సాగర్‌ స్పిల్‌ వేపై గుంతల పూడ్చివేత

Digging pits on Sagar Spillway– ఐఐటీ రూర్కీతో అధ్యయనం
– అనుమల చెక్‌డ్యామ్‌కు అనుమతి
– వచ్చే ఖరీఫ్‌కు నీళ్లందించాలి : సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నాగార్జునసాగర్‌ స్పిల్‌వేపై పడిన గుంతల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో అధ్యయనం జరపాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్‌-1 పనులను వేగంగా పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌ నాటికీ నీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో సహా హైలెవల్‌, లోలెవల్‌, లింక్‌ కెనాల్‌తోపాటు సాగర్‌ స్పిల్‌వేపై పడ్డ గుంతల పూడ్చివేతపై మంత్రి అధ్యక్షతన మంగళవారం జలసౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో నల్లగొండ లోక్‌సభ సభ్యులు కుందూరు రఘువీర్‌ రెడ్డి, శాసనసభ్యులు కుందూరు జయవీర్‌ రెడ్డి, మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కుందూరు జానారెడ్డి, నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ వినరుకష్ణారెడ్డి, ఈఎన్సీలు అనిల్‌కుమార్‌, యం విజయభాస్కర్‌రెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్‌, నల్లగొండ ఎస్‌ఈ అజరుకుమార్‌, సీఈ కే శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి నీటిని అందించే నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 664.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకం పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టు సేద్యంలోకి వస్తుందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి మొదటి దశ పూర్తి అయితే 7,600 ఎకరాలకు నీరందించవచ్చన్నారు. అంతేగాక హైలెవల్‌, లోలెవల్‌ కెనాళ్ల మధ్యలో చేపట్టిన లింక్‌ కెనాల్‌ పనులను సైతం వేగవంతం చేయాలని సూచించారు. 15 కిలోమీటర్ల పరిధిలో రూ. 62.26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కాలువ నిర్మాణం కోసం కావలసిన 65.02 ఎకరాలకు గాను ఇప్పటికే 43.31 ఎకరాల భూమిని సేకరించినట్టు తెలిపారు. త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. చివరి భూములకూ నీరందేలా ఏఎంఆర్‌, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ల పరిధిలోని 90.43 కిలోమీటర్ల మేర కాలువలను రూ. 42.26 కోట్ల వ్యయంతో 60 మిల్లీమీటర్ల మేర కాంక్రీట్‌ లైనింగ్‌తో మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలోని 39 ఐడీసీ ఎత్తిపోతల పథకాలలో ఎక్కువ భాగం పనిచేయడం లేదనీ, పనిచేయని వాటిని గుర్తించి మరమ్మతులకు అయ్యే ఖర్చు తాలూకు అంచనాలు రూపొందించి సత్వరమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అనుమల చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.

Spread the love