సెక్స్… బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడని అంశాల్లో ముందు వరసలో ఉంటుంది. ఇక పిల్లల సమక్షంలో ఇది ఎప్పుడూ మాట్లాడకూడని టాపిక్. నిజానికి ఈ దాపరికమే టినేజ్ పిల్లలతో తప్పటడుగు వేయిస్తోంది. అందుకే చిన్న వయసు నుంచే పిల్లలకు లైంగిక విద్యపై అవగాహన కల్పించడం చాలా అవసరం. అసలు పిల్లలకు ఏ వయసు నుంచి లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి? ఈ సున్నితమైన అంశం గురించి వాళ్లకెలా వివరించాలి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ రోజు తెలుసుకుందాం…
లైంగిక విద్యపై చిన్నారుల్లో అవగాహన కల్పించడం మాట సరే… కానీ ఏ వయసు నుంచి దీన్ని ప్రారంభించాలనే దానిపై చాలా మంది తల్లిదండ్రులకు స్పష్టత ఉండదు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచే వాళ్ల వయసును బట్టి ఒక్కో అంశంపై అవగాహన పెంచడం మంచిదంటున్నారు నిపుణులు.
చిన్న వయసు నుండే…
ఐదేండ్ల నుంచే లైంగిక విద్యకు సంబంధించిన ప్రాథమిక విషయాలు వాళ్లకు వివరించాలంటున్నారు నిపుణులు. అది కూడా ఆ వయసులో వాళ్లు అర్థం చేసుకొనే బాషలోనే.. శరీర భాగాలు, వాటి పేర్లు, వాటి విషయంలో పాటించే ప్రైవసీ, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటివన్నీ వారికి వివరించాలి. అలాగే 9-12 ఏండ్ల మధ్య వయసున్న చిన్నారులు రుతుచక్రం ప్రారంభమయ్యే దశలో ఉంటారు. కాబట్టి అందుకు అనుగుణంగా శరీరంలో జరిగే మార్పులు, మానసికంగా ఎదురయ్యే సమస్యలు, భావోద్వేగాల గురించి వారికి తెలియజేయాలి.
మరింత లోతుగా…
టీనేజ్‌లోకి ప్రవేశించిన అమ్మాయిలతో లైంగిక అంశాల గురించి మరింత లోతుగా చర్చించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం, గర్భనిరోధక పద్ధతులు, సుఖ వ్యాధులు వంటి అంశాలపై అవగాహన కల్పించాలి. నిజానికి ఈ విషయాల గురించి వాళ్లతో చర్చించడం కాస్త కష్టమే అయినా మరో విధంగా వాళ్లు తెలుసుకొని తప్పటడుగు వేసే కంటే తామే సున్నితంగా వివరించడం మంచిదంటున్నారు నిపుణులు.
నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలి
లైంగిక విద్యపై అవగాహన కల్పించే క్రమంలో మీరు చెప్పడం, పిల్లలు వినడం కాకుండా ఇరువైపుల నుంచి చర్చ జరగాలంటున్నారు నిపుణులు. చర్చజరిగేటపుడు పిల్లలకొచ్చిన సందేహాల్ని నివృత్తి చేయడం తల్లిదండ్రుల బాధ్యత అంటున్నారు. వాళ్లు అడిగిన సందేహాలకు నిజాయితీగా, నిర్మొహమాటంగా సమాధానమివ్వడం వల్ల ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలు తెలుసుకోగలుగుతారు. ఒక వేళ ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వాళ్లనే ఆన్‌లైన్ చెక్ చేసుకోమని చెప్పకుండా ఇద్దరూ కలిసి దానికి సమాధానం వెతికే ప్రయత్నం చేయాలి. ఇలా మీకు అర్థమైన విషయాన్ని వారికి వివరించడం ఓ పద్ధతి. అలాగే మీడియాలోనూ దీనికి సంబంధించిన వార్తలు కొన్ని వస్తుంటాయి. వాటిని పిల్లలు చూడకూడదని ఛానల్స్ మార్చేయడం సరికాదు. ఎందుకంటే దీనివల్ల అదేంటో తెలుసుకోవాలన్న ఆరాటం పిల్లల్లో పెరుగుతుంది. ఇది కూడా వారిని పెడదోవ పట్టించవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి కుటుంబ సభ్యులు నిర్మొహమాటంగా మాట్లాడుకోగలిగితే సమాజంలో దీనిపై ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోతాయి.
పొరపాట్లు దొర్లకుండా
లైంగిక విద్యపై పిల్లలకు అవగాహన కల్పించే క్రమంలో, ఈ విషయాల గురించి వాళ్లతో చర్చించేటప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. కొంతమంది దీని గురించి పదే పదే పిల్లల దగ్గర ప్రస్తావించడం ఇష్టం లేక అన్ని విషయాలూ ఒకే సారి మాట్లాడి ‘హమ్మయ్య..ఎలాగైతేనేం చెప్పాలనుకున్నది చెప్పేశాం’ అని చేతులు దులుపుకుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీని గురించి తరచూ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగినప్పుడే పిల్లలకు సరైన అవగాహన వస్తుందని, మరింత తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ను ఆశ్రయించే అవకాశం ఉండదంటున్నారు.
పద్ధతిగా మాట్లాడండి
చిన్న వయసులో ఉన్న పిల్లలు లైంగిక అంశాల గురించి అర్థం చేసుకోలేరని, అందుకే 15-20 ఏండ్ల వయసొచ్చాకే దీని గురించి చెప్పాలనుకుంటారు కొందరు తల్లిదండ్రులు. కానీ ఇది పొరపాటు అంటున్నారు నిపుణులు ఇంతకు ముందు చెప్పకున్నట్లు చిన్న వయసు నుంచే ఒక్కో అంశం గురించి వివరించడం వల్ల ఒక వయసొచ్చే నాటికి వారికి పూర్తి అవగాహన వస్తుందంటున్నారు. పిల్లలకు లైంగిక విద్యపై అవగాహన కల్పించే క్రమంలో భాష విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణలు. ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడడం కాకుండా సరైన పదాలు ఉపయోగిస్తూ, సున్నితంగా, పద్ధతిగా టాపిక్ గురించి వివరించడం మంచిదంటున్నారు. అప్పుడే చర్చ సౌకర్యవంతంగా సాగుతుందంటున్నారు.
నిపుణుల సలహాలూ…
పిల్లలు లైంగిక విషయాల గురించి అడిగితే పేరెంట్స్ ఏమనుకుంటారో? తిడతారేమోనని సందేహించకుండా నిర్మొహమాటంగా తమలోని సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. ఒకవేళ ఆయా అంశాల గురించి పుస్తకాల్లో, ఆన్‌లైన్‌లో వెతికినా అందులోని నిజానిజాల గురించి తల్లిదండ్రులతో చర్చించడం వల్ల తప్పటడుగు వేయకుండా జాగ్రత్తపడొచ్చు. అంతేకాదు పేరెంట్స్‌కి తెలియని విషయాలేవైనా ఉంటే నిపుణుల సలహాలూ తీసుకోవచ్చు.