వివాదాస్పద స్వామీజీ ఆశారాం పిటిషన్ తిరస్కరణ..

నవతెలంగాణ-హైదరాబాద్ : జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన ఆరోగ్యం క్షీణిస్తున్నందున శిక్ష నిలిపివేయాలని కోరుతూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టవేసింది. ఆశారాం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పోలీసు కస్టడీలో మహారాష్ట్రలో చికిత్స తీసుకునేందుకు ఆయనను అనుమతించాలంటూ ఆశారాం తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఆశారాం అభ్యర్థనను తిరస్కరించింది. చికిత్స కోసం మాత్రం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కాగా, సూరత్‌లోని ఆయన మరో ఆశ్రమంలోనూ మహిళపై లైంగికదాడి చేసిన కేసులోనూ ఆయన యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

Spread the love