– జయప్రదం చేయండి… : బీఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టిన రోజైన నవంబరు 29 యావత్ రాష్ట్రానికి ప్రత్యేకమైన రోజని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన పోరాటంతోనే కేంద్రం దిగొచ్చి… ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రావణ్ తదితరులతో కలిసి కేటీఆర్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. బుధవారం సేవా కార్యక్రమాలను చేపట్టాలనీ, ఇండ్లపై బీఆర్‌ఎస్ జెండాలు ఎగరేయాలని సూచించారు. రైతుబంధుకు ఈనెలాఖరులో నిధులను విడుదల చేస్తున్న క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఎందుకు ఉలికి పడుతున్నారంటూ ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రైతు బంధు గురించి ప్రశ్నిస్తున్న రేవంత్… కేంద్ర పథకమైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో బీజేపీతో ఆయనకు లోపాయికారీ ఒప్పందముందని విమర్శించారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్ల స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను ఎందుకు నిలబెట్టిందని ప్రశ్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్… రైతాంగానికి రోజుకు ఐదు గంటల కరెంటే చాలని అంటున్నారు.. రేవంతేమో మూడు గంటల కరెంటే చాలని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… కర్నాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామన్న ఆ పార్టీ హామీ గురించి ఏం చెబుతారని అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.