– జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే రోజు 11700 ఇండ్ల పంపిణీ
– లబ్దిదారుల సమక్షంలోనే లాటరీ
– బీజేపీకి ఓటమి భయం..అందుకే తెరపైకి జమిలి: మంత్రి తలసాని
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సొంతిల్లు లేని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్‌తో కలిసి ఇండ్ల పంపిణీపై విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు 8 ప్రాంతాల్లో శనివారం మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధులు 11,700 ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను లబ్దిదారుల సమక్షంలోనే లాటరీ ద్వారా కేటాయించనున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 95 వేల మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించినట్టు తెలిపారు. వీటికి సంబంధించిన వెరిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ చేపట్టిందన్నారు. మొదటి దఫాలో 11,700 మందికి ఇండ్ల కేటాయింపు సమాచారాన్ని అందించామని తెలిపారు.
లబ్దిదారులను కేటాయింపు చేసిన లొకేషన్‌కు తీసుకొని రావడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోలు, నోడల్ ఆఫీసర్లు కో-ఆర్డినేట్ చేస్తారని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఐ.డీ.హెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్లను సందర్శించిన అప్పటి గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో ఐఏఎస్, ఐ.పీ.ఎస్‌లకు ఇచ్చే క్వార్టర్స్కంటే బాగున్నాయని కితాబు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. 10 లేదా 15 రోజుల్లో రెండో దశ ఇండ్ల పంపిణీ ఉంటుందని, మొత్తం నిర్మించిన ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. వీటితోపాటు గృహలక్ష్మి పథకం కింద పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను విశాలంగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఇస్తున్నట్టు తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే…
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాజాగా ఎన్నికల సర్వేలు పరిశీలిస్తే ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికల ప్రచారంపై మంత్రి స్పందిస్తూ.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని, రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా బరిలోకి దిగుతామని, దేనికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మోడీ క్రేజ్ దేశంలో పడిపోయిందని, బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు వాళ్ల వద్ద ఉన్నాయని తెలిపారు. జమిలీ ఎన్నికలంటే అన్ని రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్రంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకే జమిలి ఎన్నికల అంశం తెరపైకి తెచ్చారన్నారు.
నియోజకవర్గాల వారీగా ఇండ్ల పంపిణీ…
– ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్లో – మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి
– మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప్సింగారంలో- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
– మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడ- మంత్రి మల్లారెడ్డి
– పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూర్-1లో- మంత్రి హరీశ్‌రావు
– మహేశ్వరం నియోజకవర్గం మంఖాల్‌లో- మంత్రి సబితా ఇంద్రెడ్డి
– చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో- మహమూద్ అలీ
– శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగి, బైరాగిగూడలో- మంత్రి మహేందర్ రెడ్డి