పసిడి గన్నేరుపూలు పందిట్లో ఫక్కున నవ్వాయి. పందిట్లో గన్నేరు వేసుకున్నావమ్మా అని అమ్మలక్కలంటే అమృతపాణికి ఎక్కడలేని కోపంవచ్చేంది. ఏం గన్నేర్లు వేసుకుంటే తప్పా! శివుడికి ప్రియమైన గన్నేరు పూలు తనకూ ఇష్టం. మొండిగా గన్నేర్లు వాకిట్లో పెంచింది అమృతపాణి. అమృతపాణి చేయి నిజంగా అమృత హస్తం. ఏ మొక్క నాటినా ఇట్టే నాటుకుంటుంది. ఊర్లోవాళ్లంతా అమృతపాణిని పిలుచుకుపొయి తమ ఇళ్లల్లో పూలమొక్కలూ, కూరగాయల మొక్కలూ నాటించుకుంటారు. ”నీవు నాటిన అరటి పిలకలు అరణ్యంలా వ్యాపించి విరగకాస్తున్నాయి అమృతం!” అంటూ సీతామహలక్ష్మమ్మ ఒయ్యారంగా అన్నది. కాని అమృతపాణి గన్నేరు వాకిట్లో వేయడం ఆమెకూ నచ్చలేదు.
”ఏమిటే అమృతం! ఎన్నెన్ని పూలమొక్కలు లేవు దేశంలో. మల్లెలు, మొల్లలు, రోజాలు, పారిజాతాలు ఇవన్నీ వదిలి గన్నేరేమిటే గన్నేర్లూ!” అని సాగదీసుకుంది సీతామహలక్ష్మమ్మ. సాధారణంగా అమృతపాణి ఎవరి ప్రశ్నలకూ జవాబు చెప్పదు. బుగ్గలు సొట్టలుపడేట్టు నవ్విఊరుకుంది. పచ్చని గన్నేరుపూవు దగ్గరగా తనచేయి చాచి ఏది ఎక్కువ పచ్చగావుందో పరీక్షించుకుంటుంది. ఒక్కటే ఒక్క గన్నేరుపూవు కుడిచెవిమీదుగా జుత్తులో చెక్కుకుంటుంది. ఆ ఒంటిగన్నేరు అమృతపాణి బంగారు నగలకంటే, రవ్వల ఆభరణాలకంటే ఎక్కువ శోభను చేకూరుస్తుంది. సీతామహలక్ష్మమ్మ ఈసడింపు విని అమృతపాణి గన్నేరుకొమ్మ వంచి ఒకపూవు కోస్తూ ఇలా అంది.
”పిన్నిగారూ! పూలలో మంచివి చెడ్డవీ ఉంటాయా! అన్నీ పూలే. పైగా నాకు నచ్చిన పూలు గన్నేరు. నేను వాటిని నా బిడ్డల్లా పెంచుకుంటాను. లోకానికి నా గన్నేరును చూచి కోపం దేనికి?”
ఎన్నడూ జవాబు ఇవ్వని అమృతపాణి తన ప్రశ్నకు ఎదురు ప్రశ్నలాంటి మాట అనే వరకు కోపం నసాళానికి ఎక్కింది సీతామహలక్ష్మమ్మకు. గుడ్లురుముతూ అంది ”అమృతం! ఇరవై ఏళ్లు దాటుతున్నాయి. ఎన్నడో ఎక్కడికో వెళ్లిపోయిన చంద్రంగాడి కోసం ఈ తపస్సు చేసిందానికంటే ఆ గన్నేరు, జిల్లేళ్లు వదిలేసి చక్కగా పెళ్లాడరాదూ ఎవరినన్నా?”
ఆ మాటకు నిజానికి అమృతపాణి మండిపడ వలసింది. కాని చిరునవ్వుతో ఇలా అంది:
”వస్తున్నది సంక్రాంతి పండుగ. ఈ పండుగతో మూడేళ్లు నిండుతాయి అతను వెళ్లిపోయి. ఈ పండుగకు కూడా అతను రాకుంటే ఏదో మార్గం చూసుకుంటాను పిన్నిగారూ! కోప్పడకండి”
”మామ్మగదవే! అలా దారికిరా! ఒక ఇంటి దానివి కావాలని నా కోరిక. మీ నాన్న పెద్ద వాడైనాడు. ఎవరు చెప్పినా వినవు. పోలీసులకు కనపడకుండా తప్పించుకు తిరిగే దొంగలాంటి చంద్రంగాడికోసం నిరీక్షణ ఏమిటమ్మా!”
