నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే రోడ్డు ప్రమాదాలు: జిల్లా జడ్జి సునీత

Road accidents are due to negligence and irresponsibility: District Judge Sunitha– మైనర్లకు వాహనాలు ఇచ్చి శిక్షలకు గురికావద్దని తల్లిదండ్రులకు హితవు
– న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
– పంద్రాగస్టు తర్వాత హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేస్తాం : సీపీ కల్మేశ్వర్ వెల్లడి 
నవతెలంగాణ – కంఠేశ్వర్  
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ‘మైనర్ డ్రైవింగ్ – డ్రంకెన్ డ్రైవింగ్’ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల  ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. దీనిని నివారించాలని లక్ష్యంతో ప్రభుత్వం కఠిన చట్టాలను అమలులోకి తెచ్చిందని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్థులుగా పరిగణించబడతారని అన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే, వారితో పాటు తల్లిదండ్రులకు కూడా చట్ట ప్రకారం మూడేళ్ళ కారాగార శిక్ష, రూ. 25 వేల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదని, లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు. నేటి సమాజంలో అత్యధికమంది యువకులు, విద్యార్థులు రోడ్డు ప్రమాదాల గురించి ఏమాత్రం పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నారని, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు  కోల్పోతున్నారని, ఎదుటివారికి నష్టం చేకూరుస్తున్నారని అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటికి వెళ్ళేటప్పుడు తప్పక  ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యే దుస్థితి నెలకొంటుందని అన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కూడా, మీ ఆలోచనా విధానాల్లో మార్పు రానంతవరకు రోడ్డు ప్రమాదాల పరిస్థితిలో మార్పు రాదని అభిప్రాయపడ్డారు. సమాజానికి మనవంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఎవరికివారు ఆత్మవిమర్శ చేసుకుని విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం అనర్ధదాయకమని జాగ్రత్తలు సూచించారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే, తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ వర్ణనాతీతమని అన్నారు. ఒకవేళ ప్రాణాలు దక్కినా, తీవ్ర గాయాలపాలై అచేతనావస్థకు చేరితే ఇతరులపై ఆధారపడి జీవితం గడపాల్సి రావడం ఎంతో దుర్భరంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఇకపై మైనర్లు వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్ధ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్  సైడ్  వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన ఏడాదిన్నర కాలంలోనే రోడ్డు ప్రమాదాలలో 550 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశవ్యాప్తంగా చూస్తే, 2018 నుండి 2022 వరకు ఐదేళ్ల వ్యవధిలో 22.15 లక్షల వరకు రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకుని, 8 లక్షల మంది అకాలమరణం చెందారని సీ.పీ ఆవేదన వెలిబుచ్చారు.
జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర జనాభా మూడున్నర లక్షలు కాగా, ప్రమాదాలలో అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంటే రోడ్డు ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాల పెచ్చుమీరేందుకు కారణమవుతోందని ఆక్షేపించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా యువత అతివేగాన్ని మానుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో అప్రమత్తతో వాహనాలు నడపాలని సీ.పీ హితవు పలికారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు విధిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. వచ్చే ఆగస్టు 15 తరువాత హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేస్తామని, హెల్మెట్ ధరించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో టీ.జీ.ఎస్.పీ 7వ బెటాలియన్ కమాండెంట్ రోహిణీ ప్రియదర్శిని, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్మూర్ ఏ.సీ.పీ బస్వారెడ్డి, బోధన్ ఏ.సీ.పీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఆయా కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love