రష్యాతో ప్రత్యక్షంగా తలపడే ధోరణి

Direct confrontation with Russia– యూఎన్‌లో బైడెన్‌ ప్రసంగం
నెల్లూరు నరసింహారావు 
ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 78వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం ప్రసంగించాడు. ఒక దేశం మరొక దేశంపైన యుద్ధాన్ని ప్రకటించేముందు చేసిన ప్రసంగంలా బైడెన్‌ ప్రసంగం సాగింది. అమెరికా ప్రపంచ వ్యాప్తంగా వున్న తన మిత్ర దేశాలతోను, భాగస్వాములతోను కలిసి తమ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడు కునేందుకు పోరాడుతున్న సాహసులైన ఉక్రెయిన్‌ ప్రజలకు మద్దతు ఇస్తుం దని ఐక్యరాజ్య సమితిలో బైడెన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి రష్యా మాత్రమై బాధ్యత వహించవలసి ఉంటుందని, ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపగలిగే శక్తి రష్యాకు మాత్రమే ఉందని ఆయన అన్నాడు. శాంతికి అడ్డంకిగా రష్యా మాత్రమే ఉందని, శాంతిని నెలకొల్పాలంటే ఉక్రెయిన్‌ లొంగిపోవటం, ఉక్రెయిన్‌ భూభాగం రష్యాకు కావాలని బైడెన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నాడు.
ఇది ఒక సాధారణ ప్రసంగం కాదు. యుద్ధాన్ని చర్చల ద్వారా పరిష్కరించటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రష్యాపైన ఎడతెగకుండా కొనసాగిన దాడిగా బైడెన్‌ ప్రసంగం సాగింది. షరతులు లేకుండా రష్యా లొంగి పోవాలని, రష్యన్‌ ప్రభుత్వం కూలిపోవాలని, రష్యా భౌగోళికంగా ముక్కముక్కలు కావాలని అమెరికన్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే అమెరికా ప్రత్యక్షంగా రష్యాతో తలపడాలి. ఉక్రెయిన్‌ లో వెనకవుండి నడిపిస్తున్న యుద్ధాన్ని అమెరికా, రష్యాల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మార్చాలి. ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధం ఇప్పటికే అది అమెరికా యుద్ధంగా మారింది. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ కు ఆయుధాలనే కాకుండా యుద్ధ నిపుణులను,గూఢచార సమాచారాన్ని, అన్నిరకాల రవాణాను అందిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌ చేస్తున్న ప్రతిదాడి ఘోరంగా విఫలమైన నేపథ్యంలో తమ లక్ష్యాలు నెరవేరాలంటే అమెరికా, నాటో దేశాల సైన్యాలు రష్యాతో పూర్తి స్థాయి యుద్ధం చేయటంతప్ప మరో మార్గంలేదనే నిర్దారణకు బైడెన్‌ ప్రభుత్వం వచ్చింది.
మరోవైపు అమెరికాలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారుతుందని, నూతనంగా ఏర్పడే ప్రభుత్వ విధానంలో మార్పు ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌ ఆశిస్తున్నాడని అమెరికన్‌ మీడియా అంచనావేస్తోంది. ఇదొక భ్రమ మాత్రమే. అటువంటిది జరగకుండా 2024లో అమెరికాలో జరగనున్న ఎన్నికలకు ముందే బైడెన్‌ రష్యాతో వెనక్కుతగ్గే వీలులేని స్థాయిలో సాయుధ ఘర్షణకు దిగాలనే ఆలోచనతో ఉన్నాడు. బైడెన్‌ అలోచనకు తగ్గట్టుగానే అణుయుద్ధమైనా తాను వెనకాడబోననే తరహా ప్రకటనలను విడుదల చేస్తున్నఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడీమీర్‌ జెనెన్స్కీ బైడెన్‌ వైఖరిని ప్రతిబింబిస్తున్నాడు.
అమెరికా, నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌ లో ఇప్పటికే రష్యాపైన అప్రకటిత యుద్ధం చేస్తున్నాయి. అన్ని రకాల ఆయుధాలను, గూఢచార సమాచారాన్ని, సైనిక నైపుణ్యాలను అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి అందిస్తోంది. ఉక్రెయిన్‌ కేవలం సైన్యాన్ని మాత్రమే ఉపయోగిస్తోంది. ఇక మిగిలింది అమెరికా సైన్యం రష్యాతో ప్రత్యక్షంగా తలపడటమే. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఇంత లెక్కలేకుండా తీవ్రతరం చేయటం వెనుక అమెరికాను కుదిపివేస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఉంది. అమెరికన్‌ ద్రవ్యపెట్టుబడికి ప్రభుత్వం అప్పుచేసి అందించే ఉద్దీపనలపైన ఆధారపడక తప్పటంలేదు. దీనికి తోడు ”డాలర్‌ ఆధిపత్యానికి” బీటలువారటంవల్ల పరిస్థితి మరింతగా క్షీణించింది. అలాగే అమెరికాలో కార్మికుల సమ్మెలు బాగా పెరిగాయి. దేశంలో ప్రతిపక్ష కార్యకలాపాలు ఎక్కువ అవటంకూడా అమెరికా యుద్ధ ప్రణాళికను మరింతగా ముందుకు తేవటానికి కారణంగా ఉంది.
ఏకధ్రువ ప్రపంచం అంతమై నిరంతరం మారుతున్న బహుళధ్రువ ప్రపంచంలో అమెరికా, పశ్చిమ ఐరోపా పలు కుబడి రోజురోజుకూ అడుగంటుతోంది. మరోవిధంగా చె ప్పాలంటే అమెరికా సామ్రాజ్యం పతనం అవుతోంది. చరిత్ర లో సామ్రాజ్యాలు ఆవిర్భవిస్తున్నప్పుడు, పతనమౌతున్నప్పు డు ప్రమాదకరంగా మారటాన్ని గమనించవచ్చు. వర్తమాన ంలో పతనావస్థలోవున్న అమెరికన్‌ సామ్రాజ్యానికి చైనా, రష్యాల అభివృద్ధిని ఆపాలంటే మానవాళి అస్థిత్వానికే ము ప్పుగా పరిణమించే అణుయుద్ధం చేయటమో లేక మారిన వాస్తవ పరిస్థితికి సర్దుకుపోవటమోతప్ప మరోమార్గం లేదు.

Spread the love