‘మీడియా స్వేచ్ఛ’ను హరించొద్దు

భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా పౌరులు అనుభవిస్తున్న స్వేచ్ఛ క్రమంగా దిగజారిపోతుంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమైన మీడియా(పత్రికా) స్వేచ్ఛకు స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. తద్వారా మీడియా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వాస్తవాలు చెప్పే హక్కు కలిగి ఉంది. దీన్ని అడ్డుకుంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడనుంది. అందుకే ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛను నాలుగో స్తంభం (ఫోర్త్‌ ఎస్టేట్‌)గా పేర్కొంటారు. ఈ మీడియా (పత్రికా) స్వేచ్ఛ యాజమాన్యాలకు ఇచ్చింది కాదు. ప్రభుత్వాల, వ్యవస్థీకృత వర్గాల నుండి ఆంక్షలు, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సరైన రీతిలో సంపూర్ణంగా వార్తలను సేకరించడం, ప్రచురించడంలో నిజాయితీగా వ్యవహరించాలి. మీడియా, పత్రికాస్వేచ్ఛ అంటే? దేశ పౌర, రాజకీయ, మత, స్వాతంత్య్ర, స్వేచ్ఛ పరిరక్షణ ”కల్పవృక్షం”. ఈ ప్రజా కల్పవృక్షాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాలకు, చట్టసభలకు కూడా వీలుండదు. ఎంతో విశిష్టతను, స్వతంత్రతను కల్పించారు రాజ్యాంగ నిర్మాతలు. ప్రజలకు వాస్తవాలు తెలిపే హక్కు మీడియాకు ఉంది. కఠిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచితేనే వారు సరైన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకుంటారు. అలా మీడియా ఎన్నో సంస్కరణలకు, సామాజిక, రాజకీయ మార్పులకు దోహద పడింది… పడుతుంది. ఈమధ్య మళయాల వార్త ఛానల్‌ ”మీడియా వన్‌”పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ, ప్రజాస్వామ్య మనుగడకు… మీడియా స్వతంత్రత ముఖ్యమని ”సుప్రీం” భావించి తీర్పును వెలువరించింది. విమర్శిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఎలా అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన మీడియా స్వేచ్ఛలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం భావ్యం కాదు.
ప్రపంచంలో భారత దేశ స్థానం మీడియా స్వేచ్ఛలో దిగజారి(పడి)పోతుంది… ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలు, స్వతంత్ర మీడియా సంస్థలను, సంపా దకీయ వర్గాన్ని, జర్నలిస్టుల మీద ఉగ్రవాదం, రాజద్రోహం లాంటి కఠిన శిక్షల కింద తప్పుడు కేసులను బనాయించడమే కాకుండా దాడులు, హత్యలు జరుగుతున్నాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యు) పేర్కొంది. అలాగే ఈ మధ్య అధ్యయనం చేసిన పారిస్‌ చెందిన స్వంతంత్ర ఎన్‌జీఓ రిపోర్ట్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌, రిపోర్టర్స్‌ సాన్స్‌ ప్రాంటియర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్‌, సామాజిక మరియు భద్రత లాంటి ప్రధాన అంశాలు, మీడియా స్వేచ్ఛ సూచీల మీద ”ప్రపంచ పత్రిక దినోత్సవం మే-3న” నివేదికను విడుదల చేసింది. ఆ మేరకు 21వ ఎడిషన్‌ వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలోని 180దేశాల్లో భారత్‌ 2023లో 161స్థానంతో బలహీన ర్యాంకులో ఉంది. మన కన్న చిన్న దేశాల కన్నా దిగజారి పోవడంతో… ఇది ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలా గతంలో 2009లో 105వ ర్యాంకులో ఉండేది. 2019 నాటికి దాని పరిస్థితి 140వ ర్యాంకుకు దిగజారిపోయింది. ఆ తరువాత 2020-21 నాటికి భారత ర్యాంకు 142కు, 2022 నాటికి 150వ స్థానానికి పడిపోయింది. తాజాగా 2023కి వచ్చేసరికి ఇంతకన్నా 11స్థానాలు దిగజారి 161వ స్థానానికి కుదేలయింది. మన పొరుగు దేశాలు భూటాన్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌ కన్నా తక్కువ స్థానాల్లో ఉండటం గమనార్హం.
