కబ్జారాయుళ్లను వదిలిపెట్టం

Hydra Commissioner AV Ranganath– హైడ్రా కమిషనర్‌ ఏవి.రంగనాథ్‌
– మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో పర్యటన
– శ్రీవారి ఆలయ భూముల కబ్జాలపై పరిశీలన
– పరికి చెరువును కాపాడాలని పలు పార్టీ నేతల వినతి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కబ్జారాయుళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్‌ ఏవి.రంగనాథ్‌ అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 348/1లోని జగద్గిరిగుట్టపై కొండకిరువైపులా ఉన్న ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గల గోవిందరాజుల స్వామి ఆలయ కొలను కబ్జా అవుతున్నట్టు పూజారి నరహరిశర్మ సోషల్‌ మీడియా ద్వారా వీడియోలు పోస్ట్‌ చేశారు. దాంతో హైడ్రా కమిషనర్‌ వివిధ విభాగాల అధికారులతో పర్యవేక్షించారు. సమీపంలో ఉన్న పరికి చెరువు కబ్జాపై కూడా స్థానికులు కమిషనర్‌ దృష్టికి తీసుకురావడంతో ఆ ప్రాంతాన్ని, ఆలయ సముదాయాలను, ప్రభుత్వ భూములను అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు.ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ మాట్లాడుతూ.. 2024 జులైలో హైడ్రా ఏర్పాటైందని, అంతకు ముందు నిర్మించిన నివాసుల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన కబ్జాలపై మాత్రం తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు. కుల సంఘాల పేరిట ఆలయ భూములను కబ్జా చేసి సొంతంగా వాడుకోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. సదరు కుల సంఘాల పేరిట కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని వస్తున్న వార్తలపై సీరియస్‌ అయ్యారు. గూగుల్‌ మ్యాప్‌ పరిశీలించి కబ్జాలను గుర్తిస్తామన్నారు. వచ్చే బుధవారం జగద్గిరిగుట్ట ఆలయ భూములతో పాటు పరికి చెరువు కబ్జాలపై స్థానికులతో హైడ్రా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పరికి చెరువు పరిరక్షణ కోసం ఒక గ్రూప్‌ తయారు చేసి ఎప్పటికప్పుడూ చెరువు పూడ్చివేతపై సమాచారం ఇవ్వాలని కోరారు. పరికి చెరువును బాలకృష్ణ అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని పలువురు కమిషనర్‌ దృష్టికి తీసుకురాగా.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కబ్జాదారులకు నోటీసులు పంపిస్తామన్నారు. 15 రోజుల్లో హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ పనులు మొదలు కానున్నాయన్నారు. కబ్జాదారులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతోపాటు స్థానిక సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు. అన్ని ఆధారాలతో హైడ్రా కార్యాలయానికి వచ్చి అందజేయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడులు వచ్చినా తగ్గేదే లేదని, కబ్జాదారులను జైలుకు పంపించడం ఖాయమని అన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగద్గిరిగుట్ట సీఐ కేతూరి నరసింహ, ఎస్‌ఐ శంకర్‌, పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఈ.ఉమామహేష్‌, శ్రీవారి ఆలయ చైర్మెన్‌ కె.నరేందర్‌ రెడ్డి, బీజేపీ కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ కన్వీనర్‌ జెకె.శేఖర్‌ యాదవ్‌, నాయకులు మేకల సురేష్‌రెడ్డి, సిరుసాని మహేందర్‌, అరుణ్‌, పిల్లి ఆంజనేయులు, యాదగిరి, వంశీ, సాయికుమార్‌ పంతుల, కె.మహేష్‌,రాయి విగేష్‌ ఉన్నారు.

Spread the love