”సార్ మా అమ్మాయి మాటంటే పడదు. ఏమనకండి”
”చదువు చెప్పుమని తోలితే ఈ కొట్టుడేంది సార్”
”డ్రెస్ ఏసుకరాక పోతే నిలబెడుతరా. ఇంటికి పంపుతరా. అంత సక్కగనే నడుత్తుందా”
మాటలు తుమ్మెదల్లా మోగుతున్నవి. తల్లిదండ్రుల వైఖరి బాధ్యతకు అడ్డంకిగా ఉన్నదని తలపట్టుకున్నాడు టీచర్.
”వీడు నిన్న నల్లాలు విరగకొట్టిండు”
”వీడు బాత్‌రూంలోని సింక్ పగలగొట్టిండు”
”వీళ్ళు సిగరెట్లు, బోనిఫిక్స్‌లు బాత్‌రూంలలో తాగుతున్నరు”
”నోట్స్, టెస్ట్‌లు రాస్తలేరు పిల్లలు”
”వీడు మొబైల్‌తో అమ్మాయిల ఫొటోలు తీస్తున్నడు”
”ఈమె నోట్‌బుక్‌లో లవ్‌లెటర్ కనిపించింది”
పిల్లలపై టీచర్స్ చేసిన ఫిర్యాదులు చీమల్లా మెదడులో పాకుతున్నాయి. ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడు హెడ్‌మాస్టర్.
”డ్రెస్ పిండేసింది మమ్మీ. అందుకే ఏసుక రాలేదు”
”బుక్కు ఇయ్యలేదు టీచర్. అందుకే రాయలేదు”
”ఫెయిర్ నోట్స్ ఎవరో ఎత్తుకపోయిండ్రు. మల్ల రాయల్నా”
”సార్… వీడు మా ఇంట్లోల్లను బూతులు తిడుతున్నాడు”
”మన స్కూల్ వెనకగల ఇంటి ముందు ఉచ్చపోసిండు వాడు”
విద్యార్థుల జవాబులు, అలవాట్లు, వికృత చేష్టలు అన్నీ గుర్తొచ్చి ఉద్యోగ వైరాగ్యం పుట్టింది. చాలామంది టీచర్స్‌లో ఇది కనిపించింది. దాని దాపున వారి విధుల విరక్తి ఉంది. విధిలేక పని చేస్తున్నవారు అనేకులు. పిల్లలను ప్రభావితం చేయాల్సిన ఉపాధ్యాయులు చేతులెత్తేయడం ఒక విషాదం. పని చేసే చేతులకు చట్టం పేరున కళ్ళెం వేయడం, చట్టం మాటున పని తప్పించుకోవడం రెండూ బడిలో ఉన్నాయి. కొత్త మార్పుల పట్ల ఉపాధ్యాయుల ఉదాసీనత, వాటి కోసం బడిని ప్రయోగశాలగా మార్చడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరడం, రెంటికి బడి వేదిక అయింది.
కరోనా కాలంలో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పించిన ప్రభుత్వం తరగతి గదుల్లో డిజిటల్ మాధ్యమం ద్వారా పాఠాలు చెప్పాలని నిర్ణయించింది. ఫలితంగా బళ్ళలోకి ఐ.ఎఫ్.పి.బి. (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ బోర్డ్) లు దిగుమతయ్యాయి. కొత్తను స్వాగతించని మనసులు ‘ఈ పోరగాండ్లు వింటరా’ అని తప్పుపట్టాయి. తుఫాన్ ఎవరి కోసం ఆగదన్నట్లు స్మార్ట్ క్లాసులు ముస్తాబయ్యాయి. నాల్గు ఫ్యాన్లు, నాలుగు ట్యూబులు డ్యూయల్ డెస్క్‌లతో నిండింది తరగతి. దానికి తోడు పెద్దసైజు ప్యానల్ బోర్డు గోడకు చేరింది. తరగతి హోమ్‌థియేటర్‌ను తలపించింది. ఒకరిద్దరు ఉపాధ్యాయులు చెప్పడానికి ముందుకొచ్చారు. మిగతావారు వెనుకంజ వేశారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ టీచింగ్ ఫొటోను వాట్సప్ ద్వారా పంపాలని పై నుంచి ఆదేశం వచ్చింది. పెద్దలకు సంకటం, పిల్లలకు ఆటవిడుపు కేంద్రంగా మారింది తరగతి గది.