”పిన్నిగారూ! ఎవరు దొంగో, ఎవరు దొరో అందరికీ తెలుసు. చంద్రం దొంగెందుకవుతాడు? దేశంకోసం పోరాడే వాళ్లను పోలీసులు అరెస్టు చేస్తే వాళ్లు దొంగలవుతారా? నా కర్మకాలి ఆయన రాజకీయల్లో చేరాడు. నాకు పెళ్లీడు వచ్చేసరికి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగాల్సిందే. ఏనాటికైనా ఆయనే రావాలి, నేనే పెళ్లి చేసుకోవాలి. అంతే” ఈ మాటలతో అమతపాణి గుండె దుఃఖంతో పొంగిపోయింది. కళ్లల్లోనుంచి గుత్తులు గుత్తులుగా ముత్యాలు రాలాయి. ఆ మాటలు తండ్రి విని పరుగెత్తుకు వచ్చాడు.
”ఏమే! ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి హితబోధచేస్తే వాళ్లమీదికి అలా దూసుకుపోతావేమే? వాళ్లు నీ మేలుకోరేకదా చెబుతున్నది. అరణ్యంలో తపస్సు చేసుకునేవాళ్లలాగా జుట్టు విరబోసుకుని ఎంతకాలం ఇలా వుంటావు. ఈ సంక్రాంతితో నీ గడువు ముగుస్తుంది. బలవంతంగానైనా సరే నిన్ను ఎవడికో ఒకడికి ముడిపెడతా, ఇక తప్పదు” అన్నాడు. తండ్రి జానకిరామయ్య.
సంక్రాంతి…. సంక్రాంతి వస్తోంది. తాను పెట్టిన ఆరేళ్ల గడువు తీరుతుంది. మూడేళ్లనాడు సరిగ్గా సంక్రాంతిరోజున పోలీసులు వెతుక్కుంటూ రాగా చంద్రాన్ని గన్నేరు కొమ్మల చాటు నుంచి తెలివిగా తప్పించింది. ఆ నాటికీ ఈ నాటికీ చంద్రం మళ్లీ కనపడలేదు. ప్రతిక్షణం అతను ఆ గన్నేరు కొమ్మల వెనుక నుంచి వస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ అతను ఎన్నడూ కనపడలేదు.
చందమామ గన్నేరుకొమ్మల వెనుకగా తొంగిచూస్తే, చంద్రం వస్తున్నట్లనిపించేది అమత వాణికి. కానీ కాసేపట్లో చందమామ తనకు అందకుండా ఆకాశంలోకి ఎక్కిపోయేవాడు. అందని చందమామలాగే చంద్రం కూడా తనకు అందకుండా వెళ్లిపోయాడు. మళ్లీ ఒక్కనాటికీ కనపడడా! చంద్రం ఇక కనపడడనిపించేసరికి అమతపాణిగుండెలో కొండలు కూలేవి. కాని ఆకాశంలోనుంచి చందమామలా మళ్లీ తొంగి చూచేది.
”ఈ సంక్రాంతికి చంద్రం వస్తాడు. తప్పక వస్తాడు నాన్నా! చంద్రం వస్తాడు. ఈ సంక్రాంతితో నా జీవితంలోని నరకద్వారాలు మూతపడతాయి. ప్రణయ స్వర్గకవాటాలు, విచ్చుకుంటాయి నాన్నా! నా చంద్రం ఆ గన్నెరు పొదల్లోనించి నడిచివస్తాడు నాన్నా!” అంటూ పెద్దగా ఏడ్చింది అమృతపాణి. ఆకాశంలోని మబ్బుల్లా గాలికి అల్లకల్లోలమైన తన కురులను సర్దుకుని కన్నీళ్లు తడుచుకుంది.
సీతామహలక్ష్మమ్మ దగ్గరగా వచ్చి కూచుని కళ్లు తుడిచింది కొంగుతో. ”నువ్వన్నట్టే వాడు వస్తే ఇంకేం కావాలమ్మా, నీ కష్టాలు గట్టెక్కుతాయి” అంది. పసిడిగన్నేరు కన్నీరు కార్చినట్టు మంచుబొట్లు అమృతపాణి తలమీద రాలాయి. తనను ఆప్యాయంగా తల్లికంటే నిండుగా ప్రేమించే గన్నేరును చూడగానే అమతపాణికి ఆశ పొంగివచ్చింది. ఒక్కమాటతో ముఖంలో వెలుతురులు విరిశాయి.
”సక్రమంగా ఇంకా ఎన్నాళ్లుంది పిన్నీ!” అడిగింది అమతపాణి సీతామహలక్ష్మమ్మను.
”ఎన్నాళ్లూ పట్టుమని పది రోజులు లేదు”
”అంతేనా! పదిరోజులే? పదిరోజుల్లోనే నా చంద్రం వస్తాడన్నమాట” అంది అమృతపాణి.
నీ పిచ్చి గాని మూడేళ్ళ నుంచి లేనివాడు ఇప్పుడొస్తాడా? నీ పిచ్చి ఎన్నాళ్లకు వదుల్తుందే?” అన్నాడు నాన్న.
