నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదికను సమర్పించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో వికాస్ రాజ్ గవర్నర్‌కు అందించారు.
ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి కాసేపటి క్రితమే ప్రతులను గవర్నర్‌కు అందజేశారు. ఈరోజు రాత్రి 8:30 గంటలకు సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఈ మేరకు దిల్‌కుష అతిథి గృహానికి వాహనాలను తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జీఏడీ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. అధికారులు పాత బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు.