హామీ అమలయ్యేనా..!

Will the guarantee be implemented..!– రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్‌ రెట్టింపుపై జీవో ఇవ్వాలంటూ డిమాండ్‌
– సర్కారు నిర్ణయంపై ఆధారపడిన 10వేల మంది అంగన్‌వాడీల జీవితాలు
– రాష్ట్రంలో 33వేలకుపైగా సెంటర్లు
– టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు లక్ష అందిస్తామని మంత్రి ప్రకటన
– నేడు చలో హైదరాబాద్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 65 ఏండ్లు దాటిన టీచర్లు, హెల్పర్లను దాదాపు 10వేల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరి వయస్సు 65 ఏండ్లు దాటడంతో విధుల నుంచి తొలగించింది. అదే సమయంలో రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ కింద టీచర్లు రూ.లక్ష, ఆయాలకు 50వేల చొప్పున ఇస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఈ బెన్‌ఫిట్స్‌ తీసుకోవడానికి అంగన్‌వాడీ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. దశాబ్దాలపాటు విధులు నిర్వహించడంతో తగిన రీతిలో రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ ఇచ్చి గౌరవమివ్వాలని కొన్ని రోజులుగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించారు. త్వరలో కొత్త జీవో కూడా ఇస్తామన్నారు. అయితే కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. దానికి సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేసి పదివేల కుటుంబాలకు బాసటగా నిలువాలని అంగన్‌వాడీ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం నేడు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కింద దాదాపు 33,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 70వేల మంది టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా వీరంతా అతితక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీచర్లకు రు.13,650, ఆయాలకు రూ.7800 వేతనం అందుతోంది. ఇన్నేండ్లు వారికి తప్పనిసరి రిటైర్మెంట్‌ లేదు. శక్తి ఉన్నంత వరకూ పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకునేవారు. వారికి తప్పనిసరి ఉద్యోగ విరమణను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఏప్రిల్‌ 30 నాటికి 65 ఏండ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా.. పక్కన పెడుతున్నారని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ పెంచడంతో పాటు పెన్షన్‌, వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
జీవో విడుదల చేయాల్సిందే..
సర్కారు గతంలో ఇచ్చిన జీవో 10లో రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్‌ కింద టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేలు పొందుపర్చింది. దీనిని అమలు చేస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించినట్టుగా టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు లక్షపై కొత్త జీవో విడుదల చేస్తే.. దాదాపు 10వేల మందికి మేలు జరగనుంది. దాంతో వారు కూడా తమ విధుల నుంచి తప్పుకునే ఆస్కారం ఉంటుంది. కొత్త జీవో ఇచ్చేవరకు తమను విధుల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీవో వచ్చేదాకా మంత్రి హామీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారంతా ఆందోళనకు సిద్ధమయ్యారు.
కొత్త జీవో తక్షణమివ్వాలి
అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్స్‌కు నష్టం కలిగించే జీవో 10ని తక్షణమే రద్దు చేయాలి. రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్‌ రెట్టింపు చేస్తామన్న మంత్రి హామీ మేరకు కొత్త జీవోను వెంటనే విడుదల చేయాలి. ఆ జీవోలో వీఆర్‌ఎస్‌ సౌకర్యం, పెన్షన్‌ పెంచుతూ నిర్ణయం తీసుకోవాలి. హెల్పర్లకు పాత పద్ధతిలోనే(ఎస్‌ఎస్‌సీ విద్యార్హత ప్రకారం) ప్రమోషన్‌ ఇవ్వాలి. వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలోని టీచర్లు, హెల్పర్స్‌ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి శుక్రవారం చలో హైదరాబాద్‌ చేపడుతున్నాం.
– పి.జయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ)

Spread the love