అదానీకి అంత సీన్‌ ఉందా?

Police attack on hope Stopped by the police– ధారవి వాసుల అనుమానాలు
– న్యాయ పోరాటానికి సిద్ధమైన ప్రత్యర్థి బిడ్డర్‌
ముంబయి : ఆసియాలోనే అతి పెద్దదైన ముంబయి మురికివాడ ధారవిలో నివసిస్తున్న పది లక్షల మంది ప్రజలకు గృహ వసతి కల్పించి, వారి జీవితాలలో వెలుగులు నింపుతానంటూ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ చేసిన ప్రకటనపై అక్కడి పేదలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారంలో ఎదురు దెబ్బలు, ఆరోపణల నేపథ్యంలో అదానీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తున్న ప్రజలు ఆయనకు ఆ సామర్ధ్యం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు.
అదానీ అభివృద్ధి చేస్తానని చెబుతున్న ధారవి మురికివాడలో నివసిస్తున్న పేదలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అక్కడ డ్రైనేజ్‌ వ్యవస్థ లేదు. సామూహిక మరుగు దొడ్లలోనే కాలకృత్యాలు తీర్చుకుంటారు. ఈ మురికివాడ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఆకాశ హర్మ్యాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలకు చేరువలో ఉంది. అయినా ప్రజల జీవనం అస్తవ్యస్థం. మురికివాడను పునర్నిర్మించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో 614 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టును ఖరారు చేసింది. ఆ వెంటనే తాను ఆ మురికివాడను స్వర్గధామంగా మారుస్తానని అదానీ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పేదల ఇళ్లను కూల్చివేసి ప్రభుత్వ భూమిలో కొత్తగా టవర్లు నిర్మిస్తామని, వాటిని ప్రజల నివాసాలకు, వ్యాపారాలకు కేటాయిస్తామని అదానీ చెబుతున్నారు. దీనిపై అదానీ 12 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి, 24 బిలియన్‌ డాలర్లు లభించేలా అభివృద్ధి హక్కులు పొందుతారని కన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
అయితే ప్రస్తుతం అదానీ ఆర్థిక పరిస్థితి అంత సజావుగా లేదు. జనవరి వరకూ ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అయితే హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఆయన వ్యాపార సామ్రాజ్యం బీటలు వారింది. అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా 150 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. ఇదే తమను ఆందోళనకు గురి చేస్తోందని ధారవి వాసులు తెలిపారు. దీనికితోడు పులి మీద పుట్రలా అదానీతో పాటు ధారవి కోసం బిడ్‌ వేసిన దుబాయికి చెందిన కన్సార్టియం సెక్‌లింక్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. 2018లోనే తాము ధారవి పునర్నిర్మాణానికి అత్యధిక బిడ్‌ వేశామని, అయితే 2022లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను తిరిగి ప్రారంభించి అదానీ గ్రూపుకు కాంట్రాక్ట్‌ కట్టబెట్టేలా నిబంధనలు మార్చిందని ఆ సంస్థ ఆరోపించింది. ఈ కేసులో ప్రభుత్వంతో పాటు అదానీని కూడా ప్రతివాదిగా చేర్చేందుకు గత నెలలో ముంబయి కోర్టు అనుమతించింది.
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన బిడ్డింగ్‌ ప్రక్రియ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, అదానీ గ్రూపుకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని కన్సార్టియం ఆరోపిస్తోంది. బిడ్‌ దాఖలు చేసే కంపెనీ ఆస్తుల నికర విలువను రెట్టింపు చేసి 2.4 బిలియన్‌ డాలర్లకు పెంచారని, కన్సార్టియం సభ్యుల సంఖ్యను ఎనిమిది నుండి రెండుకు కుదించారని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను అటు అదానీ గ్రూపు, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తున్నాయి.

 

Spread the love