– సరిహద్దులు చెరిపేస్తూ వ్యాప్తి ఊతమిస్తున్న ఘర్షణలు, యుద్ధాలు
– వాతావరణ మార్పులతో మరింత ప్రబలం
– తొలగని మంకీపాక్స్ ముప్పు
– ‘కోవిడ్’ పాఠాలు నేర్వని పాలకులు, ప్రజలు ఔషధాలకూ లొంగడం లేదు
ప్రపంచంలో నేటికీ నాలుగైదు వందల కోట్ల మంది ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కుండబద్దలు కొట్టింది. వివిధ దేశాలలో లక్ష మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయని, కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారని ‘యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్’ తెలపడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వివిధ దేశాలను వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. సూడాన్‌లో కలరా విలయతాండవం చేస్తోంది. దీని బారిన పడిన పదిహేను వేల మందిలో 473 మంది చనిపోయారు. తాజాగా ఓ కొత్త కోవిడ్ వేరియంట్ వచ్చిపడింది. అది ఇప్పటికే 27 దేశాలలో వ్యాపించింది. వందలాది మందిపై ప్రభావం చూపుతోంది.
న్యూఢిల్లీ : బాక్టీరియా, వైరస్‌లు, ఫంగీ, పారాసైట్స్ వంటి సూక్ష్మజీవులు ఔషధాలకు లొంగని పరిస్థితిని వైద్య పరిభాషలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యానికి పెను ముప్పు కలిగిస్తుంది. ప్రపంచ దేశా లలో సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణం ఏఎంఆర్‌యేనని జనవరిలో దావో స్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు కూడా వెల్లడించింది. 2050 నాటికి ఏఎంఆర్ కారణంగా కోటి మంది ప్రాణాలు కోల్పో తారని హెచ్చరించింది. 2050 నాటికి వాతావరణ మార్పుల కారణంగా 1.45 కోట్ల మరణాలు సంభవిస్తాయని, ప్రపం చానికి ఆర్థికంగా 12.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతుందని ఆ నివేదిక తెలిపింది. వివిధ సంస్థల అంచనాలు, సర్వేలు, నివేదికలను పరిశీలిస్తే భవిష్యత్తులో మానవాళిపై ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు విరుచుకుపడబోతున్నాయని అర్థమవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి నుండి ఈ ప్రపంచం ఏవైనా పాఠాలు నేర్చుకున్నదా అని అనుమానాలు కలుగుతున్నాయి.
సరిహద్దులు దాటుతూ…
ప్రపంచంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితిపై ఐరాస ఫౌండేషన్‌లో గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ అహ్మద్ ఆగ్‌వెల్ ఏమన్నారంటే…
ప్రస్తుతానికి ఉష్ణోగ్రత ఓ మోస్తరు ముప్పు కలిగిస్తోంది. పలు దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాపించింది. రాబోయే కాలంలో ఎదురయ్యే ఆరోగ్య విపత్తులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలసికట్టుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలను వివిధ వ్యాధులు కలవరపెడుతున్నాయి. మంకీపాక్స్, డెంగ్యూ, కలరా, పోలియో వంటి వ్యాధులు ప్రజల జీవితాలతో అడుకుంటున్నాయి. ఆరోగ్య వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. వ్యాధులు ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. అవి ఎల్లలు లేకుండా విజృంభిస్తున్నాయి. వీటి కారణంగా ప్రపంచం ఇప్పుడు ఓ మోస్తరు ముప్పును మాత్రమే ఎదుర్కొంటోంది. అది పెరగనూ వచ్చు. తగ్గనూ వచ్చు. ప్రపంచ దేశాల స్పందనపై అది ఆధారపడి ఉంటుంది.
నాటి జాగ్రత్తలు నేడేవి?
వ్యాధులపై అన్ని దేశాలు పూర్తి సన్నద్ధత ప్రదర్శించాల్సి ఉంటుంది. పరిస్థితి నియంత్రణలో ఉండాలంటే చేయాల్సింది ఎంతో ఉంది. కోవిడ్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదు. అప్పుడు మాస్కులు ధరించాం. శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకున్నాము. దూరం పాటించాము. మరి ఇప్పుడో? అన్నీ మరచిపోయాము. పరిస్థితిని మన నియంత్రణలో ఉంచుకోవడంలో విఫలమవుతున్నాము. కోవిడ్ నివారణకు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఆ ముప్పు తప్పిన తర్వాత వాటన్నింటినీ అటకెక్కించాము. ఉదాహరణకు అప్పుడు విమానాశ్రయాలలో టెంపరేచర్ స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి కన్పిస్తున్నాయా?