”వస్తాడు నాన్నా! వస్తాడు. అతడు రానన్నా రావాలి. నేను పోనన్నా పోవాలి. అంతే. ఈ పండుగతో తేలిపోవలసిందే” అంది ధైర్యంగా అమృతపాణి.
”ఏం మాటలే అవి అభంశుభం తెలియకుండా” అని కోప్పడింది సీతామహలక్ష్మమ్మ. అమతపాణి గబాగబా ఇంట్లోకి వెళ్ళింది. నీలిరంగు ఉల్లిపొర చీరె మీద కప్పుకొని వంగపండు రవిక భుజాన వేసుకొని వచ్చింది.
”ఇవి ఆరేళ్ళనాడు మా చంద్రం తెచ్చినవి. ఇవి కట్టుకుంటా పండుగనాడు. ఇంకేవీ వద్దు నాకు” అంది అమృతపాణి.
”పిచ్చి…. పిచ్చంటే పిచ్చే. నీకెవరు చెబుతారమ్మా. పొద్దుకూకవస్తున్నది. పోతానమ్మా! అంటూ లేచింది సీతా మహలక్ష్మమ్మ.
నా పెళ్లికి వస్తావుకదూ పిన్నీ!” అంది చిలిపిగా అమృతపాణి.
”రాక వూరుకుంటానా” అంటూ సుడిగాలిలా చుట్టుకుని వెళ్లిపోయింది. సీతామహలక్ష్మమ్మ.
తెల్లవారితే సంక్రాంతి. ఈ సాయంత్రం గన్నేరు విరగబూసినట్టు కనబడింది. బంగారం కరగబోసినట్లు పొంగిపోతున్న గన్నేరు నీడన పార్వతిలా కూచుంది అమతపాణి. ఆకాశంలో ఒక్కటొక్కటే చుక్కలు చేరుకుంటున్నాయి. చలిచలిగా వుంది. గన్నేరుపువ్వు చేతుల్లో పట్టుకుని గతకాలాన్ని నెమరువేస్తున్నది అమృతపాణి.
వద్దంటే వినకుండా ప్రభుత్వంతో తగాదా పెట్టుకున్నాడు చంద్రం. తనను విడిచిపోవలసి వస్తుందని తెలిసి ఎందుకు చేరాడు రాజకీయాల్లో? తనకంటె రాజకీయాలు ఎక్కువ ప్రియమా? మరితాను ఎన్నాళ్లు ఎదురుచూడాలి? స్వాతంత్య్రం అసలు వస్తుందా? వచ్చినా ఎన్నడొస్తుందో? అంతలో – చంద్రాన్ని ప్రభుత్వంవారు ఎంతగా హింసిస్తారో? చంద్రాన్ని పట్టుకుంటే? పట్టుకుంటే తనకు దక్కడు. మరి తప్పించుకు తిరుగుతే మాత్రం తనకు దక్కుతాడా? గాంధీమహాత్ముడు ఎందరెందరు ప్రేయసీ ప్రియులను విడగొట్టే ఉద్యమం లేవదీశాడు? ఛా తప్పు. మహత్ముడు లోకకల్యాణం కోసం పాటుపడుతున్న మునీశ్వరుడు. అలనాడు బుద్ధభగవానుడు తన తమ్ముడైన నందుణ్ణి సుందరినుండి వేరుచేస్తే సుందరి తిట్టి పోయలా! అలాగే తానూ మహాత్ముణ్ణి తిట్టడం తప్పుకదూ! దేశంకోసం కష్టపడే వ్వక్తుల్ని ప్రేమించాలిగాని ద్వేషించరాదు. పోనీ పోతున్న వాడు తనను తీసుకుపోతే. తనవల్ల అతని పనికి ఆటంకమేమో? పరిపరివిధాల అలోచించుకుంది. అమృతపాణి.
ఆ రాత్రి తిండి సహించలేదు. తండ్రి ఎంత బ్రతిమాలినా ఒక్క మెతుకైనా తినలేకపోయింది. రాత్రంతా ఏదో భయంకరమైన కలలు. పక్కలో గన్నేరుపూలు పరచుకుని పడుకుంది. అమృతపాణి. తెల్లవారడం త్వరగా జరిగితే బావుండునని ఆరాటం. తెల్లవారితే ఏం ప్రమాదమో? మరికొంత సేపు రాత్రే వుంటే బావుండునని కోరికా ఇలా పరిపరివిధాల తలపోస్తూంది అమృతపాణి.
తెల్లవారింది. ముక్కుమీదినుంచి నడినెత్తిలోకి ఎగతట్టేలా ఉర్ధ్వపుండ్రాలు ధరించి, గల్లుగల్లుమని కంచుగజ్జెలు వాయిస్తూ జియ్యరువచ్చాడు. అతని చిడతల చప్పుడికి అమృతపాణి గుండె గులగుల అయిపోయింది. భయం భయంగా లేచి బయటికి తొంగిచూచింది.
తెల్లటియెద్దు, యెద్దుమీద నల్లటి గొంగడీ, దానిమీద ఎర్రశాలువాలు, పట్టుకండువాలు కొమ్ములకు ఇత్తడి తొడుగులు. చేతిలో మునుతాడును పట్టుకుని ఎవరతను? తలకు చిరిగిపోయిన పాగా, ఒంటిమీద చిరిగిన కోటు, పెరిగిన గడ్డం, మీసాలు, వచ్చీరాక వాయిస్తున్న సన్నాయి. ఎవరతను? కొప్పులోని గన్నేరుపువ్వు మెడమీద నుంచి జారి గంగిరెద్దులవాని జోలెలో పడింది.
”బసవన్నా! అమ్మవారికీ దండంపెట్టు. కాసులుపోయమని దోసిలిపట్టు. పట్టుబట్ట లిమ్మని పట్టుబట్టు బసవన్నా” అని అరిచాడు గంగిరెద్దుల వాడు. అతని ఆరేడ్లనాడు తనను రహస్యంగా పిలిచిన చంద్రం పలుకు వినిపించింది. క్షీణించిన శరీరం, రాగి బారిన వెంట్రుకలు, నల్లపడ్డ మొహం, భయంతో తొణికిసలాడే కళ్లూ-అతను చంద్రమే. అమతపాణిగుండె జల్లుమంది. గబాగబా మెట్లు దిగి కిందికి ఉరికి వచ్చింది. చంద్రం కళ్లలోకి తదేకదీక్షతో చూచింది. అతను అవునో కాదో? బూడిద కమ్మిన నిప్పుకణికల్లా వున్న అతని కళ్లలో చంద్రం సాక్షాత్కరించాడు.
”చంద్రం” అని గట్టిగా కేకవేసింది అమృతపాణి. చంద్రం కనుసైగ చేశాడు. ఆమె మారుమాటాడకుండా నిలబడింది. అతను దగ్గరగా వచ్చాడు.
”పెద్దగా అరవకు. పోలీసులు కనిపెడతారు. నేను పట్టుపడితే వ్యూహం భగమవుతుంది. నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. మనస్సు కుదుటపరచుకో” అన్నాడు చంద్రం. అతని కళ్లల్లో సముద్రాలు తొణికిసలాడాయి.
”చంద్రం! నువ్వు ఈ పూట ఇక్కడే వుండు. ముందు ఏమిచేయాలో ఆలోచిద్దాం” అంది దు:ఖంగా అమృతపాణి.
”వీల్లేదు. పోలీసులు వెన్నాడుతున్నారు. అనుమానించారంటే నా పథకం దెబ్బతింటుంది. వెళ్లొస్తా. ధైర్యం వీడకు” అన్నాడు చంద్రం.
”అప్పుడే పోతావా చంద్రం! నేను నీకు అక్కరలేదా?”.
”అలా అనకు. నీ కోసం క్షణమొక యుగంగా గడుపుతున్నాను. నన్ను తెలుసుకో. పండుగ ఒక్కనాడైనా ఇంట్లో ఉండకుండా పోతావా?”
”ఎక్కడికీ పోను. ఈ వూర్లోనే ఉంటాను. మళ్లీ కనబడతాను”
”వీల్లేదు. నీవు ఇవాళ ఎటూ వెళ్లడానికీ వీల్లెదు.”
”అలా అనకు అమృతం! గొడవ అవుతుంది”
”నీకు కాఫీ తెస్తా తాగుదువుగాని.”
”గంగిరెద్దులవాడికి కాఫీ పోస్తే అనుమానించరూ?”
”ఫరవాలేదు. ఆ గన్నేరు చెట్టు కిందికిరా.”
”మరి గంగిరెడ్డి?”
”ఎద్దును వదిలేయి. నీవు ఇలారా!”
”ఎలా రాను అమృతం?”
”ఇటు…. ఇటు”- అంటూ అమృతం చంద్రాన్ని గన్నేరుచెట్టునీడల్లోకి తీసుకువెళ్లి కూర్చోపెట్టింది. చంద్రానికి ఎటూతోచలేదు.
”ఆ గంగిరెద్దులవానితో సోదేమిటే? ఒక పాతధోవతి ఇచ్చి వెళ్ళగొట్టక” అంటూ అమృతపాణి తండ్రి లోపలినుంచి అరిచాడు.
గన్నేరుచెట్ల వెనుకనుంచి దొడ్డిదారిని చంద్రాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లింది అమతపాణి. గంగిరెద్దు గన్నేరు కొమ్మలకింద పడుకుంది.
చంద్రం ఆరేళ్ళకు తలంటి పోసుకున్నాడు. వేడి వేడి పరమాన్నం తిన్నాడు. నువ్వులతో చేసిన భక్ష్యం ఆరగించాడు. చంద్రం వచ్చింది అమృతపాణి తండ్రికి కూడా తెలియదు. మూడేళ్ల తరువాత అమృతపాణికి పండుగ! తల్లి లేని తనకు తానే ఆ యింట్లో పెద్ద.
