ్చి ”ధర్మయ్యా… నీ ఇల్లు పూర్తయ్యే వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు. నాకు కంగారు ఏమీ లేదు” అని చెప్పాడు. అప్పు పూర్తిగా తీరిపోవటంతో తేలికపడిన మనసుతో ఇంటికి చేరి విషయం చెప్పాడు ధర్మయ్య. భార్య, పిల్లలు ఇంటిని విడిచిపెట్టాలని బాధపడి, ఒక్కసారి ఆప్యాయంగా ఇంటిని చూసుకున్నారు. కానీ ధర్మయ్య బాధపడతాడని పైకి ఏమీ చెప్పలేదు.
మర్నాడు ఉదయం నిద్రలేచి పొలం దగ్గర పక్క రైతు సహాయంతో పశువుల కోసం ఒక పాక వేసి పశువుల్ని అందులోకి మార్చాడు. ఖాళీ అయిన పశువులు కట్టే స్థలాన్ని ఒక్కసారి పరిశీలించి చూసాడు ధర్మయ్య. ఆ స్థలం కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉంది. గేదెల్ని కట్టడంతో పేడ గడ్డితో చిరాగ్గా ఉంది. దాంతో భుజంపై ఉన్న కండువా నడుముకి కట్టుకుని పనిలోకి దిగాడు ధర్మయ్య. ఆ స్థలమంతా శుభ్రం చేసి గేదెలు కట్టడానికి నాటిన రాడ్లను పీకేసి అంతా చదును చేశాడు. మర్నాడు ఇల్లు కట్టే వాళ్ళని తీసుకొచ్చి చూపించాడు. వాళ్లు స్థలం చూసి ఇంటి నమూనాని సున్నంతో వేశారు. మంచి రోజు చూసి పని మొదలుపెట్టారు.
పని మొదలయ్యింది. పునాదులు తవ్వుతుండగా గునపానికి ఏదో తగిలి ‘కంగు’మని శబ్దం వచ్చింది. అక్కడ పనిచేస్తున్న వారంతా ఒక్కసారి పని ఆపి ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు. ఏంటా అని. మళ్లీ తవ్వగా మళ్లీ అదే శబ్దం. దాంతో అందరూ పని ఆపి ఆ శబ్దం వచ్చిన చోటికి వచ్చారు. ధర్మయ్య కూడా ఆత్రంగా అక్కడికి వచ్చాడు.
అంతా కలిసి జాగ్రత్తగా తవ్వగా కింద ఒక ఇత్తడి బిందె కనబడింది. దాన్ని జాగ్రత్తగా బయటికి తీశారు. దానిమీద ఒక మూత పెట్టి ఉంది ఆ మూత చేతులు వణుకుతుండగా తీశాడు ధర్మయ్య. అందులో నగలు. చాలా బంగారు నగలు, కొన్ని వెండివి ఉన్నాయి.
అవి చూసి ఆశ్చర్యపోయారు అందరూ. ఈలోగా ధర్మయ్య ఇంట్లో వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇరుగుపొరుగు వాళ్ళు చేరారు. ఆ నోట ఈ నోట విషయం పాకి అందరూ అక్కడికి వచ్చారు. షావుకారు, రామిరెడ్డి ఇంకా పెద్ద మనుషులు కూడా వచ్చారు. ధర్మయ్య బిందెలో ఉన్న నగలు ఒక్కొక్కటే తీసి చూడసాగాడు. అందులో కొన్ని నగలు మాత్రం ఎక్కడో బాగా చూసినట్టు అనిపిస్తోంది ధర్మయ్యకు. కానీ ఎక్కడ చూస్తాడో గుర్తు రావట్లేదు.
అక్కడికి చేరిన జనంలో ఒకరు ”ఈ నిధి ప్రభుత్వానికి చెందుతుంది” అన్నారు.
మరొకరు ”ఈ నిధి మన గ్రామానికి చెందుతుంది” అన్నారు.
అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింట్లో ఉండే కమలమ్మ ముందుకు వచ్చి ఆ ఆభరణాలను చేత్తో పట్టుకుని చూసి ”ఇవి ధర్మయ్య తల్లి మారమ్మవి. ఆమె నేను ఒకే సంవత్సరంలో పెళ్లి చేసుకుని పక్కపక్క ఇళ్ళకు కోడళ్లుగా వచ్చాం. ఒకే వయసు వాళ్ళం అవ్వటంతో ఇద్దరం చాలా స్నేహంగా ఉండే వాళ్ళం. నాకు బాగా గుర్తు మారెమ్మ ఎప్పుడూ ఒంటినిండా నగలతో కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉండేది. ఆమె అత్తవారింటికి వచ్చేటప్పుడు ఏడు వారాల నగలతో వచ్చింది. తర్వాత కూడా పుట్టింటి వారు, అత్తవారింటి వారు కూడా కొన్ని నగలు చేయించారు. నాకు బాగా గుర్తు ఇవి కచ్చితంగా ధర్మయ్య వాళ్ళ అమ్మ నగలే” అని చెప్పి జనాల్లో ఉన్న వెనక వీధిలో ఉండే ‘గంగమ్మని’ గంగా నువ్వు వచ్చి చూడు, నీకు మారెమ్మ బాగా తెలుసు కదా” అని పిలిచి ఆమె వచ్చి చూసేలోపు జనాలతో ”మా పెళ్లయిన 7, 8 ఏళ్లకు అనుకుంటా… అప్పట్లో ఓ దొంగల ముఠా ఇళ్లను కొల్లగొడుతూ ఊళ్ళ వెంట తిరుగుతూ ఉండేది. ఈ ఊళ్లో కూడా రెడ్డిగారి ఇంట్లో, కరణం గారింట్లో దోచుకుపోయారు. దాంతో భయపడి అప్పట్లో మేము బంగారం వెండి వంటి విలువైన వస్తువులని అటక మీద పాత సామాన్ల కింద దాచాం. బహుశా అలాగే ధర్మయ్య వాళ్ళ అమ్మానాన్న ఇక్కడ దాచి ఉంటారు” అని చెప్పింది.
నగలు చూసిన గంగమ్మ ”అవును, మేం మా బంగారం, వెండి, డబ్బులు ఇంట్లోనే ఓ మూల గొయ్యి తీసి దాచాం. ఈ నగలన్నీ మారెమ్మవే” అని చెప్పింది.
రామిరెడ్డి ముందుకు వచ్చి ఇంకా ఊళ్లో పెద్దవాళ్లైన ఆడవాళ్ళకి ఆ నగలు చూపించి విచారించాడు. ఈలోగా ధర్మయ్య చిన్న కూతురు సీత గబగబా ఇంట్లోకి పరిగెత్తి వాళ్ళ నాన్నమ్మ తాతయ్యల ఫోటో తెచ్చింది. రామిరెడ్డి ఆ ఫొటో తీసుకుని అందులో ఉన్న నగలను పరిశీలించి చూడగా దొరికిన నగల్లో కొన్ని సరిగ్గా అలానే ఉండటంతో, అవి ధర్మయ్య తల్లివే అని నిర్ణయించేసాడు.
షావుకారు, రామిరెడ్డి పూనుకొని ఫొటోలో ఉన్న నగలు, కొన్ని వజ్రాల నగలు ధర్మయ్యకి తల్లి గుర్తుగా ఉంచుకోమని ఇచ్చి, మిగిలిన నగలు అమ్మించి వచ్చిన డబ్బుతో, ధర్మయ్య అమ్మిన పొలం ఇల్లు మళ్లీ తిరిగి ఇప్పించారు.
ధర్మయ్య తనకిచ్చిన నగలను రామిరెడ్డికే తిరిగి ఇచ్చేస్తూ ”మా అమ్మ సరైన వైద్యం అందక చనిపోయింది. ఇప్పటికీ మన ఊరిలో ఆసుపత్రి లేదు. మా అమ్మ లాంటి అమ్మలు చనిపోకుండా ఈ నగలను అమ్మి ఒక ఆసుపత్రి కట్టించండి. మా అమ్మ ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది. ఈ నగలు నాకు అవసరం లేదు. నా పిల్లలకి నా రెక్కల కష్టం చాలు” అని చెప్పాడు.
ఆ మాటలు విన్న రామిరెడ్డి ”నీ మంచితనమే నిన్ను రక్షిస్తోంది” అని ఆస్పత్రి ఎక్కడ కడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ బయటకు అడుగులు వేశాడు.
– శ‌శి 9553809850

Spread the love