మూడు దశాబ్దాల నుండి ప్రపంచీకరణలో భాగంగా పెట్టుబడి దారీ విధానాలు పాలన లోకి మన దేశంలో ప్రవేశించడంతో ప్రజా ప్రయోజనాలు కాపాడాల్సిన మీడియా కార్పొరేట్ల ప్రయోజనా లకు వత్తాసు పలుకుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ విధానాలు ప్రయివేటీకరణకు పూనుకోవడంతో పెద్ద మీడియా అతిపెద్ద మీడియాగా ఎదిగి యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చింది. దీంతో పెద్ద కార్పొరేట్‌ శక్తులే మీడియా అధిపతులుగా చలామణి అవుతున్నారు. అనేక భిన్న పరిశ్రమలతో మీడియా సంబంధాలు పెనవేసుకుని పోయింది. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని కార్పొరేట్లకు ఇస్తున్నా… ప్రజల మీద అన్యాయంగా పన్నులు, సెస్సుల రూపంలో ఆర్థిక భారాలు మోపుచున్నా చూసీచూడనట్లు మౌనంగా వ్యవహరిస్తుంది. కేంద్రం రాష్ట్రాల హక్కులను, సమాఖ్య స్పూర్తిని హరిస్తూ, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తుంది… అయినా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ప్రజా ప్రతినిధులను సంతలో సరుకుల్లా కొనుగోలు చేస్తూ, ప్రభుత్వాలను అప్రజాస్వామ్యంగా కూలదోస్తున్నా ఈ మీడియా పట్టించుకోవడం లేదు. కార్పొరేట్‌ మీడియా ప్రభుత్వాలకు వత్తాసు (వంత) పాడుతూ స్వప్రయోజనాలను పొందుతుంది. ఈ మీడియా ప్రజల బాధలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత, కార్మికులు, మధ్య తరగతి, విద్యార్థులు, పేదల బాధలు పట్టించుకోకుండా పక్షపాతంగా వ్యవహ రిస్తుంది. కార్పొరేట్‌ మీడియా నేడు ఆర్థిక పరిపుష్టితో నూతన సాంకేతికతను పుణికి పుచ్చుకొని ఆ మాయాజాలపు కబంధహస్తాల్లో మీడియా స్వేచ్ఛ బందీ అయిందని ప్రజా స్వామ్యవాదులు భావిస్తున్నారు. అయినా నేటికీ పత్రిక(మీడియా) విలువల కోసం నిబద్దతతో వ్యవహరిస్తూ, పాలకుల నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పత్రిక (మీడియా) సంస్థలు చాలానే ఉన్నాయి. ప్రజల కోసం రాజ్యాంగం ప్రసాదించిన మీడియా స్వేచ్ఛను కాపాడుతుంది. వారి ఆకాంక్షలకు, ఆశయాలకు కట్టుబడి రాస్తున్నాయి. వినిపిస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని కార్పొరేట్‌ మీడియా చేసే అసత్య ప్రచారాలు ప్రజాస్వా మ్యానికి చాలా ప్రమాదకరం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించబడుతున్న వేళ… రాజ్యాంగ బద్ధంగా ప్రజా పాలన సాగించాల్సిన చట్టసభ(సభ్యు)లు పదవీ ప్రమాణాలకు కట్టుబడి మీడియా స్వేచ్ఛలో తలదూర్చకుండా సంక్షేమ, శ్రేయో రాజ్యంగ పాలన అందించాలి. లేదంటే నాటి బ్రిటిష్‌ పాలకులను నేటి ప్రజాపాలకులు మించిపోతున్నారనే అపకీర్తిని మోయాల్సి వస్తుంది. మన దేశ స్వేచ్ఛ, స్వాతంత్య్రానికై పరితపించిన ఆనాటి ఉద్యమ నాయకుల, భరత జాతి ఆకాంక్షలైన సమభావన, భావ ప్రకటనా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలను పరిరక్షించాలి. పౌర సమాజం ఆకాంక్షల్ని పాలకుల అకృత్యాన్ని చెప్పని చూపని మీడియా ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అని ప్రజాస్వామ్యవాదులు భావి స్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే భావ ప్రకటనా స్వేచ్ఛను, మీడియా (పత్రిక)స్వేచ్ఛను హరించడానికి, విమర్శలను తొక్కిపట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవంగా నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటివి. ప్రజల భావవ్యక్తీకరణ హక్కును పరిరక్షించడం… ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. మన రాజ్యాంగం పౌరులకు ఆ భరోసానిస్తుంది. అందుకే మీడియా స్వేచ్ఛ దిగజారడం వలన పౌర సమాజం గతి ఏమవుతుంది? పాలకులు వెంటనే నిర్బంధం, ఒత్తిడిలేని ప్రజా జీవనానికి పాటుపడుతూ మీడియా స్వేచ్ఛ పరిరక్షణలో ప్రపంచంలోనే అగ్ర భాగాన నిలవాలి.
మేకిరి దామోదర్‌
  9573666650

Spread the love