”ఇవాళ ఈ వూరంతా ఇలా అలంకరించి వుంది ఎందుకో చెప్పు చంద్రం?” అని అడిగింది అమృతపాణి
”సంక్రాంతి గనుక” అన్నాడు చంద్రం
”కాదు”
”మరేమిటి?”
”ఇవాళ మన పెండ్లి” – అంది అమతపాణి నవ్వూ ఏడుపూ కలగలసిన కంఠంతో.
”అదేమిటి అమృతం! అలా అంటావు?”
”అవును, ఇవాళ మనపెళ్లి, ఆరేండ్లకు కనపడ్డావు.”
”సంక్రాంతి నాడు ఎవరైనా పెళ్లిచేసుకుంటారా? పైగా నేను రహస్యజీవితం గడుపుతున్న వాణ్ణి. ఎవరి కంటబడ్డా ఉరికంబం ఎక్కవలసిందే”
”పెళ్లికి ఎవరి కంటబడడం దేనికి? నాకంట పడితే చాలు” అంటూ నవ్వింది. అమృతపాణి గబాగబా పచ్చగన్నేరుపూలతో రెండు పెద్ద దండలు గుచ్చింది. తాను కొత్త చీరె కట్టుకుంది. చంద్రానికి కొత్త బట్టలు కట్ట బెట్టింది. అతన్ని తన ఇంట్లోని పూజామందిరంలోకి తీసుకువెళ్లింది. చంద్రం మెళ్లో గన్నేరుదండ వేసింది. చంద్రం కళ్లల్లో ఆశానిరాశలు అల్లుకుని కనిపించాయి. అమృతపాణి మెడలో గన్నేరు దండవేసి తన కన్నీరు ముత్యాలతో ఆమెను అలంకరించాడు. నిశ్శబ్దంగా, ఎవ్వరూ లేకుండా, ఏ మంత్రతంత్రాలూ లేకుండా ఇరువురూ వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వరుల పటం మీద కుంకుమా, పూలూ చల్లారు.
”చంద్రం!” అన్నది అమృతపాణి. దు:ఖం పొంగి వచ్చింది. అమాంతం వెళ్లి చంద్రాన్ని కౌగిలించుకుంది.
”నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లకు చంద్రం. వెళ్లవుకదూ!” అని అడిగింది అమృతపాణి.
చంద్రం జవాబు చెప్పకుండానే ఆమెను తనకు మరీ దగ్గరగా తీసుకున్నాడు. గన్నేరుచెట్లకింద గంగిరెద్దు గంట మోగింది. రేడియోలో సన్నాయి మ్రోగింది. ఇరువురి హృదయాలూ మంత్రాలు పఠించాయి.
”మీ నాన్నకైనా తెలియకుండా ఈ వివాహం ఏమిటి అమృతం?” అని అడిగాడు చంద్రం.
”నీవు వచ్చిన విషయం ఆయనకు కూడా తెలియనీయవద్దన్నావుగా?”
”అవును. ఆయనకు తెలిస్తే నేను రహస్యంగా రావడాన్ని ఇష్టపడకపోవచ్చు” అన్నాడు చంద్రం.
చంద్రానికి తానువండిన వంటకాలన్నీ వడ్డించి భోజనం పెట్టింది. చిరకాలంగా సంస్కారంలేక జడలుకట్టిన పోయిన తల వెంట్రుకలకు అమృతపాణి రాసిన పరిమళ తైలం తనముక్కుపుటాలలోకి సువాసనలు చిమ్ముతుంటే ఆరేడ్ల నుంచి లేని నిండు నిద్ర పోయాడు. చంద్రం మనసులో భయం భయంగా వున్నా అలసటవల్ల నిద్రపట్టింది. సాయంత్రం దాకా అలాగే పడుకున్నాడు.
ప్రభుత్వం దృష్టిలో అపరాధి, ప్రజల దృష్టిలో నిరపరాధి అయిన చంద్రాన్ని దాచడానికన్నట్టు చీకట్లు త్వరత్వరగా ఆకాశంలోనుంచి భూలోకంలోకి చొరబడ్డాయి. ఊరంత సంక్రాంతి వేడుకల మైకంలో వుంది. పోలీసులు తమ తమ ఇండ్లలో కుటుంబాలతో కాలం గడుపుతున్నారు.
జాతీయోద్యమంలో వామపక్ష సభ్యుడు చంద్రం. హింసించే ఆంగ్లప్రభుత్వాన్ని హింసతోనే పడగొట్టాలనే విశ్వాసం అతనిది. కనుక ప్రభుత్వానికి లొంగకుండా రహస్యంగా తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. అతని విశ్వాసాన్ని ఎవ్వరూ మార్చలేదు. అమృతపాణి కూడా మార్చదలచుకోలేదు.
