చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం పేరిట…మోడీతో జట్టు కట్టొద్దు

– అమెరికాకు హార్వర్డ్‌ వర్సిటీ ఫ్రొఫెసర్‌ జసనోఫ్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యం, పౌర సమాజం, మైనారిటీల హక్కులపై గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు నరేంద్ర మోడీ పాలనలో పరాకాష్టకు చేరుకున్నాయని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మాయా జసనోఫ్‌ విమర్శించారు. చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగించే ఉద్దేశంతో మోడీతో జట్టు కట్టవద్దని ఆమె అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఆమె గురువారం ఓ వ్యాసం రాస్తూ
మోడీ నేతృత్వంలో భారతదేశం ఎలా ఉన్నదో అమెరికా పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. హిందూ జాతీయతావాద సిద్ధాంతం అనే పదునైన ఆయుధంతో ఆయన ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని వివరించారు. ‘నరేంద్ర మోడీ కొందరికి గర్వకారణం కావచ్చు. కానీ చాలా మంది ఆయన నిరంకుశత్వాన్ని, అణచివేతను చవిచూశారు. ఇది మనందరికీ ఆందోళన కలిగిస్తోంది.
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, విద్యా స్వేచ్ఛ వంటి ప్రపంచ సూచికలలో భారత్‌ స్థానం పడిపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వేధింపులు పెరిగిపోతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, మీడియా కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. స్వేచ్ఛను హరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు ద్వారా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. పాఠ్య పుస్తకాల నుండి ముస్లింల చరిత్రను తొలగించారు. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గిపోయింది. సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ఆహారధాన్యాల ధరలు పెరిగాయి. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం తగ్గింది. పర్యావరణ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు’ అని జసనోఫ్‌ వివరించారు. భారత్‌లో మత విద్వేషాలు పెచ్చరిల్లాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ అల్లర్లకు కారకుడంటూ మోడీకి అమెరికా వీసా నిరాకరించిందని గుర్తు చేశారు.ఖ

Spread the love