మెల్లమెల్లగా కొందరు ఉపాధ్యాయులు స్మార్ట్‌బోర్డ్‌ను విద్యార్థుల సహాయంతో ఉపయోగించసాగారు. స్మార్ట్ బోర్డును ఆపరేట్ చేయడంలో విద్యార్థులే ముందున్నారు. కరోనా కాలపు అనుభవం, సెల్‌ఫోన్ ఆసక్తి వాళ్ళను ముందుండేలా చేసింది. స్మార్ట్‌బోర్డ్ (అనేకులు టీవీ అని పిలిచారు) సహాయంతో బోధించడం సులువు. టీవీ చూపిస్తూ చదువు చెప్పడం తేలిక. వాళ్ళకెంత వరకు అర్థమవుతుందో కాని టి.వి. లోని చిత్రాల వల్ల తరగతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఇలాంటి మాటలు జీవం పోసాయి. కొద్ది రోజుల్లోనే తరగతి పిల్లలందరు టీవీని ఆపరేట్ చేసే స్టేజికి వచ్చారు. టీవీ లాక్‌ను చెడగొట్టారనే విషయం వినవచ్చింది.
”కొంతమంది ప్రార్థనకు ముందే వచ్చి టీవీay చెడ్డ చెడ్డ బొమ్మలు చూస్తున్నారు”
”నిన్న సార్ లేనప్పుడు పదో తరగతోల్లు పాటలు పెట్టుకున్నారు”
ఇలాంటి రకరకాల ఫిర్యాదులు వినపడుతున్నవి. స్మార్ట్ బోర్డ్ పగలగొడతారేమో అనే భయం స్థానంలో కొత్త సమస్య వచ్చిచేరింది. జేబుల్లో సెల్‌ఫోన్స్‌పెట్టుకొని విద్యార్థులు వస్తున్నారని అర్థమయింది. లక్షలాది డబ్బు పోసి బడిలో బిగించిన టీవీ వల్ల బాగుపడ్డదెవరు? భంగపడ్డ దెవరు? అనే విచికిత్స మొదలయింది. కలికాలమా! కరోనా కాలమా!! అర్థం కాకుండా ఉన్నది. స్మార్ట్ బోర్డ్‌ను పిల్లల బారినుండి, పిల్లలను బోర్డ్ బారినుండి రక్షించడం తలకుమించిన పనయింది. బోర్డ్ వాడకానికి ఉత్సాహం చూపని ఉపాధ్యాయులు, అత్యుత్సాహం చూపే విద్యార్థుల మధ్య సమన్వయ సాధన ఎండమావిగా కనపడింది.
ఎవరో కొట్టినట్లు తెలివయింది. కలగన్నానా! నిజమైతుందా!! ఉద్యోగాలు పోతాయా!! సవాలక్ష సందేహాలు పురుడు పోసుకోసాగాయి. తెల్లారగట్ల వచ్చిన కల నిజమైతుందట. వెన్నుపూస వణికింది. లేని భయాల్ని ఊహించుకోకని మెదడు వెన్ను తట్టింది. ఇంతకీ ఏమిటా కల?
క్లాసంతా గోలగా ఉంది. క్లాసులోకెళ్లాను. నిశ్శబ్దం అలుముకుంది.
”గురువు గారూ ఈ రోజు టీవీ పాఠం వింటాం” ముక్తకంఠంతో అన్నారు పిల్లలు.
