కూలోల్ల కడుపుకొట్టి కార్పొరేట్ల బొజ్జలు నింపుతారా?

Kulolla's stomach beat Fill the bellies of corporates?– ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఉద్యమం తప్పదు
– ఎన్నో పోరాటాల ఫలితమే ఆ చట్టం
– మోడీజీ..విదేశీ టూర్లు సరే.. గ్రామీణ పేదల బతుకులు చూడు
– కేరళ, తమిళనాడు తరహాలో పనిదినాలు, కూలి పెంచాల్సిందే..
– రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
– నిధుల పెంపుకోసం కేంద్రంతో పోరాడాలి
– అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి: వ్యకాస రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది.ఆ విధానాన్ని విరమించుకోవాలి.ఎన్నో పోరాటాల ఫలితంగా, వామపక్షాల మద్దతుతో నాటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల జీవన ప్రమాణాల్లో మార్పులొచ్చాయి. తలెత్తుకుని, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు, పెత్తందార్లకు ఇది కంటగింపుగా మారింది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం పదేండ్లు ఉపాధి హామీ చట్టాన్ని అప్రతిహాతంగా అమలు చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారం లోకొచ్చిన తర్వాత క్రమంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు సాగిస్తుంది. బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తున్నది. చట్టాన్ని అమలు చేసేవిషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే బీజేపీ ప్రభుత్వం కూలీలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నది. పేదల పొట్టలు కొట్టి పెద్దల బొజ్జలు నింపేదుకు కుట్ర చేస్తున్నది.’అని పలువరు వక్తలు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు’ అనే అంశంపై ఆ సంఘం అధ్యక్షులు జి నాగయ్య, ఉపా ధ్యక్షులు బి ప్రసాద్‌, బి పద్మ, ఉపాధి కార్మికురాలు ఇందిర అధ్యక్ష వర్గంగా రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, కేరళ రాజ్యసభ సభ్యుడు శివదాసన్‌, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ తదితరులు ప్రసంగించారు. కేరళ, తమిళనాడు తరహాలో పనిదినాలు పెంచి, కూలి పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. దేశ ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు పెట్టే ఖర్చు..గ్రామీణ పేదల జీవన ప్రమాణాల మెరుగు దలకు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంబు డ్స్‌మెన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర వాటా కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతార : మంత్రి సీతక్క
సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ వామపక్షాల మద్దతులో ఉపాధి హామీ చట్టాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని సీతక్క గుర్తు చేశారు. కార్మికులు, రైతులు, కూలీలు, పేదల బాధల్ని అర్థం చేసుకుని..ఎందరో మేధావుల కోరిక మేరకు ఈ చట్టం అమల్లోకి తెచ్చారని చెప్పారు. అది పదేండ్లపాటు అప్రతిహాతంగా కొసాగిందన్నారు. కానీ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఉద్దరిస్తున్నామని చెబుతున్న ఆ ప్రభుత్వ పెద్దలు..కార్మికుల, కర్షకుల పొట్టలెందుకు కొడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అదానీ, అంబానీలే మనుషులా? పేదలు మనుషులుగా కనపడటం లేదా? అని నిలదీశారు. కార్పొరేట్ల ప్రయోజనాలే కర్తవ్యంగా పనిచేయటం మానుకోవాలని హితవు పలికారు. ‘రాముడు గుళ్లో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి’అని సూచిం చారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా..వ్యవసాయాన్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టాన్ని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులుం డొద్దు..రాజ్యాంగం ఉండొద్దంటే..కుదరదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను గ్యారంటీగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తమ పరిధిలో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపాధి కూలీల కోసం వినియోగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కోసం పార్లమెం ట్‌లో తమ ఎంపీలు గళం విప్పుతారని చెప్పారు.
పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనం పెంచాలి : రాజ్యసభ సభ్యులు శివ దాసన్‌
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలనీ, చట్ట ప్రకారం వారం వారం వేతనాలు చెల్లించాలని రాజ్యసభ సభ్యులు శివదాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అడిగిన వారికి పని ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిని ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు కూలి రూ.300 ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసే దగ్గర ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యం అందించాలని చట్టంలో ఉన్నా అది ఎక్కడా అమలు కావటం లేదని చెప్పారు. వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలను పేదల నుంచి గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనీ, ఉపాధి కూలి పనికి పోతే రోజు రూ. 100 కూడా రావటం లేదన్నారు. ధరలను నియంత్రించటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.మోడీ విదేశీ పర్యటనలకు పెట్టే ఖర్చు, మంత్రుల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని వివరించారు. అదే సమయంలో పేదలకోసం పెట్టే ఖర్చు తగ్గుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టం రక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం : బి వెంకట్‌
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదనీ, దీని రక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. ఉపాధి పనిలో యంత్రాలను నిషేధించాలని కోరారు. అయితే దానికి విరుద్ధంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను 49 శాతానికి పెంచి.. ఉపాధి హామీ పనులను, నిధులను ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డైవర్ట్‌ చేస్తోందని వాపోయారు. కూలీలే ఉపాధి పనికి దూరంగా పోయేటట్టు కొత్త నిబంధనలను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో రెండు సార్లు ఫొటోలు తీయటం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయటం, బ్యాంక్‌ అకౌంట్‌లలో వేతనా లు వేయటం, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ ఉపాధి జాబ్‌ కార్డుకు అనుసంధానం చేయటం పేరు మీద పనిచేసే కూలీల సంఖ్యను కుదించే ప్రయ త్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి వేల కోట్లను పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. ఫలితంగా ఉపాధి పనికి పోతే వేతనాలు రావనే భయం కూలీలలో పెరిగిం దన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిం చారు.ఉపాధి హామీకి సంబంధించిన సమస్యలతో కూడిన తీర్మానాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు ప్రవేశపెట్టారు. వాటన్ని టినీ దరఖా స్తు రూపంలో మంత్రి సీతక్కకు రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య తో కూడిన బృందం అందించింది. సదస్సులో వ్యకాస అఖిల భారత కమిటీ సభ్యులు మచ్చ వెంకటే శ్వర్లు, నారీ ఐలయ్య, కొండమడుగు నరసింహ, జగన్‌, వెంకటయ్య, సాంబశివ, ఆవుల వీరన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love