భారత్‌లో ప్రజాస్వామ్యంపై చర్చించండి

– బైడెన్‌కు అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల లేఖ
వాషింగ్టన్‌ : భారత్‌లో ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లపై డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన అమెరికా కాంగ్రెస్‌ (అమెరికా చట్టసభ) సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో జరిపే చర్చల సందర్భంగా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాలని వారు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ను కోరారు. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన 75 మంది డెమొక్రటిక్‌ సభ్యులు ఆయనకు లేఖ రాశారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ అమెరికాలో ఐదు సార్లు పర్యటించినప్పటికీ పూర్తి స్థాయిలో దౌత్యపరమైన ప్రొటోకాల్‌ లభించడం ఇదే మొదటిసారి.
‘అమెరికా, భారత్‌ మధ్య బలమైన సంబంధాలు కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాము. అయితే స్నేహితులు కూడా తమ మధ్య నెలకొన్న విభేదాలను హుందాగా, సూటిగా చర్చించుకోవచ్చు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలున్న అంశాలతో పాటు ఆందోళన కలిగించే విషయాలను కూడా ప్రస్తావించండి’ అని ఆ లేఖలో వారు కోరారు. సెనెటర్‌ క్రిస్‌ వాన్‌ హాలెన్‌, చట్టసభ ప్రతినిధి ప్రమీలా జయపాల్‌ నాయకత్వంలో ప్రతినిధులు ఈ లేఖ రాశారు. దీనిపై 18 మంది సెనెటర్లు, 57 మంది ప్రతినిధిసభ సభ్యులు సంతకాలు చేశారు. వీరిలో అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సెనెటర్లు బెర్నీ శాండర్స్‌, ఎలిజబెత్‌ వారెన్‌ కూడా ఉన్నారు. కాగా తన పర్యటనపై అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులు, పలువురు నాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారంటూ అంతకుముందు మోడీ ట్వీట్‌ చేశారు. అయితే భారత్‌లో రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీలు, పౌర సమాజ సభ్యులపై జరుగుతున్న వేధింపులపై వ్యక్తమవుతున్న ఆందోళనను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక ఆయన దృష్టికి తేగా స్పందించేందుకు నిరాకరించారు.
మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ, మతపరమైన స్వేచ్ఛ వంటి అంశాలను బైడెన్‌ గౌరవిస్తారని కాంగ్రెస్‌ ప్రతినిధులు ఆ లేఖలో గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై ఈ విలువలను విశ్వసనీయతతో ముందుకు తీసికెళ్లాలంటే వాటిని స్నేహితులతో పాటు శత్రువులకూ సమానంగా వర్తింపజేయాలని తెలిపారు. అమెరికాలోనూ ఇవే సూత్రాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌లో మతపరమైన అసహనం పెరుగుతోందని, పౌర సమాజాలు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారని, పత్రికా స్వేచ్ఛ పైన, ఇంటర్నెట్‌ పైన ఆంక్షలు పెరుగుతున్నాయని వారు వివరించారు. ఈ సందర్భంగా వారు భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా విదేశాంగ శాఖ ఇచ్చిన వార్షిక నివేదికలను ప్రస్తావించారు.
‘మేము ఏ భారతీయ రాజకీయ నాయకుడికి కానీ, పార్టీకి కానీ మద్దతు ఇవ్వడం లేదు. దానిపై అక్కడి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అయితే అమెరికా విదేశాంగ విధానంలో కీలకంగా ఉన్న ముఖ్యమైన సూత్రాలకు మేము మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఘనమైన రెండు దేశాల మధ్య విజయవంతమైన, బలమైన, దీర్ఘకాలిక సంబంధాలు నెలకొనాలంటే అనేక అంశాలపై మోడీతో చర్చించడం చాలా అవసరం’ అని వారు ఆ లేఖలో కోరారు. కాగా మోడీతో మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చించాలని అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించిన అమెరికా కమిషన్‌ దేశాధ్యక్షుడు బైడెన్‌ను కోరింది. రెండు దేశాల మధ్య చర్చకు వచ్చే ద్వైపాక్షిక అంశాలలో మత స్వేచ్ఛను కూడా చేర్చాలని ఓ ప్రకటనలో సూచించింది.
మోడీ ప్రసంగాన్ని బహిష్కరిస్తాం
కాంగ్రెస్‌ ఉభయసభలను ఉద్దేశించి మోడీ చేసే ప్రసంగాన్ని తాను బహిష్కరిస్తానంటూ డెమొక్రటిక్‌ సభ్యురాలు రషీదా తాలిబ్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా రాజధానిలో మోడీకి వేదిక కల్పించడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, ముస్లింలు-మైనారిటీలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు, జర్నలిస్టులపై ఆంక్షలు వంటి విషయాలలో మోడీకి సుదీర్ఘ చరిత్ర ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు చెందిన మరో సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌ కూడా తాను మోడీ ప్రసంగ కార్యక్రమానికి హాజరు కావడం లేదంటూ ట్వీట్‌ చేశారు. ‘మోడీ ప్రభుత్వం మైనారిటీలను అణచివేస్తోంది. హింసకు పాల్పడుతున్న హిందూ జాతీయవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది. పాత్రికేయులను, హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వేధిస్తోంది’ అని ఆమె తెలిపారు. అణచివేతలు, హింస విషయంలో ప్రధాని మోడీకి ఉన్న రికార్డుపై మానవ హక్కుల సంఘాలతో చర్చిస్తానని ఆమె అన్నారు.

Spread the love