– ఇదే కాషాయపరివార్ విధానం
– జనం మదిలో రాజ్యాంగం..బీజేపీ మనసులో మనువాదం
– ప్రజల విశ్వాసాలకు, ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వకు సంబంధమే లేదు
– మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం దేశానికే ప్రమాదకరం
– అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలి
– సామాన్యులపైకి బుల్డోజర్ వస్తే ఎర్రజెండా అడ్డుకుంటుంది
– కార్మికులు, రైతుల హక్కుల కోసం నిలబడేది కమ్యూనిస్టులే
– సమాజమార్పు కోసం పోరాడాలి : సీపీఐ(ఎం) బహిరంగసభలో పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్
‘మతోన్మాదాన్ని తుదముట్టిస్తాం.. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం.. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దాకా పోరాడతాం…’ అని సీపీఐ (ఎం) శ్రేణులు ప్రతినబూనాయి. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుబెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాట పథాన్ని నిర్దేశిస్తూ, భవిష్యత్ ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తూ సీపీఐ (ఎం) రాష్ట్ర నాలుగో మహాసభలు శనివారం సంగారెడ్డి పట్టణంలో అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సన్నాహకంగా పట్టణంలో నిర్వహించిన భారీ ప్రజా ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు సైతం పాలకుల విధానాలను ఎండగట్టాయి. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ మహాసభల ప్రారంభ సూచికగా స్థానిక పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్, బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీ మత రాజకీయాలను అడ్డుకొంటామని అందుకు కలిసొచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని పోతామని వారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కులాలు, మతాల ఆధారంగా జనాన్ని విభజించి పాలించాలని చూస్తున్న ఆ పార్టీ కుయుక్తులను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు
‘దేశవ్యాప్తంగా ఆదివారం 75వ రాజ్యాంగ దినోత్సవం జరుగుతుంది. స్వాతంత్య్ర పోరాట ఫలితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చింది. ప్రజలందరి మదిలో రాజ్యాంగం ఉంది. కానీ బీజేపీ నాయకుల మనసులో రాజ్యాంగం లేదు. మనువాదం ఉన్నది. మనువాదానికి అనుగుణంగానే పాలన సాగిస్తున్నారు. అందులో భాగంగానే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్‌ను అవమానిస్తూ కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. ఆయన మనసులో అదానీ-గాడ్సే ఉన్నారు. అమిత్‌షాకు కేంద్రమంత్రిగా కొనసాగే అర్హత లేదు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.’అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో నాలుగు రోజులపాటు జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగో మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఐబీ కార్యాలయం నుంచి వేలాది మందితో భారీ ప్రజాప్రదర్శనను నిర్వహించారు. అనంతరం పీఎస్‌ఆర్ గ్రౌండ్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఆహ్వానసంఘం చైర్మెన్ చుక్క రాములు అధ్యక్షతన జరిగిన బహిరంగసభకు ముఖ్యఅతిథిగా బృందాకరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రియమైన సోదర, సోదరీమణులారా పార్టీ మహాసభల నేపథ్యంలో అందరికీ లాల్‌సలాం అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ మహాసభ ప్రజాప్రదర్శన, బహిరంగసభలో సీతారాం ఏచూరి లేరనీ, ఆయన మరణం పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఆయనకు దగ్గరి సంబంధముందన్నారు. ఏచూరి స్ఫూర్తితో ఎర్రజెండాను, ఉద్యమాలను ముందుకుతీసుకెళ్లేందుకు శపధం తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నిజాం నవాబు, బ్రిటీష్, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందన్నారు. కార్మికులే ఈ మహాసభలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దేశంలో కార్మికులు, రైతులు దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతున్నదని విమర్శించారు. కానీ కార్పొరేట్లకు మాత్రం రూ.మూడు లక్షల కోట్లు రాయితీలిచ్చిందని వివరించారు. మోడీ సర్కార్ పెట్టుబడిదారులకు మేలు చేసేందుకు నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందన్నారు. కార్మిక సంఘాలన్నీ వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని అన్నారు. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, కనీస వేతనాలు అందడం లేదని చెప్పారు. ఎనిమిది గంటల పనివిధానం కాకుండా పది గంటలు, 12 గంటల పనివిధానం అమలవుతున్నదని విమర్శించారు. అంగన్‌వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. సామాన్యులపైకి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్‌ను తెస్తే కమ్యూనిస్టులు అడ్డుకుంటారని చెప్పారు. పేదలు, రైతులు, కార్మికులపై జులుం ప్రదర్శిస్తే సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. రాజ్యాంగం, సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ఫెడరలిజంపై విశ్వాసం లేని వారు కేంద్రంలో పాలకులుగా ఉన్నారని విమర్శించారు. హిందూ ముస్లిం, ఆదివాసీ ముస్లింలను విభజిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను విభజించు పాలించు బ్రిటీష్ విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. ప్రజల మధ్య కులం, మతం పేరుతో చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నారనీ, ఇది దేశానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మానికి, ప్రజల మత విశ్వాసాలకు, హిందూత్వ భావజాలానికి సంబంధమే లేదన్నారు. మతాన్ని ఆయుధంగా రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదని చెప్పారు. దీన్ని వ్యతిరేకించడం కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండాలని సూచించారు. స్వార్థం కోసం, కుటుంబం కోసం కాకుండా సమాజ మార్పుకోసం సీపీఐ(ఎం) పోరాడుతుందని ఆమె చెప్పారు. ఎర్రజెండాను ముందుకెళ్లాలనీ, మతోన్మాద శక్తులను వెనక్కి కొట్టాలని అన్నారు. దోపిడీ లేని వ్యవస్థ కోసం పోరాటం చేయాలన్నారు.
కార్పొరేట్లే వాళ్ల దోస్తులు : బీవీ రాఘవులు
ట్రంప్, మోడీ, రేవంత్‌రెడ్డిలకు సంపన్నులే దోస్తులని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు. వారికి పేదల బాధలు పట్టవన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక పార్టీలను, ప్రభుత్వాలను చూశామనీ, ఆ పార్టీల మాదిరిగా సీపీఐ(ఎం) కాదని చెప్పారు. తమ పార్టీ పేదలు, సామాన్యులు, రైతులు, కార్మికుల బతుకుల బాగు కోసం నిరంతరం కొట్లాడుతుందని చెప్పారు. బడుగుల బతుకులు బాగుపడాలంటే ఎర్రజెండా పాలన రావాలని ఆకాంక్షించారు. కమ్యూనిస్టులు ప్రశ్నిస్తారనే పాలకులు భయపడుతున్నారని విమర్శించారు. దున్నేవాడిదే భూమి కావాలని కొట్లాడేది కమ్యూనిస్టులేనని గుర్తుచేశారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదనీ, కార్పొరేట్ల కోసం చట్టాలు మారుస్తూ పోతున్నదని విమర్శించారు. దేశంలోని మార్కెటింగ్ వ్యవస్థను అంబానీ, అదానీలకు కట్టబెట్టే పనిలో మోడీ సర్కారు ఉందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీలు సంపన్నుల కోసం పనిచేసే పార్టీలని చెప్పారు. మోడీ ప్రభుత్వం వచ్చాక అంబానీ ఆస్తి లక్ష కోట్ల రూపాయల నుంచి రూ.8 లక్షల కోట్లకు, అదానీ ఆస్తి రూ.40 వేల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెరిగిన తీరును వివరించారు. ట్రంప్ గెలిచాక డిన్నర్ పార్టీకి మన దేశం నుంచి అంబానీని మాత్రమే పిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. పెట్టుబడిదారులకు ఎర్రజెండా ప్రాధాన్యత తెలుసుననీ, అందుకే పాలకులతో నిరంతరం అణచివేయిస్తూ అరెస్టులు చేయిస్తున్నారని చెప్పారు. మోడీ సర్కారు ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తున్నదనీ, పౌర హక్కుల కోసం నిలదీస్తే చంపేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కారు హరిస్తున్నదని తీరును వివరించారు. ప్రజాస్వామ్యం ఉంటేనే కష్టజీవులకు హక్కులుంటాయని నొక్కి చెప్పారు. అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగం చెబితే మోడీ సర్కారు దాన్ని భగం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వేతన హక్కును కల్పించాలనీ, 60 ఏండ్లు దాటిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇల్లు, విద్య, వైద్య సౌకర్యాల కల్పన హక్కు ఉండాలని నొక్కి చెప్పారు. ఈ హక్కుల కోసం కొట్లాడేది ఎర్రజెండా మాత్రమేననీ, ఇతర పార్టీలకు అది చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఒకేదేశం..ఒకే ఎన్నిక వస్తే ముందు అంతరించిపోయే పార్టీలు బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీ అనీ, ఆ తర్వాత కాంగ్రెస్ అంతమైపోతుందని చెప్పారు. ఇదంతా ఏకపార్టీగా బీజేపీ మిగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్నీ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కపౌరునిపైగా ఉందని నొక్కి చెప్పారు.
