జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిలుపుదల

– ఈనెల 26 సాయంత్రం 5 గంటల వరకు స్టే : సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వారణాసి కోర్టు జారీ చేసిన సర్వే ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈనెల 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు గత గురువారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు సోమవారం సర్వే ప్రారంభించారు. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారణాసి కోర్టు సర్వే ఆదేశాలపై స్టే విధించాలని కోరింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారమే అత్యవసర విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలను వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. సర్వేపై స్టే విధించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లేందుకు మసీదు కమిటీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

Spread the love