వైద్యులు దేవుడితో సమానం

Doctors are equal to God– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-ములకలపల్లి
వైద్యులు భగవంతుడితో సమానం అని, వైద్యులు తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ రోగులకు సేవలు అందించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ములకలపల్లి మండల కేంద్రంలో మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రూ.కోటి 56 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరు పడకల ఆసుపత్రి భవనాన్ని మంగళవారం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ముందుగా ఆయన నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవన ప్రాంగణంలో మొక్కను నాటినారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రభుత్వ అధికారులతో మక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, ఇక్కడ ఉన్న భూమి సాయిల్‌ తీరును బట్టి పిల్లర్లు బీములు వేసి ప్రహరీ నిర్మించాలని, ఇందుకోసం ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్‌ వేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పటేల్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రిలో సిబ్బంది, మందులు కొరతా ఉన్నదని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆసుపత్రిలో సమస్యలన్నీ పరిష్కరించాలని కలెక్టర్‌కి సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నదని, వైద్యులు విధులను సక్రమంగా నిర్వహిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే వైద్యులు స్థానికంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రి చుట్టూ ఆక్రమణలు ఉంటే తొలగించి, ఫెన్సింగ్‌ వేయాలని తహసీల్దార్‌ పుల్లారావుకు సూచించారు.
మంత్రికి సమస్యలతో కూడిన వినతులు
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, మందులు కొరత వేధిస్తుందని, ఆసుపత్రిలో ఇద్దరు పర్మినెంట్‌ డాక్టర్లని ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి, ఇతర వైద్య సిబ్బంది నియమించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మంత్రికి వినతి అందించారు.
సెకండ్‌ ఏఎన్‌ఎం సమస్యలు పరిష్కరించాలని, అరకొర జీతాలతో బతుకు వెళ్ళదీస్తున్న తమకు గౌరవ వేతనం ఇప్పించాలని, గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు మా ఉద్యోగాలను పరిమియం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని సెకండ్‌ ఏఎన్‌ఎమ్‌లు మంత్రికి వినతి అందించారు. అలాగే పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.
అలాగే తాళ్లపాయ గ్రామపంచాయతీ ప్రజలు మాకు బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, మండల కేంద్రానికి రాకపోకలకు మాకు సైడ్‌ డైవర్షన్‌ రోడ్డు ఇప్పించాలని, మంత్రి పొంగులేటికి తాళ్లపాయ గ్రామ ప్రజలు వినతి పత్రం అందించారు.
పై సమస్యలపై స్పందించన మంత్రి త్వరలోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మాదారం గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఊకంటి గోపాలరావు నివాసంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ మువ్వ విజయబాబు, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ కొత్వాల శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, ఆర్డీవో మధు, జిల్లా వైద్య అధికారి భాస్కర్‌ నాయక్‌, పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌ ఈఈ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ పుల్లారావు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పర్వత నేని అమర్నాథ్‌, పువ్వాల మంగపతి, కృష్ణ, సుధీర్‌, సత్యనారాయణ, బాల అప్పారావు, గాదె తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love