బాగా చీకటిపడగానే అమృతపాణి, చంద్రం దొడ్డి దారిని నది ఒడ్డుకు వెళ్లారు. చంద్రం బుజాల వెచ్చదనంతో చలిని ఎదిరిస్తున్నది అమృతపాణి. చిన్ననాడు ఇద్దరూ నదిగట్టున ఆడుకునేవారు. పసితనంనాటి పసందులు ఇప్పుడు ఎక్కడినుంచి వస్తాయి! చిక్కులూ చికాకులూ లేకుండా హాయిగా పక్షులవలె, నక్షత్రాలవలె కాలం వెళ్లబుచ్చినరోజులవి. తమ బాల్యం కళ్లకుకట్టినట్టై ఇద్దరూ నిట్టూర్చారు. చుక్కలు గుచ్చిన నీలి ఆకాశపు పందిరి క్రింద, జలజలా ప్రవహిస్తున్న వాగుపక్కగా చలిలో, ఇసుకలో రెండుగంటలు కూర్చున్నారు. మూడేడ్లు ఒకరికోసం ఒకరు దాచుకున్న రహస్యాలు విప్పి విరబోసుకున్నారు. ఆ ఒక్కరాత్రే వాళ్లకు స్వర్గం. తెల్లవారితే విడిపోతారు.
”ఏమైనా సరే, నీవు నన్ను విడిచిపోవద్దు ఇవాళనుంచి మనం భార్యాభర్తలం” అంది అమృతపాణి. చంద్రం మాట్లాడలేదు. ఇద్దరూ ఇంటివైపు వచ్చారు. దారిలో తమను ఎవరో కనిపెడుతున్నట్లు భయం వేసింది. గబాగబా ఇంట్లోకి చొరబడ్డారు.
చిచ్చుబుడ్డిలా పూలు పేల్చి చల్లారిపోతోంది రాత్రి. అమృతపాణి తన్మయత్వంతో ఒళ్లు మరచి పడుకుని వుంది. చంద్రానికి గుండెలో ఎవరో గుద్దినట్టైంది. మెలకువ వచ్చింది. లేచాడు. సుమారు నాలుగుగంటల సమయం చలిగాడ్పు విశ్రుతవిహారం చేస్తున్నది. అమృతపాణి వైపు జూచాడు చంద్రం. అమాయికమైన ఆ ముఖం చంద్రబింబంలా మెరుస్తున్నది.
ఏమీ దాచకుండా తనహృదయం సమస్తం దోచి ఇచ్చిన అమృతపాణిని వదిలేసి ఎలావెళ్లడం? కానీ వెళ్లాలి. అటు లోకం పిలుస్తోంది. ఇటు తన మెత్తనిచేతితో అమతపాణి పిలుస్తున్నట్టుంది. ఎటు వెళ్లడం? ఉదయం నిద్రలేచి తాను వెళ్లిపోయినది ఎరిగి ఎంత బాధపడుతుంది అమృతపాణి! నిద్రలో సైతం తీయని గన్నేరు దండ ఆమెలో ఎంత బావుంది.!
ఒక పావుగంట పాటు వెనుకాముందూ ఆడాడు చంద్రం. మనసు గట్టిచేసుకున్నాడు. దేశం పిలుపు మనసులో రొదచేస్తున్నది. ఈ ఊపుతో తెల్లవాళ్లను వెళ్లగొట్టాలి. 1942 ఉద్యమం చిరస్థాయిగా దేశచరిత్రలో నిలిచిపోవాలి.
”రా నాయనా రా” అంటున్నది భారతవాణి. ”వెళ్లకు చంద్రం! వెళ్లకు” అంటున్నది అమృతపాణి.
బయట గంగిరెద్దు మెడలో గంటలు మోగాయి. తూర్పు తెలతెలవారబోతున్నది. చంద్రం అమృతపాణి దగ్గరగా వెళ్లి నిలుచున్నాడు.
ఆమె బుగ్గల నున్నదనం, కురుల మెత్తదనం, ఆ అరచేతుల కోమలత్వం- హృదయంలోని అమృతం అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. తన మెడలోని గన్నేరుదండ షర్టు పక్కజేబులో కుక్కుకున్నాడు. బయలుదేరాడు. గబగబా దొడ్డి దారిని బయటపడ్డాడు. గంగిరెద్దు వెంట నడిచింది.
”తెల్లారనైనా లేదు. అప్పుడే మళ్లీ గంగిరెద్దులవాళ్లు” అంటూ అమృతపాణి తండ్రి నిద్రలో గొణుక్కున్నాడు.
అమృతపాణికి నెలలు నిండాయి.
”నిజం చెబుతావా? లేదా?” అని అరిచాడు తండ్రి.