మతోన్మాదులారా.. ఖబడ్దార్ : తమ్మినేని
బీజేపీ దేశానికే కాకుండా తెలంగాణకు కూడా ప్రమాదకరమైన పార్టీ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ పార్టీని ఫాసిస్టు లక్షణాలున్న ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతున్నదని విమర్శించారు. ఎక్కడ అవకాశం దొరికినా మతాలు, కులాల మధ్య తగాదాలు పెడుతున్నదని చెప్పారు. ఉట్నూరు, జైనూరులో జరిగిన ఘటనలు అందులో భాగమేనని వివరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసమే సాగిందన్నారు. కానీ బీజేపీ దాన్ని హిందూముస్లింలకు మధ్య పోరాటం జరిగిందంటూ చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. ఏటా సెప్టెంబర్ 17న హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నదని అన్నారు. తమ చూపంతా బీజేపీని రాష్ట్రంలోకి రానీయకుండా చూడ్డమేనని చెప్పారు. మతోన్మాదాన్ని తిప్పికొడతామని అన్నారు. ఖబడ్దార్ మతోన్మాదులారా… బీజేపీ కుయుక్తులను అడ్డుకుంటామని చెప్పారు. పార్టీ నాలుగో మహాసభలో చర్చించి సమరశీల పోరాటాలను నిర్వహిస్తామన్నారు. సకల జనులు బీజేపీ ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీని కలుపుకుని పోతామని చెప్పారు. అందరినీ ఒకతాటిమీదకు, ఒక వేదికమీదకు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తే సమర్థిస్తామనీ, విస్మరిస్తే పోరాటం చేస్తామని చెప్పారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, మహిళలకు రూ.2,500 అమలు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలు ఓట్లు వచ్చినపుడు ఒక మాట, తర్వాత ఇంకోమాట మారుస్తున్నాయని అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, లగచర్ల, దామగుండం వంటి సమస్యలపై అన్ని పార్టీలనూ పిలిచి మాట్లాడారా?అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుంటే ప్రశ్నిస్తామనీ, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే అడ్డుకుంటామని అన్నారు. కలిసొచ్చే శక్తులను కలుపుకుని పనిచేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర మహాసభలోÊ్ల చర్చించి ప్రజా ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పారు.
ప్రభుత్వాలకు ఎర్రజెండా అంటే భయం : చెరుపల్లి సీతారాములు
ప్రజల పక్షాన కొట్లాడే ఎర్రజెండా పార్టీ నాయ కులంటే పాలకపార్టీలకు భయమనీ, ప్రజల పక్షాన పోరాడుతున్న ఎంతో మంది నాయకులను చంపే శాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. దోపిడీదారులకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నది ఎర్రజెండానే అన్నారు. సీపీఐ(ఎం) పార్టీకి ఓట్లు, సీట్లు అటుఇటైనా పేదల కోసం నిలబడి పోరాడుతుందని నొక్కి చెప్పారు. రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడులు అంటూ మోడీ, రేవంత్‌రెడ్డి, చంద్రబాబు విదేశాల్లో తిరుగుతున్నారనీ, వారు తిరిగేది ప్రజల కోసం కాదు..తమకు దక్కాల్సిన మూటల కోసమని విమర్శించారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కారు కులగణన, దరఖాస్తుల స్వీకరణతో కాలం వెళ్లబుచ్చుతున్నదని వివరించారు. మోడీ సర్కారు మతం, కులం చుట్టూ ప్రజలను తిప్పుతుంటే..రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దరఖాస్తుల చుట్టూ తిప్పుతున్నదని విమర్శించారు.
