నెల్లూరు నరసింహారావు
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయాన్ని సాధించాడు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన నాలుగేండ్ల తర్వాత ఊహీతీత రీతిలో ఆయన పునరాగమనం చేశాడు. దీన్ని ట్రంప్ విజయం అనటం కంటే డెమోక్రాటిక్ పార్టీ ఘోర పరాజయం అనటం సబబుగా ఉంటుంది. దేశ ప్రజలను నిట్టనిలువునా చీల్చిన ఎన్నికల ప్రచారం తర్వాత 78 ఏండ్ల ట్రంప్ అధ్యక్ష పదవిని గెలవడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించాడు. దీంతో బుధవారం వైట్ హౌస్ తిరిగి అతని స్వాధీనమైంది. మొత్తం ఓట్ల పరంగా చూసుకుంటే ట్రంప్‌కు హారిస్ కంటే 50 లక్షలకు మించిన ఆధిక్యం ఉంది (ఈ వ్యాసం రాసే సమయానికి ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు).
”అమెరికా మాకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చింది” అని ట్రంప్ బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్సాహంతో ఉరకలేస్తున్న తన మద్దతుదారులను ఉద్దేశించి అన్నాడు.
గత ఎన్నికల్లో మోసం జరిగిందని అతను చేసిన వాదనలు, 2020 ఓటమిని తిప్పికొట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా జనవరి 6, 2021న అమెరికా రాజధానిపైన దాడి చేయడానికి మద్దతుదారులను నడిపించిన తర్వాత ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్టు కనిపించింది. అయితే అతను తన రిపబ్లికన్ పార్టీలోని సవాళ్ళను అధిగమించి ప్రజలను, కునారిల్లుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్రమ వలసల చుట్టూ సమీకరించి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను ఓడించాడు.
రిపబ్లికన్ పార్టీ అమెరికా సెనేట్‌లో మెజారిటీని గెలుచుకుంది. అయితే ప్రస్తుతం రిపబ్లికన్‌లు స్వల్ప మెజారిటీని కలిగి ఉన్న ప్రతినిధుల సభ నియంత్రణ కోసం జరిగిన పోరాటంలోనూ విజయానికి కేవలం 15స్థానాల చేరువలో ఉన్నారు (ఫలితాలు వెలువడవలసిన స్థానాలు 50కి పైగా ఉన్నాయి). అలాగే 11 గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో 8 గవర్నర్ పదవులను రిపబ్లికన్లు కైవసం చేసుకున్నారు. ట్రంప్ విజయం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ విలువ 2020 తర్వాత ఇంతగా ఎన్నడూ పెరగలేదు.
రాయిటర్స్/ఇప్సోస్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం, ఓటర్లు ఉద్యోగాల కల్పన, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడం అమెరికా ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యగా గుర్తించారు. అత్యధిక స్టాక్ మార్కెట్లు, వేగంగా పెరుగుతున్న వేతనాలు, తక్కువ నిరుద్యోగం ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా చాలా మంది అమెరికన్లు నిరాశకు గురయ్యారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు పరిపాలనలో సామర్థ్యం కొరవడటంతో ఎక్కువ మంది ఓటర్లు ఈ సమస్యను పరిష్కరించడానికి హారిస్ కంటే ట్రంప్‌ను విశ్వసిస్తున్నారని చెప్పారు.
హిస్పానిక్స్ సాంప్రదాయకంగా డెమోక్రటిక్ ఓటర్లు తక్కువ ఆదాయం గల కుటుంబాలు ద్రవ్యోల్బణంతో తీవ్రంగా దెబ్బతినటంతో అవి ట్రంప్ ఎన్నికల విజయానికి ఆజ్యం పోశాయి. గ్రామీణులు, శ్వేత జాతీయులు, కళాశాలయేతర విద్యావంతులైన వారు ట్రంప్ మద్దతుదారులుగా మారారు. తక్కువ ఆమోదం రేటింగ్ ఉన్నప్పటికీ ట్రంప్ విజయం సాధించాడు. రెండుసార్లు అభిశంసనకు గురై, నాలుగుసార్లు నేరారోపణకు గురయ్యాడు. మేలో, పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లింపులను కప్పిపుచ్చడానికి వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించినందుకు ఆయనను న్యూయార్క్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది.
డోనాల్డ్ ట్రంప్ విజయం అమెరికా వాణిజ్య విధానం, వాతావరణ మార్పు విధానాలు, ఉక్రెయిన్‌లో యుద్ధం, అమెరికన్ల పన్నులు, వలసలపై ప్రధాన ప్రభావాలను కలిగి ఉంటుంది. అతని టారిఫ్ ప్రతిపాదనలతో చైనాతోను, అమెరికా మిత్రదేశాలతో కూడా వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయి. అయితే కార్పొరేట్ పన్నులను తగ్గించడానికి, సరికొత్తగా కోతలను అమలు చేయడానికి అతను ఇచ్చిన హామీలు అమెరికా రుణాన్ని పెంచగలవని ఆర్థికవేత్తలు అంటున్నారు.
దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని సామూహిక బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ట్రంప్ ప్రచారం చేశాడు. తాను నమ్మకద్రోహులుగా భావించే సివిల్ సర్వెంట్లను తొలగించే అధికారాన్ని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పాడు. అతని ప్రత్యర్థులు అతను న్యాయ శాఖ, ఇతర ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను రాజకీయ ఆయుధాలుగా మార్చుకుంటారని భయపడుతున్నారు.