గొంతెత్తి పద్యం పాడే అవకాశం జారిపోయింది. మాటతో మంత్ర ముగ్దుల్ని చేసి పాఠం వినిపించడానికి కాలం చెల్లింది. పిల్లల కోరిక కాదనడానికి అధికారం లేకుంటైంది. పాఠ్యపుస్తకంలోని బొమ్మలు పిల్లల్ని ఆకర్షించడానికి ఉద్దేశించినవి. సగం పాఠం అర్థమయ్యేవిగా ఉండేవి. అలాంటి బొమ్మలే ఇపుడు టీవీలోకి వచ్చి చేరాయి. పుస్తకాన్ని వదిలి పిల్లలు దృశ్యం వైపు మరలారు. మనసు చివుక్కుమంది. బొమ్మ కదిలింది. గొంతెత్తి పాడింది. అక్కడ కూడా నాలాంటి గురువు గారే పాఠం చెప్పసాగారు. నాది ప్రేక్షక పాత్ర. అపుడపుడు జోక్యం చేసుకొని పాఠం చెప్పాను. పిల్లల కళ్ళు టీ.వి. వైపు. నా బోధన చెవికెక్కలేదని అర్థమయింది. నాలాగే టీవీలో కూడా గురువు ప్రశ్నలు అడిగాడు. టీవీలోని పిల్లలు జవాబు లిచ్చారు. పిల్లల సందేహాలకు గురువు సమాధానలిచ్చాడు. నేను – పిల్లలు వింటూ చేష్టలుడిగి శ్రోతలమయ్యాయి. అలా పీరియడ్ పూర్తయింది.
”పాఠం అర్థమయిందా. అర్థం కాకుంటే అడగండి” అన్నాను.
”సినిమా చూసినట్లనిపించింది. అడగడానికేమీ లేదు” అన్నాడు.
పాఠం పూర్తయ్యాక ఒకరిద్దరు ప్రశ్నలడిగేవారు. ఈ రోజు అడగలేదంటే నా బోధనలో లోపముందా? టీవీ బోధనలో లోపముందా? అర్థం కాలేదు. అన్ని పాఠాలు, సబ్జక్టులన్నీ ఇలానే చెప్పాలనే ఆదేశాలొచ్చాయి. టీవీ ద్వారా పాఠాలను ప్రదర్శించడానికి సాంకేతిక పరిజ్ఞానమున్నవాడు ఒక్కడుంటే చాలు. నలుగురు టీచర్ల పని ఒక్కడు చేసే సమయమొచ్చింది. అన్ని సబ్జెక్టుల డిజిటల్ లెసన్స్ తయారయి ఉన్నాయి. నలుగురి పని ఒక్కడు చేస్తే మిగతా వారి ఉద్యోగాలు మాయమయ్యే పరిస్థితి ఉంది. అర్థమయ్యేసరికి భవిష్యత్తును ఎవరో కత్తిరించినట్లనిపించింది. వచ్చిన కల గుర్తు తెచ్చుకునే సరికి కంట నీరుకారింది. కల నిజమౌనా? కథ మారునా? కన్నీరే మిగులునా? అనేక సందేహాలు ఎదను నాటుకున్నాయి.
ఈ బోర్డుతో కాలం గడిపితే ఉన్న తెలివి ఊడుతుందేమో! ఎంత మాయలమారి ఇది. వెంటవెంటనే రంగులు మార్చుతుంది. గొంతు మార్చుతుంది. పాఠం చెప్పడానికి చదవాల్సిన అవసరం లేదు. తాకితే చాలు తెర మీద బొమ్మ పలుకుతుంది. పాఠం చెబుతుంది. హాయిగా కాలం గడపవచ్చు. ఆకర్షణీయమైన గొంతు, అలుపెరుగని ముఖంతో బొమ్మ పాఠం చెబుతుంటే కళ్ళప్పగిస్తారు పిల్లలు. టెన్షన్ లేకుండా బతకొచ్చు. పిల్లలు టెక్నాలజీకి అలవాటు పడితే మంచిదేగా. ప్రపంచమంతా సంకేతాల మయం. సాంకేతికతను దూరముంచితే ఎలా? మనుషుల్లాగే బోర్డ్ కూడా ఫిగర్స్‌ను, కలర్స్‌ను మార్చడానికి అనుకూలం. ఒకే స్క్రీన్‌పై బహురూపుల్లో బహుళ ప్రయోజనాలు. రకరకాల ఆపరేషన్స్, అప్లికేషన్స్ కలిగి గోడకు తిష్టవేసింది. ఏది కావాలంటే అది. ఏ భాషైనా, ఏ విషయమైనా రాదు, లేదు, అనదు. అంతా కోరుకున్న సమయం ప్రకారం.
