గొప్ప కృషికి విశిష్ట పురస్కారం

Distinguished Achievement Awardప్రొఫెసర్‌ జయతి ఘోష్‌… ప్రముఖ ఆర్థికవేత్తలో ఒకరు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే వ్యక్తి. ముఖ్యంగా దేశంలో మహిళలు, విద్యార్థులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం తన స్వరాన్ని వినిపించే మానవతావాది. అటువంటి ఆమె 2023 గాను అగ్రికల్చరల్‌ అండ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌ (ఎ.ఎ.ఇ.ఎ) వారు వ్యవసాయ ఆర్థికశాస్త్రంలో అందజేసే ప్రపంచ ప్రతిష్టాత్మకమైన గాల్‌బ్రైత్‌ అవార్డు అందుకున్నారు. ‘ఆవిష్కరణలు, నాయకత్వం, పరిశోధన, సేవ ద్వారా మానవాళికి చేసిన విశిష్ట సేవలకు’ గుర్తింపుగా ఇచ్చే ఈ అవార్డు మన భారతీయ మహిళకు రావడం దేశానికే గర్వకారణం. జులై 25న ఆమె ఈ అవార్డును అందుకున్న సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
జయతి ఘోష్‌ 16 సెప్టెంబర్‌ 1955న జన్మించారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన డిగ్రీ పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో ఎం.ఎ, ఎం.ఫిల్‌ పట్టా అందుకున్నారు. తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో ఇన్‌లాక్స్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. 1984లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరల్‌ థీసిస్‌ డా. టెరెన్స్‌ జె. బైరెస్‌ పర్యవేక్షణలో ‘ది నాన్‌ క్యాపిటలిస్ట్‌ ల్యాండ్‌ రెంట్‌: థియరీస్‌ అండ్‌ ది కేస్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా’ అనే అంశంపై తన పీహెచ్‌డి పూర్తి చేశారు. గతంలో ప్రణాళికా సంఘ సభ్యుడిగా ఉన్న అభిజిత్‌సేన్‌ అనే ఆర్థికవేత్తను ఆమె వివాహం చేసుకున్నారు.
బోధన కొనసాగిస్తూనే…
చదువు పూర్తి చేసిన తర్వాత కొంత కాలంలో టఫ్ట్స్‌ యూనివర్శిటీ పని చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో కూడా విధులు నిర్వహించారు. అదే సమయంలో భారతదేశం అంతటా పర్యటించి అనేక విద్యాసంస్థలలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో దాదాపు 33 ఏండ్లు జెఎన్‌యు సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ అండ్‌ ప్లానింగ్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్‌ అయ్యారు. ప్రస్తుతం యుఎస్‌ఎలోని యూనివర్శిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌లో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆమె అనేక ఇతర విద్యా సంస్థలలో కూడా బోధనని కొనసాగిస్తున్నారు.
ప్రగతిశీల ఆర్థిక పరిశోధనల కోసం…
ఢిల్లీలో స్థాపించిన ఎకనామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులలో ఆమె కూడా ఒకరు. ప్రగతిశీల ఆర్థిక పరిశోధనల కోసం దీన్ని స్థాపించారు. ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌ అసోసియేట్ కు ఆమె ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ కూడా ఉన్నారు. ఇది నియో ఉదారవాద విధానాల ఆర్థిక నమూనాను విమర్శించే ఆర్థికవేత్తల నెట్‌వర్క్‌. ‘పశ్చిమ బెంగాల్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌’ అనే గ్రంథానికి ఆమె ప్రధాన రచయిత. ఈ గ్రంథం ఐక్యరాజ్యసమితి నుండి బహుమతి పొందింది. ఫ్రంట్‌లైన్‌ మ్యాగజైన్‌, బిజినెస్‌ లైన్‌, బెంగాలీ వార్తాపత్రిక గణశక్తి, డెక్కన్‌ క్రానికల్‌, ఏషియన్‌ ఏజ్‌లకు ఆర్థికశాస్త్రం, కరెంట్‌ అఫైర్స్‌పై రెగ్యులర్‌ కాలమ్స్‌ రాస్తుంటారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలపై జాతీయ పత్రిక ఫ్రంట్‌లైన్‌కి రెగ్యులర్‌ కాలమ్‌ రాస్తున్నారు.
అనేక శాఖలకు బాధ్యతలు
స్ప్రింగ్‌ టర్మ్‌ 2011లో జయతి టాలిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ వారి టెక్నాలజీ గవర్నెన్స్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌లో మొదటి రాగ్నార్‌ నూర్క్స్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. విద్యాసంబంధ విషయాలతో పాటు అనేక సలహా బోర్డుల్లో పనిచేస్తున్నారు. 2021లో ఆమె మరియానా మజ్జుకాటో అధ్యక్షతన ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ది ఎకనామిక్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫర్‌ ఆల్‌కి నియమించబడ్డారు. 2022 నుండి చాతమ్‌ హౌస్‌ ద్వారా సమావేశమైన యూనివర్సల్‌ హెల్త్‌ కమిషన్‌లో సభ్యురాలిగా, హెలెన్‌ క్లార్క్‌, జకయా కిక్వేటే సహ-అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే 2022 నుండి ఉమ్మడి ప్రపంచ బ్యాంక్‌/డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ మానిటరింగ్‌ బోర్డ్‌ (+ూవీదీ)లో భాగంగా ఉన్నారు.

