కిరాయి మూకలకు బుర్రుంటుందా?

శిష్యుడు: గురువుగారూ గురువుగారూ… బంధిపోట్లకు, హంతకులకు నీతి ఉంటుందా..?
గురువు: ఎందుకుండదు శిష్యా! భారీ దొంగతనం చేసినా, సుపారీ తీసుకుని కిరాయి హత్య చేసినా, ఓ ముఠాగా చేసినప్పుడు వారి మధ్యన కూడా ఓ కనీస నీతి ఉంటుంది. దానినే హీనపక్షం నీతి అంటారు. పక్కా ప్లాను వేసినందుకు ఇంత, కాపలా కాసినందుకు ఇంత, పట్టుబడితే పోలీసులకు ముట్టచెప్పేదానికింత అని అన్నీ ముందే నిర్ణయించుకుంటారు. దాని ప్రకారమే లబ్దిపొందిన ఆ సొమ్మును ఆ విధంగా చివరకు పంచుకుంటారు.
శిష్యుడు: ఒకవేళ ఆ కనీస నీతి కూడా తప్పితే..
గురువు: ఏముంది వారి మధ్యలోనే మరల హత్యలు, చావులు, డ్రగ్స్‌ మాఫియా, ఉగ్రవాద గ్రూపుల్లో ఇలాంటివి చాలా తేలిగ్గా జరుగుతుంటాయి. మనం ఎన్ని వినడం లేదు. ఎన్ని చూడటం లేదు. విషనాగుల మధ్య చెలగాటమే ఆ జీవితాలు.
శిష్యుడు: ఇప్పుడు రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా కిరాయి సైన్యం తిరుగుబాటు చేసిందని అంటున్నారు.
గురువు: అవును. ఆ కిరాయి సైన్యం మూకపేరు వాగర్‌. ప్రయివేటు మిలటరీ కంపెనీ (పి.ఎం.సి) అంటారు. దాని అధినేత ప్రిగోజన్‌. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా పక్కన ఉన్న ఈ వాగర్‌ మూక అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి ఉక్రెయిన్‌ పక్షాన చేరి రష్యాపై ఎదురుదాడి చేసింది. రష్యాలో ఓ నగరమైన ‘రోస్తావ్‌-అన్‌-డాన్‌’ చేజిక్కించుకుని మాస్కోవైపు అడుగులు వేసింది. ఈ విపత్కర పరిణామానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దిగ్భ్రమకు లోనయ్యాడు. వెన్వెంటనే బెలారస్‌ నేత లుకషెంకో రంగంలోకి దిగి పుతిన్‌ – ప్రిగోజన్‌ మధ్య సంధి చేకూర్చాడు. తదనంతరం వాగర్‌ కిరాయి సైన్యం మూక మరల తమ అధినేత చెప్పినట్టు ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి సన్నద్దమైంది.
శిష్యుడు: అదేనండి గురువుగారూ నాకర్థంకావడం లేదు. నాయకుడు ఎవరిపక్షాన చేరితే వారి పక్షాన చేరి ఇతరుల ప్రాణాలు అంత తేలిగ్గా తీయడం సబబుగా ఉంటుందా..?
గురువు: యుద్ధం అంటే అదేగా శిష్యా! ప్రాణాలను బలిపెట్టడం లేదా బలితీసుకోవడం. అందుకే ”యుద్ధం – శాంతి” నవల రాసిన టాల్‌స్టారు ఏమన్నాడో తెలుసా?
శిష్యుడు: ఏమన్నాడు?
గురువు: యుద్ధాలు – హత్యలు – మారణహౌమాలు ప్రపంచంలో ఉన్నంత కాలం నాగరిక మానవుడు ఉద్భవించలేడు.
శిష్యుడు: నిజమే. అసలు ఈ కిరాయి సైన్యం గురించి కొంత వివరించండి.
