– గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలకే విలువలేదు
– 95 శాతం పూర్తైన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
– మెగా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
– త్వరలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన :బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– మాజీమంత్రి లక్ష్మారెడ్డికి పరామర్శ
నవతెలంగాణ – తిమ్మాజిపేట
పాలమూరు బిడ్డను.. పాలమూరు ప్రజల వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని పదే పదే చెప్పుకునే రేవంత్‌రెడ్డి.. కనీసం దయాదాక్షిణ్యాలు లేకుండా పేదల ఇండ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో మహబూ బ్‌నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్‌పల్లిలో సర్వే నెంబర్ 523లో 75 మందికి 75 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని తెలిపారు. అందులో సింహభాగం వికలాంగులు, దళితులు, మైనార్టీలు ఉన్నారన్నారు. ఇప్పుడవి చెల్లకుండా పోయాయన్నారు. పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడానికే పాలమూరు నుంచి ముఖ్యమంత్రివి అయ్యావా అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి కనీస సంస్కారం ఉంటే.. పేదల పట్ల కనికరం ఉంటే 75 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకే విలువ ఇవ్వని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణ వద్ద ఆగిన కాలువలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 95 శాతం పనులు పూర్తైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అది పూర్తి చేస్తే మాజీ సీఎం కేసీఆర్‌కు పేరు వస్తదనేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు నీరందించే సుంకిశాల వద్ద ప్రమాదం జరిగి రూ.75 నుంచి 80 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. మళ్లీ మెగా ఇంజినీరింగ్‌కి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టబెట్టారని తెలుస్తోందని, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు అంటూ మాట్లాడి.. ఇప్పుడు అన్నీ వాళ్లకే ఇస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వంపై చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కేసీఆర్ అనుమతి తీసుకొని.. మేడిగడ్డకు ఎట్టా పోయినమో.. అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు. ఏ కంపెనీలను బూతులు తిట్టినరో.. జూటా కంపెనీలని అన్నారో వాటికే ఇప్పుడు రూ.4 వేలా 350 కోట్ల పనులు సీఎం సొంత నియోజకవర్గంలో కట్టబెట్టారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నవీన్ కుమార్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకట్ రెడ్డి, బాల్క సుమన్, నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి, దయాకర్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్, స్వామి, మోహనచారి తదితరులు ఉన్నారు.