– బోయినపల్లి ప్రవీణ్ రావు
నవతెలంగాణ-కరీంనగర్ : వినాయక నవరాత్రి ఉత్సవాల పట్ల కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కరీంనగర్లోని వినాయక మండపాల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కనీస ఏర్పాట్లు చేయకపోవడం తగదని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక చవితి పర్వదినం, నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కనీస సౌకర్యాలు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి కల్పించకపోవడం విచారకరమన్నారు. కరీంనగర్లోని చాలా ప్రాంతాల్లో మంటపాల వద్ద రహదారులు సరిగ్గా లేవన్నారు. మంటపాల వద్ద గుంతలు పూడ్చి, డస్ట్ పోయాల్సిన నగరపాలక సంస్థ నిద్రమత్తులో ఉందన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్లు తక్షణం వినాయక మంటపాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.