– బీజేపీ అభ్యర్థులపై శివసైనికుల తిరుగుబాటు
– నాలుగు స్థానాల్లో పోటీకి సన్నాహాలు
ముంబయి : మహారాష్ట్రలో అధికార మహాయుతిలో అసమ్మతి మంటలు చెలరేగుతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన 99 మంది అభ్యర్థుల జాబితాపై శివసేన మండిపడుతోంది. ముఖ్యంగా కల్యాణ్ ఈస్ట్, థానే, నవీ ముంబయి, ముర్బాద్ స్థానాలలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థులకు శివసేన నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ స్థానాలలో పోటీకి దిగాలని స్థానిక శివసేన నేతలు నిర్ణయించుకున్నారు. కల్యాణ్ ఈస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ భార్య సులభా గైక్వాడ్‌ను బీజేపీ బరిలో దింపింది. ఆమెకు మద్దతుగా ప్రచారం చేసే ప్రశ్నే లేదని స్థానిక శివసేన కార్యకర్తలు తెగేసి చెప్పారు. ఉల్హాస్‌నగర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్‌పై గణపత్ కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో జైలులో ఉన్నారు. ఆయన భార్యకు బీజేపీ టిక్కెట్ ఇవ్వడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభ్యర్థిని మార్చాలంటూ వారు ప్రదర్శన కూడా నిర్వహించారు.
థానేలో సంజరు ఖేల్కర్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వడాన్ని కూడా శివసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గం శివసేన అధిపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కంచుకోట అని వారు గుర్తు చేశారు. నవీ ముంబయిలోని ఐరోలీలో గణేష్ నాయక్‌ను, ముర్బాద్‌లో కిషన్ కాథోర్‌ను బీజేపీ పోటీకి నిలపడం కూడా శివసేన ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ స్థానాలలో షిండే నేతృత్వంలోని శివసేన అభ్యర్థులను నిలపాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా షిండే సేన మంగళవారం రాత్రి 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం ఏక్‌నాథ్ షిండే థానేలోని కప్రీ-పంచ్‌పకడీ నుండి పోటీ చేస్తారు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ పంచన చేరిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు దక్కాయి. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి. 23న ఫలితాలు ప్రకటిస్తారు.