అనేక సిఫారసులు
2004 సెప్టెంబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం న్యూఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ అధ్యక్షతన కమిటీని నియమించింది. సాగుదారులను గుర్తించి వ్యవసాయ సాగు రుణాలు పెంచడం, నీటి సమస్యని పరిష్కరించడం వ్యవసాయ సేవలని పెంచడం, గిట్టుబాటు ధరలు కల్పించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలతో కనీసం 100 రోజుల పనిని కల్పించడం, పేదలకు పోషకాలు అందించడం, ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచి తద్వారా ఈ రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటే గ్రామీణుల జీవన వ్యయం మెరుగు పడుతుందని ఈ కమిటీ ప్రధాన సిఫారసులు చేసింది.

ఎన్నో ప్రముఖ అవార్డులు
జయతి 2006లో అవా మైతీ మెమోరియల్‌ ప్రైజ్‌, 2010లో ఇటలీలోని సాంఘిక శాస్త్రాలకు నోర్డ్‌సుడ్‌ ప్రైజ్‌ను, 2011లో అంతర్జాతీయ కార్మిక సంస్థ డీసెంట్‌ వర్క్‌ రీసెర్చ్‌ ప్రైజ్‌, సామాజిక శాస్త్రాలకు విశిష్ట సేవలందించినందుకు, 2012లో ఆసియాటిక్‌ సొసైటీ వారి సత్యేంద్రనాథ్‌ సేన్‌ అవార్డు, 2013లో కాన్ఫరెన్స్‌ ప్రెసిడెంట్‌, ఇండియన్‌ సొసైటీ ఫర్‌ లేబర్‌ ఎకనామిక్స్‌, 2015లో ఆదిశేషయ్య అవార్డుతో పాటు ఎన్నో ప్రముఖ అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను అందుకొని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు.
ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు
2021లో కోవిడ్‌ -19 అనంతర ప్రపంచంలోని సామాజిక -ఆర్థిక సవాళ్లకు ప్రతిస్పందించడానికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కి సిఫార్సులను అందించే ఉన్నత స్థాయి సలహా బోర్డుకి నియమించబడిన 20 మంది ప్రముఖ వ్యక్తులలో జయతి ఘోష్‌ ఒకరు. 2022 మార్చిలో ఆమె ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ సహకారం కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ స్థాపించిన ప్రతిభావంతమైన బహుపాక్షికత (ఎఫెక్టివ్‌ మల్టీలెటరలిజం)లో ఉన్నత- స్థాయి సలహా మండలికి నియమించబడ్డారు.
కృషికి గౌరవంగా…
అమెరికన్‌- కెనడియన్‌ ఆర్థికవేత్త జాన్‌ కెన్నెత్‌ గాల్‌బ్రైత్‌ పేరు మీద వార్షిక అవార్డును కెనడాలోని మాంట్రియల్లో 2003లో ప్రారంభించారు. పరిశోధన, విద్య, ప్రజాసేవలో సాధించిన విజయాలతో రాజనీతిజ్ఞతతో స్కాలర్‌షిప్‌ను ఏకీకృతం చేసే జాన్‌ కెన్నెత్‌ గాల్‌బ్రైత్‌ పురస్కారాన్ని అసమానమైన విజయాలు, స్ఫూర్తి, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రపంచానికి సేవ చేస్తూ మేధో నాయకత్వ రికార్డును కలిగి ఉన్న మేధావులు, అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తలు ప్రపంచ మానవాళికి చేసే గణనీయమైన కృషికి గౌరవప్రదంగా ఈ అవార్డుని అందుకుంటారు. 2023కు గాను ఈ అవార్డు ప్రొ.జయతి ఘోష్‌కు మార్చి నెలలో ప్రకటించారు. జులై 25 నాడు ఆమెకు ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రారంభించినప్పటి నుండి అందుకున్న ముగ్గురు భారతీయ లేదా భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్తలలో ఆమె ఒకరు కావడం విశేషం.
మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం
భారత ప్రభుత్వ నోట్ల రద్దు పతనం, అనధికారిక ఆర్థిక వ్యవస్థలో మహిళా కార్మికుల దుస్థితి, భారత దేశంలో కోవిడ్‌- 19 మహమ్మారి పతనం సహా అనేక రకాల విషయాలపై ఆమె అనేక పరిశోధనా పత్రాలు, పుస్తకాలను రాశారు. ముఖ్యంగా ఆమె కార్మికులు, మహిళలు, అభివృద్ధి ఆర్థిక శాస్త్రంపై అనేక వ్యాసాలు రాశారు. 20కి పైగా పుస్తకాలను రచించారు. వామపక్ష భావాలు గల ఆమె పని విధానం, పరిశోధన, రచనలు అన్ని మానవ కేంద్రీకృత ఆర్థిక శాస్త్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తాయి. కార్మికుల దుస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి సామాజిక రక్షణ కల్పించడంపై అనేక విధాన సిఫార్సులు చేశారు. మూడవ ప్రపంచ దేశాల రుణ సంక్షోభం శ్రామిక ప్రజలపై తీవ్ర ప్రభావం చూపడం పట్ల ఆమె ఆందోళన చెందారు. ‘మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, సొంత ఆస్తులు, ఆదాయాన్ని పొందడం చాలా అవసరం. ఒక మహిళ ఆర్థికంగా ఆధారపడినంత కాలం ఆమె ఇతరులకు లొంగిపోవలసి ఉంటుంటుంది’ అంటారు జయతి.
– సలీమ

Spread the love