– గడువు పొడిగించిన ఇస్లామాబాద్ హైకోర్టు
ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై ఈనెల 9 తర్వాత నమోదైన ఏ కేసులోనూ మే 31వరకు అరెస్టు చేయకుండా పాక్ సుప్రీం కోర్టు గడువును పొడిగించింది. ఇమ్రాన్‌పై దాఖలైన కేసులకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో ఇస్లామాబాద్ హైకోర్టు పై రూలింగ్ ఇచ్చింది. ఆ సమయంలో ఖాన్ కోర్టు గదిలో లేరు. మాజీ ప్రధానిపై వున్న కేసుల వివరాలు అందచేయాలని కోరుతూ పీటీఐ పెట్టిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా వందకు పైగా కేసులను ఇమ్రాన్‌పై నమోదు చేశారని పీటీఐ చెబుతోంది.
ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను ఆమోదించిన కోర్టు మే 31నాటికి విచారణను వాయిదా వేసింది. మే 15వరకు అరెస్టు చేయకుండా తొలుత ఇచ్చిన ఆదేశాలను 31కి పొడిగిస్తూ రూలింగ్ ఇచ్చింది. అలాగే పీటీఐ నేతలు మలీక బుఖారి, అలీ మహ్మద్ ఖాన్‌ల అరెస్టు చట్టవిరుద్ధమని వ్యాఖ్యానిస్తూ వెంటనే వారిని విడుదల చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖాన్ అరెస్టు నేపథ్యంలో దేశంలో చెలరేగిన హింసాత్మక నిరసనల సమయంలో శాంతి భద్రతల నిర్వహణ పేరుతో వీరిద్దరిని అరెస్టు చేశారు.