నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని అవామీ ఇతిహాద్ పార్టీ (ఏఐపీ) అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ డిమాండ్ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం శ్రీనగర్‌లో మీడియాతో రషీద్ మాట్లాడారు. మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ రాజకీయ పార్టీ లేదా రాజకీయ పార్టీల సమూహం మెజారిటీ సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయవద్దని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీలు ఎదగాలని అన్నారు. తమకు ఓటు వేసిన ప్రజల పెద్ద ప్రయోజనాల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ (పీడీపీ)తో సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కాగా, కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ కంటే తక్కువ అధికారాలు ఉంటాయన్న ఒమర్ అబ్దుల్లా మాటలను రషీద్ గుర్తు చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్ణయించున్న వారికి తన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎన్నికైన ప్రతినిధులు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఢిల్లీపై ఒత్తిడి తెస్తే వారికి (కేంద్రానికి) వేరే మార్గం ఉండదని చెప్పారు. ‘మోదీ ఇప్పటికే గోల్‌పోస్ట్‌ను మార్చారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేలా ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం ఇప్పుడు మన వంతు’ అని అన్నారు. మరోవైపు పీఏజీడీ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఏమీ చేయలేవని రషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం జరగకుండా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పాన్-ఇండియా పార్టీగా బలమున్న కాంగ్రెస్ ఇక్కడి ఓట్లు పొందినప్పటికీ ఆర్టికల్ 370పై మౌనంగా ఉందని విమర్శించారు. కాగా, ఢిల్లీలోని కశ్మీర్ హౌస్ ప్రధాన భవనాన్ని లడఖ్ యూటీకి ఇచ్చినట్లు తెలిసి తాను ఆశ్చర్యపోయినట్లు రషీద్ తెలిపారు. లడఖ్ ప్రజలు కూడా తమ సోదరులేనని అన్నారు. అయితే సుమారు రెండు కోట్లు ఉన్న జమ్ముకశ్మీర్ ప్రజలకు కాకుండా, రెండు నుంచి మూడు లక్షలు జనాభా ఉన్న లడఖ్‌కు కశ్మీర్ హౌస్ ప్రధాన భవనం ఇచ్చే నిర్ణయాన్ని ఎలా సమర్థించగలమని ఆయన ప్రశ్నించారు.