మారకపోతే అతనితో కష్టం

స్మార్ట్‌ ఫోన్‌ వచ్చిన తర్వాత అందరి జీవితాలు చాలా మారిపోయాయి. కంటికి కనిపించిన ప్రతి అందమైన దృశ్యాన్ని అందులో బంధించాలని అనుకుంటారు. అంత వరకు మంచిదే. కానీ కొంత మంది మితిమీరిపోయి నాలుగ్గోడల మధ్య వుండాల్సిన విషయాలను కూడా వీడియోలు తీసేస్తున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అలాంటి సమస్యతోనే ఈ వారం ఐద్వా అదాలత్‌కు వచ్చింది లత. అసలు ఆమె సమస్య ఏంటో తెలుసుకుందాం…
     పెండ్లి అనేది రెండు మనసులకు సంబంధించిన అందమైన బంధం. అలాంటి బంధాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావు. భార్యాభర్తలు నాలుగు గోడల మధ్య చేసే పనిని కూడా వీడియోలు తీస్తున్నావు. వాటిని నీ స్నేహితులకు చూపిస్తున్నావు. ఇది ముమ్మాటికీ తప్పే? మీ అక్క ఇంటికి వచ్చినప్పుడు లత ఏదైనా పొరపాటు చేస్తే సరిచేయవచ్చు. కానీ కెమెరాల్లో చూస్తూ ప్రతి రోజూ, ప్రతి పనిలో లోపాలు వెదకడం సరికాదు. నువ్వూ, మీ అక్క ఇలాంటివి చేయడం వెంటనే మానుకోవాలి
లతది మధ్యతరగతి కుటుంబం. డిగ్రీ చేసింది. భర్త సురేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పెండ్లీ తర్వాత ఇద్దరూ సిటీకి వచ్చేశారు. సురేష్‌ అక్క కూడా సిటీలోనే ఉంటుంది. ప్రతి చిన్న విషయం అక్కతో పంచుకోవడం సురేష్‌కి అలవాటు. తన ఇంట్లో జరిగే విషయాలను కూడా కెమెరాలు పెట్టి అక్కకు చూపించేవాడు. అంతేకాదు ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేందుకు లైవ్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాడు. అలా చూస్తూ ఆమె ఆ లైవ్‌లోనే ‘ఇదిగో ఈ పని సరిగ్గా చేయలేదు, ఆ పని సరిగ్గా చేయలేదు, ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు, వేరేవి వేసుకో, మా తమ్ముడికి ఇలాంటి బట్టలు నచ్చవు’ అని చెప్పేది. చివరకు వంట కూడా ఆమె చెప్పిందే వండాలి. ఇదంతా లతకు అస్సలు నచ్చలేదు. కెమెరాలు తీసేయమంటే సురేష్‌ వినడు.
      చిన్న చిన్న మోడ్రన్‌ డ్రెస్సులు తీసుకొచ్చి వేసుకోమంటాడు. లతకు అలాంటి బట్టలు వేసుకోవడం ఇష్టం లేదు. అయినా భర్త అడిగాడని, ఇంట్లోనే కదా అని వేసుకుంది. అయితే ఆమె ఆ బట్టలు వేసుకున్న తర్వాత సురేష్‌ ఫొటోలు తీసేవాడు. ‘ఫొటోలు ఎందుకు తీస్తున్నారు, ఎవరైనా చూస్తే బాగోదు’ అన్నా వినడు. ఆ ఫోటోలు లత అన్నయ్యకు పంపించి ‘మీ చెల్లి వద్దన్నా వినకుండా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది. నేనేమైనా అంటే ‘మనం ఉండేది సిటీలో ఈ మాత్రం వేసుకోకపోతే ఎలా’ అటుంది’ అని చెప్పాడు. దాంతో లతను తల్లిదండ్రులు కోప్పడ్డారు. ‘కుటుంబ పరువు తీస్తున్నావు. సురేష్‌ చెప్పినట్లు విను, నీకు అంతగా వేసుకోవాలి అనిపిస్తే చుడిదార్‌ లాంటివి వేసుకో. ఇంకో సారి సురేష్‌ని బాధ పెట్టకు’ అన్నారు.
      ఇలా ప్రతి విషయంలో తనదే తప్పు అన్నట్లు చూపించేవాడు. లత తన పుట్టింకి వెళ్లినా, బయటకు ఎక్కడికైనా వెళ్లినా వెంట తీసుకువెళ్లే బ్యాగ్‌ చెక్‌ చెస్తాడు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అంటే ‘ఇక్కడి నుండి ఏమైనా తీసుకొని మీ అమ్మ వాళ్లకు ఇస్తావేమో’ అని, అంటాడు. ‘ఈ చిన్న హ్యాడ్‌ బ్యాగ్‌లో ఏం తీసుకెళ్తాను’ అన్నా వినేవాడు కాదు. దాంతో ఆమె ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌ తీసుకెళ్ళడమే మానేసింది. కనీసం బట్టలు కూడా తీసుకెళ్ళదు. ఫంక్షన్‌, పెండ్లి లాంటివి జరిగితే సురేష్‌ తీసుకువస్తే వేసుకునేది, లేదంటే వాళ్ళ వదినల బట్టలు వేసుకునేది.
      తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తే లతను మాట్లాడవద్దంటాడు. అది అమ్మాయిలైనా సరే. ‘ఏంటి నీ భార్య అసలు ఎవరితో మాట్లాడదు, ఎందుకు ఇలా ఉంటుంది’ అంటే ‘తను ఎప్పుడూ అంతే, ఇలాగే ఉంటుంది’ అని చెబుతాడు. రూమ్‌లోకి వచ్చిన తర్వాత ఫోన్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తుంటాడు. లతను కూడా అలా చేయమంటాడు. అలా చేయకపోతే ఆ విషయం కూడా అక్కకు చెబుతాడు. ఆమేమో ‘నిన్ను పెండ్లి చేసుకుంది ఎందుకు, వాడిని ఆ మాత్రం సుఖ పెట్టలేవా, భర్తను ఎలా చూసుకోవాలో నేర్పించ లేదా మీ వాళ్లు’ అంటూ దెప్పిపొడిచేది.
      ఒక రోజైతే లత మంచంపై పడుకుంటే ఆమె చుట్టూ తిరుగుతూ వీడియో తీస్తున్నాడు. ఇలాంటివి ఎందుకు వీడియో తీయడం అని చెప్పినా వినకుండా ప్రతి రోజు వీడియోలు తీసేవాడు. ఒక రోజు ఆ వీడియోలు తన స్నేహితులకు చూపించాడు. అది లతకు తెలిసి భర్తతో గొడవపెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. తెలిసిన వారి ద్వారా ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
      లీగల్‌సెల్‌ సభ్యులు ఫోన్‌ చేసి సురేష్‌ని పిలిపించి మాట్లాడితే ‘నాకు నా భార్య రోజూ కొత్తగా, మోడ్రన్‌గా కనిపించాలి. నేను ఉద్యోగం చేసే దగ్గర అందరూ ఎంతో అందంగా ఉంటారు. లతను కూడా అలా ఉండు అని చెప్పడం తప్పా. నా భార్య అందాలను ఫోన్లో దాచుకుంటున్నాను. అది కూడా ఆమెకు ఇష్టం ఉండదు. ఫొటోలు, వీడియోలు తియ్యొద్దు అంటుంది. ఇక నేను ఇంట్లో లేనప్పడు ఆమె ఏం చేస్తుందో నాకెలా తెలుస్తుంది. అందుకే ఇంట్లో కెమెరాలు పెట్టాను. అది అప్పుడప్పుడు అక్క చూస్తుంది. లత ఏదైనా పొరపాటు చేస్తే చెబుతుంది అంతే. అది కూడా తప్పా. పల్లెటూరి అమ్మాయిని పెండ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
      పెండ్లి అనేది రెండు మనసులకు సంబంధించిన అందమైన బంధం. అలాంటి బంధాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావు. భార్యాభర్తలు నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలను కూడా వీడియోలు తీస్తున్నావు. వాటిని నీ స్నేహితులకు చూపిస్తున్నావు. ఇది ముమ్మాటికీ తప్పే? మీ అక్క ఇంటికి వచ్చినప్పుడు లత ఏదైనా పొరపాటు చేస్తే సరిచేయవచ్చు. కానీ కెమెరాల్లో చూస్తూ ప్రతి రోజూ, ప్రతి పనిలో లోపాలు వెదకడం సరికాదు. నువ్వూ, మీ అక్క ఇలాంటివి చేయడం వెంటనే మానుకోవాలి’ అని చెప్పి అతని ఫోన్లో వున్న లత వీడియోలు, ఫొటోలు మొత్తం డిలిట్‌ చేయించారు. ఇక ముందు ఇలాంటి పనులు చేస్తే పరిస్థితి మరోరకంగా ఉంటుందని గట్టిగా హెచ్చరించారు.
      ‘సురేష్‌ తన ప్రవర్తన మార్చుకొని మంచిగా ఉంటేనే అతనితో కలిసి ఉంటాను. లేదంటే వెళ్ళిపోతాను’ అని అందరి ముందు లత నిర్భయంగా చెప్పింది. లత కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. దాంతో సురేష్‌ ఆలోచనలో పడ్డాడు. భార్య తనతో ఇక ఉండదని, భార్య వదిలేసి పోయిందని ఊర్లో తెలిస్తే పరువు పోతుందని భయపడ్డాడు. చేసేది లేక ‘సరే మేడమ్‌, ఇకపై తనకు ఇష్టం లేని పని చేయను. ఇకపై నా వల్ల లతకు ఎలాంటి సమస్యా ఉండదు. ఒక వేళ అలా జరిగితే మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను’ అని చెప్పి లతను తీసుకొని వెళ్ళిపోయాడు.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love