– బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దూదేకుల ముస్లింలపై వైసీపీ ప్రభుత్వం వివక్షను చూపుతున్నదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆదుకుంటామంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నీటి మూటలేనని చెప్పారు. బుధవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం మైనార్టీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షలకుపైగా ఉన్న దూదేకుల జనాభా కూడా ముస్లింలలో అంతర్భాగమని సీఎం జగన్ గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద ముస్లింలకు అందుతున్న అన్ని ప్రభుత్వ పథకాలనూ దూదేకుల వారికీ వర్తింపజేయాలనే కనీస అవగాహన లేని వైసీపీ ప్రభుత్వానికి వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ముస్లిం మైనార్టీ అమ్మాయిల వివాహానికి దుల్హన్ పథకం కింద వైఎస్సార్ కానుకగా రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తానంటూ నాలుగేండ్ల క్రితం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిబంధనల పేరుతొ ఆ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. దీని కారణంగా పేద ముస్లిం కుటుంబాల్లో కుమార్తెలకు ఆర్థిక భారంతో పెండ్లి చేయలేక తల్లి దండ్రులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్ షాదీతోఫా అందిస్తూ, దూదేకులకు వైఎస్సార్ కల్యాణమస్తు అందిస్తున్నారని విమర్శించారు. దూదేకుల సమాజం పట్ల వైసీపీ ప్రభుత్వం పట్ల అవలంభిస్తున్న వివక్ష ఇది కాదా?అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇకనైనా మొద్దునిద్ర వీడాలనీ, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో దూదేకులకు బీఆర్‌ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆలమూరు రఫీ తదితరులు పాల్గొన్నారు.