కిరణ్‌ రిజిజు తొలగింపు

– కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు
– న్యాయ శాఖ నుంచి తొలగించి
భూ విజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యత
– అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌కు న్యాయశాఖ
న్యూఢిల్లీ :
కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రుల్లో ఇద్దరి శాఖలను మార్చుతూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్‌ రిజిజును ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌కు న్యాయ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక రిజిజుకు భూ విజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి గురువారం ఒక ప్రకటన వెలువడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. కేంద్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేసినట్టు రాష్ట్రపతి భవన్‌ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం అర్జున్‌ మేఘ్వాల్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉండగా.. ఇకపై వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు. కాగా.. క్యాబినెట్‌ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు ప్రస్తుతం భూ విజ్ఞాన శాస్త్ర శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ చూస్తుండగా.. ఇప్పుడు ఆ శాఖను కిరణ్‌ రిజిజుకు అప్పగించారు. జితేంద్ర సింగ్‌ వద్ద ఇప్పటికే శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, పీఎంఓ, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్‌ తదితర శాఖలు ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో దళిత వర్గానికి చెందిన అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ చీఫ్‌ విప్‌గానూ, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగానూ పని చేశారు. ఆయన రాజస్థాన్‌లోని బికనీర్‌ నియోజకవర్గం నుంచి 2009లో లోక్‌సభ సభ్యునిగా మొదటిసారి గెలిచారు. కిరణ్‌ రిజిజు న్యాయ మంత్రి పదవిని 2021 జూలై 8న చేపట్టారు. ఆయన 2019 మే నుంచి 2021 జూలై వరకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్‌ ఛార్జి)గా వ్యవహరించారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కిరణ్‌ రిజిజు గతేడాది నవంబరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులను నియమించే కొలీజియం విధానం పారదర్శకంగా లేదనీ, కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని అప్పట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయశాఖ మంత్రి మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love