బిల్లులు నాన్చొద్దు

Do not pay bills– ఆత్మపరిశీలన చేసుకోండి… గవర్నర్లకు సుప్రీం చురక
– కీలక బిల్లుల ఆమోదంలో కాలయాపనపై తీవ్ర అసంతృప్తి
– వాదనలు విన్పించిన పంజాబ్‌, తమిళనాడు, కేరళ
రాష్ట్ర గవర్నర్లు కీలక బిల్లులను ఆమోదించకుండా పెండింగులో ఉంచడంపై సుప్రీంకోర్టు సోమవారం నాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలనలోని పంజాబ్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాల తలుపు తట్టే వరకూ గవర్నర్లు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ‘ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిని మేం పరిశీలించాల్సి ఉంది. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాం. ఇలాంటి వ్యవహారాలను గవర్నర్లు, ముఖ్యమంత్రులే పరిష్కరించుకోవాలి. కోర్టు దాకా రావడం ఎందుకు?’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన బిల్లుల్ని గవర్నర్‌ విధిగా ఆమోదించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కారని గుర్తు చేసింది. పంజాబ్‌ గవర్నర్‌ తీసుకున్న చర్యలపై తాజా నివేదికను అందజేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని విడనాడాలనిసర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. పంజాబ్‌ శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ ఆమోదించ కుండా కాలయాపన చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయమూర్తులు జేబీ పార్ధివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య బెంచ్‌ విచారణ జరుపుతోంది.
రాష్ట్ర గవర్నర్‌ ఏడు కీలక బిల్లులకు ఆమోదం తెలపకుండా పక్కన పెట్టారని అమ్‌ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం ఆరోపించింది. వీటిలో మూడు ద్రవ్య బిల్లులు, ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాలలకు సంబంధించిన ఇతర బిల్లులు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత రెండు ద్రవ్య బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని విచారణ సందర్భంగా గవర్నర్‌ తరఫున హాజరైన పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వివరణ ఇచ్చారు. జూలైలో గవర్నర్‌కు పంపిన నాలుగు ఇతర బిల్లులు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయని తెలిపారు.
గవర్నర్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌, ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వి వాదనలు విన్పించారు. శాసనసభను మార్చిలో నిరవధికంగా వాయిదా వేశారని, విధానసభ నిబంధనల్లోని 16వ నిబంధనను అనుసరించి తిరిగి జూన్‌లో స్పీకర్‌ సమావేశాలు ఏర్పాటు చేశారని సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. ఏడు కీలక బిల్లుల ఆమోదం కోసమే సమావేశాలు నిర్వహించారని వివరించారు. అయితే దీనికి గవర్నర్‌ అభ్యంతరం తెలిపారని అన్నారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని సింఘ్వి తెలిపారు. తనకు సమర్పించిన బిల్లులపై గవర్నర్‌ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు.
‘ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు జరుగుతున్నాయి. వారు అసెంబ్లీని వాయిదా వేయకుండా అలాగే కొనసాగించారు. ప్రజలను అవమానించాలని అనుకున్నప్పుడల్లా సమావేశం నిర్వహించారు. ఇది అనవసరపు వ్యాజ్యం. గవర్నర్‌ చర్య తీసుకున్నారు. ఆయన బిల్లుల్ని పరిశీలించడమో లేదా రాష్ట్రపతికి నివేదించడమో చేశారు. నేను ఆయన నుండి ఆదేశాలు తీసుకొని శుక్రవారం విచారణకు వస్తాను’ అని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. మార్చిలో నిరవధికంగా వాయిదా వేసి తిరిగి మూడు నెలలకే సమావేశాలు నిర్వహించడమేమిటని సుప్రీంకోర్టు అసెంబ్లీ చర్యను ప్రశ్నించింది. కేరళ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ కీలక బిల్లులను ఆమోదించకుండా రాష్ట్ర గవర్నర్‌ పక్కన పెట్టడాన్ని ప్రశ్నిస్తూ తమ ప్రభుత్వం కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని తెలిపారు. ‘కొన్ని బిల్లులు రెండేళ్లకు పైగా ఆయన వద్ద పెండింగులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళుతోందని ఆయనకు చెబితే చూద్దాం…మేము దీనిపై పోరాడతాం అని జవాబిచ్చారు’ అని అన్నారు.
తమిళనాడు తరఫున సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ హాజరయ్యారు. గవర్నర్‌ వైఖరిని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర ప్రజల తీర్పును గవర్నర్‌ అవహేళన చేస్తున్నారని అన్నారు. బిల్లుల్ని పంపితే గవర్నర్‌ వాటిని ఆమోదించడం లేదు…తిప్పి పంపడమూ లేదు అని తెలిపారు. రాష్ట్రంలో గవర్నరే రాజకీయ శత్రువుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెలల తరబడి బిల్లుల్ని తన వద్ద అట్టే పెట్టుకొని రాజ్యాంగ ప్రతిష్టంభనకు కారణమవుతున్నారని చెప్పారు.
తెలంగాణలో గత సంవత్సరం సెప్టెంబర్‌ నుండి పెండింగులో ఉన్న బిల్లుల్ని గవర్నర్‌ చాలా నెమ్మదిగా ఆమోదిస్తున్న వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో గవర్నర్లు అనుసరిస్తున్న వైఖరిని ఎత్తిచూపుతూ పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశాయి.

Spread the love