పేదలకు భూములివ్వకుండా పెద్దలకిచ్చే యత్నం : జి.నాగయ్య
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల మిగులు భూమి ఉందనీ, దాన్ని పేదలకు పంచకుండా పారి శ్రామి కవేత్తలకు కేటాయించే ప్రయ త్నంలో రాష్ట్ర సర్కారు ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య విమర్శిం చారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంత ఇండ్లు లేవనీ, వారికి ఇండ్ల జాగాలు ఇచ్చేందుకు పాలకులకు చేయి రావడం లేదని చెప్పారు. అసైన్డ్ భూమి ఎకరం ఇస్తే 400 గజాలిచ్చి అమ్ముకునే హక్కు కల్పిస్తామని చెబుతూ పేదలను భూముల నుంచి దూరం చేసే యత్నంలో పాలకులు ఉన్నారని చెప్పారు. 69 కేంద్రాల్లో ఇండ్ల జాగాల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. సభలో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్‌కుమార్, బి వెంకట్, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, పోతినేని సుదర్శన్, డిజి నరసింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, టి సాగర్, పి ప్రభాకర్ పాల్గొన్నారు.
ఎర్రజెండా కోసం మేమున్నామని సహకరించడం స్ఫూర్తిదాయకం : చుక్క రాములు
మహాసభలను జయప్రదం చేయడానికి పారిశ్రామిక కార్మికవర్గం రెండు నెలల నుంచి కష్టపడుతున్నదనీ, ఎర్రజెండా కోసం మేమున్నామనీ పారి శ్రామిక కార్మికులు, అసంఘటిత కార్మికులు, స్కీం వర్కర్లు, వ్యవసాయ కూలీలు, రైతులు, పేదలు అన్ని విధాలా సహకరించడం స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మెన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు కొనియాడారు. జహీరాబాద్‌లో నిమ్జ్ కోసం 12,500 ఎకరాలను గుంజుకుంటే బాధితుల పక్షాన పోరాడింది సీపీఐ(ఎం) మాత్రమేననీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా ముందుకు రాలేదని వివరించారు. సంగారెడ్డి జిల్లాలోని అనేక పరిశ్రమల్లో మెరుగైన వేతన ఒప్పందాలు జరిగే పోరాటాలు చేయడంలోనూ, విజయం సాధించడంలోనూ ఎర్రజెండా పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. కార్మికులంతా ఒక్కతాటిపై ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
దమ్ముంటే అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించండి : జూలకంటి రంగారెడ్డి
ఒకే దేశం ఒకే ఎన్నిక..ఒకే దేశం..ఒకే పన్ను..ఒకే దేశం.. ఒకే ఆహారం.. నినాదాలను మాని దమ్ముంటే దేశంలో అందరీ అన్ని సౌకర్యాలు కల్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో అందరికీ వైద్య, విద్యా సౌకర్యాలను కల్పించాలని కోరారు. దేశంలో 80 కోట్ల మందికి తాము ఉచితంగా రేషన్ ఇస్తున్నామని చెప్పడానికి పాలకులు సిగ్గుపడాలన్నారు. దేశంలో రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయనీ, బూర్జువా పార్టీలు ప్రయివేటు కంపెనీల లిమిటెడ్‌లుగా మారాయని విమర్శించారు. పాలకులు సంపన్నుల కోసం పనిచేస్తూ పేదలపై పన్నులు, భారాలు, అప్పులు మోపుతున్న తీరును ఎండగట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించి సమరశీల పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు.
పోరాటాల గడ్డ ఎర్రజెండా వెలుగుల కోసం చూస్తోంది : ఎస్.వీరయ్య
తెలంగాణ పోరాటాల గడ్డ అనీ, ఎర్రజెండా వెలుగుల కోసం ఎదురుచూస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు హామీనిచ్చిన ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు మినహా ఏదీ అమలు కావడం లేదని విమర్శించారు. కనీస వేతనాల కోసం కార్మికుల పక్షాన కొట్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వమేమో 10 వేలు, 12 వేలు చాలని జీవోలు విడుదల చేస్తున్నదనీ, ప్రధాని మోడీనేమో రోజువారీ కూలి రూ.178 ఇస్తే సరిపోతుందని అంటున్నారని విమర్శించారు. ఆ వేతనంతో ఒక్క బీజేపీ నేతగానీ, నాయకులుగానీ బతికి చూపించాలని సవాల్ విసిరారు. 8 గంటల పనివిధానాన్ని తీసేసి రెండు షిప్టు విధానం(12 గంటల పనివిధానం) తేవడం ప్రమాదకరమన్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. సింగరేణిని క్రమంగా ప్రయివేటీకరిస్తుంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు గమ్ముగా ఉండటాన్ని తప్పుబట్టారు. పేరు ఆర్టీసీదీ..బస్సులు ప్రయివేటువేంటి అని రేవంత్‌సర్కార్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.