మా గ్రామాలను పక్క జిల్లాలో కలపొద్దు

మా గ్రామాలను పక్క జిల్లాలో కలపొద్దు– అంకుషాపూర్‌, ఔషపూర్‌, మధరం ప్రజల ఆందోళన
– మేడ్చల్‌ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్‌
నవతెలంగాణ – ఘట్కేసర్‌ రూరల్‌
‘గామాల అభివృద్ధి అంటే పక్క జిల్లాలో కలపడమా.. మా గ్రామాలను యథాతథంగా మేడ్చల్‌ జిల్లాలోనే కొనసాగించాలి’ అంటూ సోమవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ మండలంలోని అంకుషాపూర్‌, ఔషాపూర్‌, మధరం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మూడు గ్రామాలను యాదాద్రి జిల్లాలో కలుపుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో అంకుషాపూర్‌లో నిర్వహించిన స్వచ్ఛదనం- పచ్చదనం అవగాహన ర్యాలీని మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కరుణాకర్‌తో కలిసి గ్రామస్తులు బహిష్కరించారు.మూడు గ్రామాల ప్రజల సమక్షంలో సంతకాల సేకరణ చేపట్టి జిల్లా అధికారులకు అందజేశారు. అలాగే మూడు గ్రామాల అఖిలపక్ష నాయకులు తమ గ్రామాలను యాదాద్రి జిల్లాలో కలపొద్దని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయట ఉన్న ఆరు గ్రామాలను మండలంగా కొనసాగించాలి లేదా మున్సి పల్‌గా చేయాలని డిమాండ్‌ చేశారు.
అలా వీలుకాని పక్షంలో ఘట్కేసర్‌ మున్సి పల్‌లోనైనా కలపాలని కోరుతూ ఎమ్మెల్యే మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌కు, జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి వినతిపత్రాలు అందజేశారు. అందరూ సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ.. మూడు గ్రామాలను పక్క జిల్లాలో కలుపుతున్నారని ప్రజలు ఆందోళన చేందుతున్న నేపథ్యంలో గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను అభివృద్ధి చేయాలిగానీ పక్క జిల్లాలో కలిపి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. మూడు గ్రామాల విలీనం ఆపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Spread the love