ఆదమరిస్తే అంతే
కోవిడ్ వచ్చినప్పుడు ఆరేడు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేశారు. మంకీపాక్స్ విషయంలో ఆ ఆతృత కన్పించలేదు. దానిని తక్షణమే అదుపు చేయాల్సిన అవసరం ఉన్నదని గుర్తించలేకపోయాము. డెంగ్యూ జ్వరాల విషయంలోనూ అంతే. పాలకులు కూడా కోవిడ్ నుండి పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ మంకీపాక్స్ ముప్పు తొలగిపోలేదు. మంకీపాక్స్ వ్యక్తుల మధ్య త్వరగా వ్యాపిస్తుంది. ఆ వ్యాధి సోకిన వ్యక్తి వేరే దేశం వెళితే అది కూడా అతనితో పాటే ప్రయాణిస్తుంది. ఇదో గొలుసు కట్టు లాంటిది. ఆదమరిస్తే మరింత ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఓ వ్యాధి సోకిందనుకోండి. అది ఏ మూలకైనా వ్యాపిస్తుంది.
ఘర్షణలతో మరింత వ్యాప్తి
కోవిడ్, ఎబోలా, కలరా వ్యాధులు నేర్పిన పాఠాలకు అనుగుణంగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ వ్యాధులు మనకు నేర్పిన పాఠం ఏమిటి? సరిహద్దులతో నిమిత్తం లేకుండా అందరూ సంఘటితం కావాల్సిన ఆవశ్యకతను అవి నొక్కి చెప్పాయి. వ్యాధులను అరికట్టేందుకు ఉపకరించే వైద్య పరికరాలు, మందులు, వనరులు, పరిజ్ఞానం ఏ దేశంలో ఉన్నప్పటికీ అవి అందరికీ అందుబాటులో ఉండాలి. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి.
పలు ప్రాంతాలలో మానవీయ సంక్షోభం నెలకొని ఉంది. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, తాగునీరు లభించడం లేదు. కాలుష్య వాయువులను పీల్చాల్సి వస్తోంది. దీంతో ప్రమాదం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఘర్షణలు జరిగే ప్రాంతాలు లేదా వార్ జోన్స్‌లో శరణార్థుల ద్వారా వ్యాధులు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి. కొత్తగా సూపర్‌బగ్స్ వృద్ధి చెందుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఔషధాలు కనిపెడుతుంటే అవి వాటిని తట్టుకునే సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఆ బగ్స్ ద్వారా కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలు కూడా ప్రమాదంలో పడిపోతాయి. ఘర్షణలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ఆరోగ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తాయి.
వాతావరణ మార్పులతో…
వాతావరణ మార్పులు కూడా ఆరోగ్యంపై బాధాకరమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ మార్పుల కారణంగా సమాజాలు ఓ నిర్దిష్ట వ్యాధి బారిన పడకపోవచ్చు. అయితే అవి సంభవించినప్పుడు కొన్ని ప్రాంతాలలో వ్యాధులు ప్రబలుతాయి. అంతేకాదు… అప్పటికే ఉన్న వ్యాధులు ఈ మార్పుల కారణంగా మరింత వృద్ధి చెందుతాయి. వరదలు సంభవించి, నీరు కొద్ది గంటలు మాత్రమే నిల్వ ఉంటే పెద్దగా వ్యాధులు రాకపోవచ్చు. కానీ నీరు ఎక్కువ కాలం అలాగే ఉండిపోతే మాత్రం వ్యాధులు తప్పవు. వాతావరణ మార్పుల కారణంగా ప్రజా సమూహాలు దీర్ఘకాలం నష్టపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదం ఉంటుంది.
జనారణ్యాలలో ప్రవేశిస్తే…
అడవులు, మంచు పర్వతాలలో కూడా ఇప్పుడు మానవ సంచారం కన్పిస్తోంది. మనం ఇప్పటి వరకూ చూడని గుహలు, అడవులు, సముద్రపు లోతులలోకి వెళ్లామనుకోండి. అక్కడ బగ్స్, వ్యాధి కారకాలు ఉండవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా ఈ బగ్స్, వ్యాధి కారక సూక్ష్మక్రిములు, జంతువులు జనారణ్యాలలో ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రజలు గతంలో ఎన్నడూ అనుభవంలోకి రాని వ్యాధుల బారిన పడతారు.
వ్యాపారంగా ఆరోగ్య సేవలు
ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు పెద్దగా ఖర్చు చేయకపోవడంతో లక్షలాది ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా పేదలు వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితి తలెత్తుతోంది. వారిని నాణ్యమైన సేవలు లభించడం లేదు. ఇప్పుడు ఆరోగ్య రక్షణ అనేది వ్యాపారమై పోయింది. కొన్ని రకాల వైద్య సేవల నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. ఆరోగ్య రంగంలో వ్యాపార ధోరణికి ఓ పరిమితి అంటూ ఉండాలి. అప్పుడే పేదలపై భారం పడదు.