నవతెలంగాణ-న్యాల్కల్
ప్రభుత్వ భూములకు పట్టాలిస్తామని వరంగ్‌ల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ద్వారా ఆనాడు చెప్పించారని, అధికారంలోకి వచ్చాక పట్టాలిచ్చుడు దేవుడెరుగు, ఉన్న భూములను కూడా గుంజుకునే పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చారని, ఆయనకు మొట్టికాయలు వేస్తారో.. బుద్ధి చెప్తారో.. కానీ.. తమ పేదోళ్ల భూముల జోలికి రావొద్దంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఓట్లప్పుడు గల్లీ గల్లీ తిరిగి.. గద్దెనెక్కినాక ఢిల్లీలో కూర్చున్నారని, ఇప్పుడైనా ఆయన స్పందించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పుర్, వడ్డి, మల్గి గ్రామాల్లో ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం 2000కుపైగా ఎకరాల భూములను సేకరిస్తున్న తరుణంలో దానికి నిరసనగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం ఆ రైతులకు మద్దతుగా ఆయా గ్రామాల్లో హరీశ్‌రావు పర్యటించారు. డప్పుర్‌లో కాలినడకన వెళ్తూ పత్తి, పుదీనా లాంటి పంట పొలాలను పరిశీలించారు. ఈ క్రమంలో లక్ష్మి, లలితమ్మ అనే ఫార్మాసిటీ భూ బాధితులు ఆయనతో తమ గోడును వెల్లబోసుకున్నారు. మూడు పంటలు పండే భూములను గుంజుకుంటే తాము ఎలా బతకాలని వాపోయారు. తాత ముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూములను గుంజుకోవాలను కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డప్పుర్‌లో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌రెడ్డి పాలన ఉన్నదని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో 15వేలకు పైగా ఫార్మా కంపెనీలుండగా.. ఆ కాలుష్యాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారని సీఎంని ప్రశ్నించారు.
అక్కడ రియల్ ఎస్టేట్ చేసి.. ఇక్కడ పెట్టుబడులు పెడతావా అంటూ ఆరోపించారు. పచ్చని సాగుతో ఉన్న బంగారం లాంటి భూముల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయన్నారు. మూడు పంటలు పండే భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఫార్మా పేర.. మంజీరా నీటిలో విషం కలుపుతారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి భూములను ఫార్మాలకు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వం బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు పంపినా వాటికి అడ్డు నిలబడుతామని తెలిపారు. రైతుల భూముల్లోకి వారు రావాలంటే తమపైనుంచే రావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రైతుల కోసం గ్రీన్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయిస్తానన్నారు. ఎంతవరకైనా సిద్ధమేనని, ఎట్టి పరిస్థితుల్లో సాగు భూములిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, ముఖ్య నాయకులు మల్కాపురం శివకుమార్, దేవీప్రసాద్, యాదవ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు రవీందర్, స్థానిక నాయకులు భాస్కర్, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.