పేటియంలో ఉద్యోగులకు ఉద్వాసన..!

పేటియంలో ఉద్యోగులకు ఉద్వాసన..!బెంగళూరు : ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటియంలో భారీగా ఉద్యోగుల కుదింపునకు నిర్ణయం జరిగింది. ఇప్పటికే పలువురి సిబ్బందికి పేటియం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ పింక్‌ స్లిప్స్‌ పంపిణీ చేసిందని రిపోర్టులు వచ్చాయి. అయితే ఎంత మందిని ఇంటికి పంపించేది తెలియాల్సి ఉంది. తమ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు కావాల్సిన మద్దతు ఇవ్వనున్నట్లు పేటియం తెలిపింది. ఇందుకోసం రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు 30 సంస్థలతో కలిసి తమ హెచ్‌ఆర్‌ విభాగం పని చేస్తుందని వెల్లడించింది. ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న బోనస్‌ కూడా విడుదల చేసింది. ఉద్యోగుల తొలగింపు విషయమై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటియం పేర్కొంది. ‘కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది. 2024 మార్చి నాటికి పేటియంలో 36,521 మంది పనిచేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య 3,500 వరకు తగ్గింది. పలు రెగ్యూలేటరీ నిబంధనలు ఉల్లంఘించిన పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌పై జనవరిలో రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యల నేపథ్యంలో పేటియం ఉద్యోగ కోతలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది.

Spread the love