జకోవిచ్‌కు షాక్‌ సెమీస్‌లో సిన్నర్‌ చేతిలో ఓటమి

జకోవిచ్‌కు షాక్‌ సెమీస్‌లో సిన్నర్‌ చేతిలో ఓటమి– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌, 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల మొనగాడు నొవాక్‌ జకోవిచ్‌కు సెమీఫైనల్లో భంగపాటు ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ సెర్బియా యోధుడు నాలుగు సెట్ల సమరంలో పరాజయం చెందాడు. 3 గంటల 22 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్‌ సమరంలో జకోవిచ్‌ అనూహ్య ఓటమి చవిచూశాడు. 6-1, 6-2, 6-7(6-8), 6-3తో ఇటలీ ఆటగాడు జానిక్‌ సిన్నర్‌ (4వ సీడ్‌) అసమాన విజయం సాధించాడు. సెమీఫైనల్స్‌ వరకు ఏకపక్ష విజయాలు సాధించిన జకోవిచ్‌కు ఫైనల్లో బెర్త్‌ లాంఛనమే అనిపించింది. కానీ జానిక్‌ సిన్నర్‌ సెమీస్‌లో చిచ్చరపిడుగులా చెలరేగాడు. తొలి రెండు సెట్లను 6-1, 6-2తో నెగ్గిన సిన్నర్‌కు మూడో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో జకోవిచ్‌ దక్కించుకున్నాడు. నాల్గో సెట్‌ను సైతం సిన్నర్‌ 6-3తో సొంతం చేసుకోవటంతో కెరీర్‌ 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జకోవిచ్‌ ఆశలు ఆవిరయ్యాయి. జకోవిచ్‌ 7 ఏస్‌లు కొట్టగా, సిన్నర్‌ 9 ఏస్‌లు కొట్టాడు. జకోవిచ్‌ ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించలేదు. సిన్నర్‌ మాత్రం జకోవిచ్‌ సర్వ్‌ను ఐదు సార్లు బ్రేక్‌ చేశాడు. పాయింట్ల పరంగా 128-98తో జానిక్‌ సిన్నర్‌ స్పష్టమైన ఆధిపత్యం చూపించాడు. మెన్స్‌ సింగిల్స్‌ మరో సెమీఫైనల్లో డానిల్‌ మెద్వదేవ్‌ విజయం సాధించాడు. ఐదు సెట్ల పాటు సాగిన మ్యాచ్‌లో డానిల్‌ మెద్వదేవ్‌ (రష్యా) 5-7, 3-6, 7-6(7-4), 7-6(7-5), 6-3తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై పైచేయి సాధించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు జ్వెరెవ్‌ సొంతం చేసుకున్నాడు. తర్వాతి రెండు సెట్లను టైబ్రేకర్‌లో సాధించిన జ్వెరెవ్‌.. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో తన మార్క్‌ చూపించాడు. ఆదివారం జరిగే మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ డానిల్‌ మెద్వదేవ్‌తో నాల్గో సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ తలపడనున్నాడు.

Spread the love