నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త ఓటర్లకు నెలాఖరు నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ జరగనుంది. ఈఏడాది రెండు విడతలుగా ఓటర్ల జాబితా ప్రకటించారు. 2023 జనవరి నుంచి కొత్తగా 40 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జనవరి1 నుంచి 27 లక్షలా 50 వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాలకే పంపిచారు. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి సంబంధించిన గుర్తింపు కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు. మిగిలిన వారి కార్డుల ముద్రణ పూర్తిచేసి పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఓటరు గుర్తింపు కార్డుల జారీ, ముద్రణను ఇకపై.. ప్రతివారం చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జారీ చేస్తున్న ఓటరు గుర్తింపు కార్డులను అత్యాధునిక ఫీచర్లతో ముద్రిస్తున్నారు. నకిలీలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక ముద్రణాలయాల్లోనే వాటిని ముద్రిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఈ అత్యాధునిక కార్డులను ముద్రిస్తోంది. ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.