”నిజం ఇంతే నాన్నా! చంద్రం సంక్రాంతికి వచ్చాడు. నీకు గూడా తెలియకుండా దాచాను.
మేమిద్దరం వెంకటేశ్వర్లు సాక్షిగా వివాహం చేసుకున్నాం. ఇది ముమ్మాటికి నిజం” అని ఏడ్చింది అమతపాణి. లోకమంతా గుసగుసలు పోయింది. తనమాటలు తండ్రిగానీ, లోకంగానీ నమ్మలేదు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసువారు మాత్రం అనుమానించారు. ఇంటి చుట్టూ కాపలాపెట్టారు. కూతురు తన మెడకు ఉరిపోసిందనుకున్నాడు తండ్రి. ఏమిచేయాలో తోచలేదు. అమృతపాణి రమానర్సింగు హోంలో చేరింది.
సీతామహలక్ష్మమ్మ ఒక్కతే అమృతపాణిని చూడడానికి వచ్చింది. అమృతపాణి మాటలు ఆమెకూడా నమ్మలేదు. అయినా అపాయంలో వున్న అమృతపాణిని అదుకుంది సీతామహలక్ష్మమ్మ. తన దౌర్భాగ్యానికి ఇటు లోకాన్ని, అటు చంద్రాన్ని నిందించింది. అమృతపాణి. ఆడపిల్ల కలిగింది. పిల్లనుచూచి మురిసిపోయింది అమృతపాణి. పిల్లా తల్లి ఇంటికి వచ్చారు. అమృతపాణి తండ్రి అవమానంతో తనగది విడిచి బయటికి రావడంలేదు. శిశువును చూడనైనా లేదు. వూర్లోవాళ్లు తలొకమాటా అంటుంటే తల నరికినట్టుంది. ఇంటికి ఎవరూ రావడంలేదు. ఎప్పుడైన వస్తే సీతామహలక్ష్మమ్మ ఒక్కతే. ఆమె కూడా ఉన్న నాలుగు గడియలూ నానామాటలూ అంటుంది.
”పోయిన సంవత్సరం సంక్రాంతికి పిల్ల ఎంత సంతోషంగా వుంది! పాపం మళ్లీ సంక్రాంతి వస్తోంది, ఏమి లాభం!” అంది నిట్టూరుస్తూ సీతామహలక్ష్మమ్మ.
”ఆ మాట ఎత్తకు సీతమ్మ వదినా” అన్నాడు అమృతపాణి తండ్రి.
”పట్టుమని పండుగ నాలుగు రోజుల్లేదు. ఆ గదిలో అదీ. ఈ గదిలో నీవు ఏడుస్తూ కూచుంటే ఎలాగా” అంది సీతామహలక్ష్మమ్మ.
”ఫరవాలేదు. ఇలా చీకటిలో చావనీ” అని విసుగుకున్నాడు అమృతపాణి తండ్రి. పూజకు పూలుకోసుకుని ఇంటికి వెళ్లిపోయింది సీతామహలక్ష్మమ్మ.
రానే వచ్చింది సంక్రాంతి మళ్లీ.
రోడ్డమీద పత్రికలమ్మేవాడు పెద్దగా అరుస్తూ వెళుతున్నాడు.
”రాజకీయ నేరస్తులమీద నుండి నిర్భందాల తొలగింపు. ఆంధ్రప్రభ చదవండి…… తాజా వార్తలు”
గదిలో పిల్లకు పాలిస్తున్న అమృతపాణి, గబగబా మెట్లు దిగి కిందికి పరుగెత్తుకు వచ్చింది. పేపర్ల వాణ్ణి పిలిచింది. గబగబా పేపరులాక్కుని చదివింది. జైలునుంచి విడుదలైన వారి లిస్టూ, రాజకీయోద్యమంలో పాల్గొంటున్న నేరస్థుల మీద ఆంక్ష తొలగించిన వార్త, కింద పేర్లు గబగబా కళ్లతో చదివింది. ‘ఏ చంద్రశేఖరరావు’ అన్నపేరువద్ద ఆమె కళ్లు ఆగిపోయాయి. కాళ్లు తడబడ్డాయి.
పేపరు పుచ్చుకుని తండ్రిగదిలోకి పరిగెత్తింది అమృతపాణి.
”అణా ఇవ్వండమ్మా!” అని పిలిచాడు పేపర్ల వాడు.
”చంద్రంమీద నిషేధం తొలగిపోయింది నాన్నా! మీ అనుమానాలన్నీ పోతాయి” అంది అమృతపాణి
”వాడు వచ్చేదాకా నాతో మాట్లాడకు” అని గద్దించాడు తండ్రి.
”ఒక అణా ఇవ్వు నాన్నా! పేపరుకొంటాను” అంది దీనంగా అమృతపాణి. జేబులో అణా తీసి విసిరేశాడు తండ్రి. పుచ్చుకుని బయటికివచ్చింది. మొఖాన్ని పేపర్లతో కప్పుకుని నిలుచున్నాడు పేపర్లవాడు.
