– చరిత్రలోనే అథమ స్థానానికి రూపాయి
– కరిగిపోతోన్న విదేశీ మారకం నిల్వలు
ముంబయి: ప్రపంచ మార్కెట్‌లో రోజు రోజుకు రూపాయికి విలువ లేకుండా పోతోంది. తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 86కు క్షీణించి.. దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయిని చవి చూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తడబడుతున్న రూపాయిని నిలబెడుతామని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలకు.. ప్రస్తుత వాస్తవ పరిస్థితులు తీవ్ర భిన్నంగా ఉన్నాయి. పదేండ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ 64 దిగువన ఉండగా.. ప్రస్తుతం ఈ విలువ అమాంతం పడిపోవడం తీవ్ర ఆందోళనకరం. శుక్రవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనమై 86కు పరిమితమయ్యింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో 85.88 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ.. ఇంట్రాడేలో స్వల్పంగా పుంజుకుని 85.85 వద్ద ట్రేడింగ్ కాగా.. తుదకు 14 పైసలు కోల్పోయి 86 వద్ద ముగిసింది. గురువారం సెషన్‌లోనూ 17 పైసలు తగ్గి 85.86 వద్ద నమోదయ్యింది. భవిష్యత్తు సమీపంలో మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దిగుమతులు, విదేశీ అప్పు చెల్లింపులు, వాణిజ్య చెల్లింపులు తీవ్ర భారం కానున్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగనుంది.
స్టాక్ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం, ఇతర దేశీయ బలహీన ఆర్ధికాంశాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 1.96 శాతం పెరిగి 78.43 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయ్యింది. వారాంతం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 241.30 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 77,378.91కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్లు లేదా 0.40 శాతం తగ్గి 23,431 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడు రోజులు నష్టాలు చవి చూసినట్లయ్యింది.
ఎఫ్‌ఐఐలు వరుసగా తరలిపోవడానికి తోడు భారత విదేశీ మారకం నిల్వలు వరుసగా ఐదో వారంలోనూ కరిగిపోయాయి. జనవరి 3తో ముగిసిన వారంలో 5.7 బిలియన్ డాలర్లు తరిగిపోయి 634.58 బిలియన్ డాలర్లకు పరిమితమయినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇది 10 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంతక్రితం నాలుగు వారాల్లో 17.8 బిలియన్ డాలర్లు క్షీణించాయి. 2024 సెప్టెంబర్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయి 704.89 బిలియన్ డాలర్లుగా ఉన్న మారకం నిల్వలు.. అప్పటి నుంచి దాదాపు 70 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6 లక్షల కోట్లు) విలువ చేసే విదేశీ మారకం నిల్వలు తగ్గిపోయాయంటే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో చిక్కుకోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.