యంత్రం మనిషిని మించింది. అదే పనిగా చూస్తే కళ్ళు పోవా, కరెంట్ పోతే బోధన కుంటుపడదా? కుంటి సాకులు వద్దు. అలవాటుపడాలి. లేకుంటే వెనకబాటే. ఇది బహుళార్థసాధకం. అప్రమత్తత అవసరం. లేకుంటే అనర్థం. కల ఎంతపని చేసింది. ఎంతో నేర్పింది.
ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. బడికి సమాజం తల్లిదండ్రులరూపంలో వచ్చింది. వారి భాగస్వామ్యం కోసం బడి ఎదురుచూసింది. మగవాళ్ళ హాజరుకంటే ఆడవాళ్ళ హాజరు ఎక్కువుంది. ఇంట్లో పిల్లల్ని పట్టించుకునేది వారేకదా! చెప్పడానికి ఇదే మంచి తరుణం. చెప్పాల్సిన వారికి చెప్పే అవకాశం వచ్చిందని ఆనందం. చెప్పబోయే విషయంపై పట్టు ఉందా? లోతైన అవగాహన ఉందా? ఎవరైనా ప్రశ్నిస్తే జవాబివ్వగలనా? అనే ప్రశ్నలు తేనెటీగల్లా కుట్టాయి. జవాబివ్వలేకున్నా మంచి చెబుతున్నాననే నమ్మకం ఉంది. ఎదుటివారు అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకున్నా ఆచరించగల వెసులుబాటు వారికుందా? నా మాటలు విని నవ్వుకోరా? అనే అనుమానాలు వాట్సప్ మెసేజుల్లా దాడిచేసాయి. వాటన్నిటిని పక్కకునెట్టి చెప్పడం మొదలు పెట్టాను.
”ఇది సాంకేతిక యుగం. ప్రభుత్వం పాఠశాలల్లో కంప్యూటర్‌ను ప్రవేశపెట్టింది. కరోనాకాలంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించింది. మన టీవీ ద్వారా పాఠాలను ప్రసారం చేసింది. విద్య, నిపుణ ఛానల్స్ ద్వారా ఇది జరిగింది. చాలా మంది వ్యక్తులు ప్రైవేట్‌గా పాఠాలు తయారుచేసి యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు. ఇవన్నీ చాలా ఉపయోగకరమైనవి. ”ఇంటింటా చదువుల పంట, టి-సాట్’ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోమని ప్రభుత్వం నిర్దేశిస్తున్నది. ఇంట్లో టీవీ ఉన్నట్లే చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే. పలక-బలపం, కలం-కాగితం, బుక్-నోట్ బుక్స్ స్థానంలో టీ.వి.-సెల్‌ఫోన్, కంప్యూటర్-ల్యాప్‌టాప్‌లు వచ్చి చేరాయి. పిల్లవాడికి సెల్‌ఫోన్ ఇవ్వండి. మీ సమక్షంలోనే పాఠాలు నేర్చుకోనివ్వండి. మీరు ఉంటే విద్యార్థికి క్షేమం. లేకుంటే క్షామం” అంటూ ముగించాను.
– డా|| బి.వి.ఎన్. స్వామి
9247817732