గురువు: ప్రపంచ సైనిక చరిత్రను అధ్యయనం చేస్తే, క్రీస్తుపూర్వం నుండే ఈ కిరాయి సైన్యం బెడద ఉన్నది. అలెగ్జాండర్‌ సైన్యంలో కూడా ఐదువేల కిరాయి సైన్యం ఉన్నదట. ఎప్పుడైనా, ఎక్కడైనా, అసలు సైన్యాధిపతులు ఇచ్చిన ఆజ్ఞలే ఈ కిరాయి సైన్యం పాటించాలి. స్థానిక పాలకుల అరాచక చర్యలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే గుంపులు, బంధిపోటు ముఠాలు కూడా ఒక్కోసారి వారి వారి అవసరార్థం ఇలా ప్రధాన సైన్యంలో కిరాయికి చేరేవి. అలా కలిసాక అవి ఇక సైనిక నేత అంటే ఆ రాజు ఆజ్ఞలే గుడ్డిగా పాటించాలి. ఎలాంటి వివేచనా చూపకూడదు. వర్తమానానికి వస్తే నేడు ప్రపంచంలో ఇలాంటి కిరాయి సైన్యం ముఠాలు దాదాపు పదహారువేలు ఉన్నట్టు అంచనా. ఇవి యుద్ధాల్లో పాల్గొనడంతో పాటు ఓడలు, గనులు, చమురు బావులు మొదలగు వనరులకు రవాణా స్థావరాలకు కాపలా కాస్తుంటాయి. బంగారం, ఖనిజాలు, కలప, డ్రగ్స్‌ అక్రమ రవాణాల్లో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఇదో చీకటి సామ్రాజ్యం. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొందరు కార్పొరేటర్లు, రాజకీయ నేతలు ఇలాంటి కిరాయి సైన్యం మూకలను పోషిస్తున్నారు. వారికి రాజ్యమన్నా, రాజ్యాంగమన్నా, చట్టమన్నా, అధికారులన్నా పెద్ద లెక్క ఉండదు. ఎంతకైనా తెగిస్తారు. వారికి వారి నాయకుడు చెప్పిందే శాసనం.
శిష్యుడు: అయితే ఈ కిరాయి వారికి సొంత బుర్ర ఉండదా?
గురువు: ఉన్నా ఉపయోగించరు. వారు ఆ ప్రయివేటు చట్రంలో బంధీ. అయితే దానిలో ఉపాధి భద్రత దొరుకుతుందనే ఆశతో యువత ఆ మూకలో చేరుతుంది.
శిష్యుడు: అవునవును. ఆ మధ్యన కేంద్రం ‘అగ్నిపథ్‌’ వీరులు సైన్యంలో చేరిన నాలుగేళ్ళ అనంతరం వారికో సర్టిఫికెట్‌ ఇచ్చి ఇంటికి పంపిస్తే, దాని ఆధారంగా ప్రయివేటు కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయంటే ఏమో అనుకున్నా. అవి ఇలాంటి కిరాయి సైన్యం ఉద్యోగాలన్న మాట. ఇటు యువతకు సైనిక ఉద్యోగం, అటు కిరాయి సైన్యం ఏర్పరుచుకోమని ప్రయివేటు కంపెనీలకు చెప్పటం ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
గురువు: బాగా చెప్పావ్‌.
శిష్యుడు: అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి?
గురువు: దోపిడీ, ఆధిపత్యం, సామ్రాజ్యవాదం యుద్ధాలకు కారణం.
శిష్యుడు: మరిప్పుడు వాగర్‌ గ్రూపు తిరుగుబాటును మనం ఎలా చూడాలి?
గురువు: పదహారు నెలలుగా జరుగుతున్న ఈ దీర్ఘకాల యుద్ధంలో ఈ తిరుగుబాటు ఓ టీకప్పులో తుఫాను వంటిదని పరిశీలకులు అంటున్నారు. ఎంత అకస్మాత్తుగా పైకెగిసిందో అంతే అకస్మాత్తుగా చిచ్చుబుడ్డిలా చల్లారిపోయింది. రణతంత్రంలో ఏది అసలు ఏది నకిలీ అర్థమవడం కష్టసాధ్యం. మిత్రులు శత్రువులుగాను, శత్రువులు మిత్రులుగాను క్షణక్షణం మారుతుంటారు. కోవర్టులూ కోకొల్లలే, బయటపడినప్పుడు ఉలిక్కిపడతాం. అసలు యుద్ధం అంటేనే కకావికలం.
శిష్యుడు: మరి ఈ యుద్ధాలకు అంతం ఉండదా?
గురువు: నరహంతకులు ఉన్నంత కాలం యుద్ధాలు తప్పవు. మహానేత స్టాలిన్‌ చెప్పినట్టు శాంతిసాధనలో యుద్ధం అనివార్య భాగమే.
కె. శాంతారావు
9959745723

Spread the love