ఒకే గొడుగు కిందకు విపత్తుల నిర్వహణ

under one umbrella Disaster management– 365 రోజులూ పని చేసేలా తీర్చిదిద్దాలి
– జూన్‌ 4 లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయండి : సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించిన వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పని చేసేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని కోరారు. శనివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు విచ్చేసిన సీఎం… ఆసెంటర్‌కు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. జూన్‌ 4లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలన్నారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామనీ, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఓపెన్‌ సెల్లార్‌ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వాటికి బారికేడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కంటోన్మెంట్‌ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమస్యాత్మక నాళాల వద్ద అవసరమైతే ప్రతీ రోజు క్లీనింగ్‌ చేపట్టాలన్నారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడటంతోపాటు కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పవర్‌ మేనేజ్మెంట్‌ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదనీ, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదన్నారు. పని చేసే వారిని ప్రోత్సహిస్తామనీ, వారికే ఉన్నత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పారు.
డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దు : సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో మరింత యాక్టివ్‌గా పని చేయాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించాలని కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలనీ, గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చైన్‌ను బ్రేక్‌ చేయాలని ఆదేశించారు. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలున్నా…ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దనీ, అవసరమైతే యాంటీ డ్రగ్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం సమర్థవంతంగా పని చేసే వారిని ప్రోత్సహించాలన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా.. ప్రభుత్వం సహకరిస్తున్నదని తెలిపారు. డ్రగ్స్‌ అనే పదం వింటేనే భయపడేలా చర్యలు ఉండాలని సూచించారు.రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలనీ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

Spread the love