”ఇదిగో అణా” అంది అమృతపాణి. అతను మాట్లాడలేదు. పై నుంచి పేపర్లు తీసి చూశాడు చంద్రం!
”చంద్రం” అని పిలిచింది అమృతపాణి. తలకు చుట్టుకున్న మఫ్లర్ విప్పుతూ- ”ఆ ఏడుస్తున్న పాప ఎవరు?” అని అడిగాడు చంద్రం.
”మనపాప……” అంది అమృతపాణి.
చంద్రంముఖం వివర్ణమైంది. అతనిముఖంలోని వైవర్ణం చూచి అమృతపాణి భయపడిపోయింది. ఇద్దరూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అలాగే నిలబడ్డారు- మెట్ల మీద అమె, మెట్ల కింద అతనూ! అతను పక్కకు చూశాడు.
గన్నేరుపువ్వు పక్కున నవ్వింది. ఆ నవ్వుతో గడిచిన సంవత్సరపు సంక్రాంతి సినిమాలా సాక్షత్కరించింది.
”ఓ! మన పాపా!” అని నవ్వాడు చంద్రం. క్రుంగిపోయిన అమృతపాణి ఒంగిపోయి తానూ నవ్వింది.
”చంద్రం మెట్లు ఎక్కాడు. అమృతపాణి మెట్లు దిగుతోంది. మధ్యగా ఇద్దరూ కలుసుకున్నారు. ఎడమచెవికి పైగా కురులలో కులుకుతున్న గన్నేరుమొగ్గను పెదవులతో తాకాడు చంద్రం.
”ఏం పాప? అని రహస్యంగా అడిగాడు చంద్రం.
”అమ్మాయి” అంది అమృతపాణి.
”అయితే మనస్వాతంత్య్రోద్యమంలో విజయం లభించింది కనుక ‘విజయం’ అని పేరు పెడదాం అన్నాడు చంద్రం.
”అలాగే…. అదిగో విజయం ఏడుస్తోంది” అంది అమృతపాణి. తండ్రి కోసం గబగబా మేడమీదికి వెళ్లింది. చంద్రం మామగారి పాదాలు తాకాడు.
పై నుంచి ‘విజయ’ ఏడుపు వినబడింది.
”విజయ ఏడుస్తోంది. వెళ్లి చూచొస్తా మామగారూ!” అన్నాడు చంద్రం.
”విజయ ఎవరూ ?” అని అడిగాడు ఆశ్చర్యంగా అమృతపాణి తండ్రి.
”మా కూతురూ, మీమనుమరాలూ. స్వాతంత్రోద్యమంలో విజయం సాధించాం. కనుక దానికి విజయ అని నామకరణం చేశాం” అన్నాడు చంద్రం.
”నామకరణం ఎపుడు జరిగింది?” అని అడిగాడు అమృతపాణి తండ్రి.
”ఇప్పుడే, ఈ మెట్లమీదే” అన్నాడు చంద్రం.
”అన్నీ క్షణాల్లో జరుపుకుంటున్నారే” అని తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు అమృతపాణి తండ్రి.
”అవును, మీ కూతురు క్షణంలో పెండ్లి జరిపించింది” అన్నాడు నవ్వుతూ చంద్రం.
సీతామహలక్ష్మమ్మ వచ్చింది. ఈ మాటలన్నీ విని అందీ ”ఏమర్రా! మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారూ! పిల్లనీ కన్నారూ, నామకరణం కూడా చేశారూ!”
”అవును అత్తగారూ! కొన్ని రహస్యంగా జరిగేవి వుంటాయి, కొన్ని సదృస్యంగా జరుగుతాయి” అన్నాడు చంద్రం.
”ఏం రహస్యాలో గాని మాకుమాత్రం పంచభక్ష్యపరమాన్నాలతో సుష్టుగా భోజనాలు పెట్టించు నాయనా!, కూతురు బారసాలనాడు” అంది సీతామహలక్ష్మమ్మ.
అమృతపాణి వచ్చింది.
”గత సంక్రాంతినాడు పెళ్లి, ఈ సంక్రాంతికి బారసాల. బాగుందర్రా!” అన్నాడు తండ్రి.
చంద్రం, అమృతపాణి మేడమీదికి వెళ్లారు. ”మీరు ఎప్పుడూ మారువేషాల్లో వస్తారేమండీ! నిరుడేమో గంగిరెద్దులవాడిలా వచ్చారు, ఈ సంక్రాంతికేమో పేపర్లమ్మే వాడిలాగా…”
”అవునవును. మనదేశం వేషం కూడా మారబోతున్నది” అంటూ నవ్వాడు చంద్రం.
(1961లో ముద్రణ)
– దాశరథి కృష్ణమాచార్యులు