2017-2021 వరకు వైట్‌హౌస్‌ను ఆక్రమించిన ట్రంప్‌ను ఓడించడానికి లేదా ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్ గురించి ఓటర్ల ఆందోళనలను తగ్గించడానికి, తగిన మద్దతును పొందడంలో అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ హారిస్ 15 వారాల ప్రచారంలో విఫలమయింది. ట్రంప్ నియంత్రణ లేని అధ్యక్ష అధికారాన్ని కోరుకుంటున్నాడని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని హారిస్ హెచ్చరించింది. ఎడిసన్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, దాదాపు మూడొంతుల మంది ఓటర్లు అమెరికన్ ప్రజాస్వామ్యం ముప్పులో ఉందని భావించారు. అయితే వివిధ వివాదాస్పద విషయాలు ప్రజలను పూర్తిగా పోలరైజ్ చేశాయి.
చట్టపరమైన సమస్యలు, వివాదాలు ఉన్నప్పటికీ, వైట్ హౌస్ నుంచి నిష్క్రమించిన తర్వాత రెండవసారి గెలిచిన రెండవ మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. మొదటివాడు గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్. అతను 1885, 1893లో అధ్యక్షునిగా పనిచేశాడు. హుష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలిన రెండు నెలల తర్వాత, పెన్సిల్వేనియాలో జూలైలో జరిగిన ప్రచార ర్యాలీలో అతని కుడి చెవికి బుల్లెట్ తగిలి రాజకీయ హింస గురించి భయాందోళనలను పెంచింది. అతనిపైన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లో సెప్టెంబరులో మరో హత్యాయత్నం విఫలమైంది. జూలై షూటింగ్ జరిగిన ఎనిమిది రోజుల తర్వాత, 81 ఏండ్ల బైడెన్ ట్రంప్‌తో చర్చ సందర్భంగా పేలవమైన ప్రదర్శన కారణంగా కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మారింది.
హారిస్ కొన్ని వారాల వ్యవధిలో ప్రచారాన్ని మౌంట్ చేయడానికి పోటీ పడటంతో నిరాశాజనకమైన డెమోక్రాట్‌లను పునరుజ్జీవింపజేసింది. ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్న ఘనతను తుడిచివేసేటప్పుడు ఆమె మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో 1 బిలియన్ కంటే ఎక్కువ వసూలు చేసింది. ట్రంప్ కోసం ఓటర్లను సమీకరించేందుకు 100 మిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేసిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ జోక్యంతో హారిస్ పాక్షికంగా ఆర్థిక సమస్యను ఎదుర్కొంది. ట్రంప్ అనుకూల సందేశాలను విస్తరించడానికి మస్క్ తన సోషల్ మీడియా సైట్ ఎక్స్‌ని ఉపయోగించాడు.
ప్రచారం ముగియడంతో, ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అమెరికన్లను హెచ్చరించడంపై హారిస్ ఎక్కువగా తన దష్టిని సారించింది. అసంతప్తి చెందిన రిపబ్లికన్‌లను చేరదీసింది. ట్రంప్‌ను ”ఫాసిస్ట్”గా అభివర్ణించిన అతని మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ జనరల్ జాన్ కెల్లీతో సహా పలువురు మాజీ ట్రంప్ అధికారుల వ్యాఖ్యలను ఆమె హైలైట్ చేసింది. ఎన్నికల మోసం, వలస వ్యతిరేక ప్రచారం, తన రాజకీయ ప్రత్యర్థులపై రాక్షసత్వానికి సంబంధించిన తప్పుడు వాదనలను బట్టి ట్రంప్ విజయం అమెరికన్ సమాజంలో చీలికలను విస్తతం చేస్తుందని ఓటరు ప్రవర్తన, పార్టీ రాజకీయాలపై అధ్యయనం చేసే ఎమోరీ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అలాన్ అబ్రమోవిట్జ్ అన్నాడు.
తన పదవీకాలంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ను పునర్నిర్మిస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు, ఇందులో తాను నమ్మకద్రోహులుగా భావించే సివిల్ సర్వెంట్లను తొలగించడం, తన రాజకీయ శత్రువులపై దర్యాప్తు చేయడానికి ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను ఉపయోగించడం, అటువంటి ఏజెన్సీలను స్వతంత్రంగా ఉంచే దీర్ఘకాల విధానాన్ని ఉల్లంఘించడం వంటివి ఉన్నాయి.
2024 ఓటును కాంగ్రెస్ జనవరి 6, 2025న ధవీకరించిన తర్వాత, ట్రంప్, అతని ఇన్‌కమింగ్ వైస్ ప్రెసిడెంట్, సెనేటర్ జేడీ వాన్స్, జనవరి 20న ప్రారంభోత్సవం రోజున పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేండ్ల సుదీర్ఘ ప్రచారంలో ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని నియమించడంలో వ్యక్తిగత విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తానని సంకేతాలిచ్చాడు. అతను మస్క్, మాజీ అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, ఆసక్తిగల మద్దతుదారులకు తన పరిపాలనలో పాత్రలను వాగ్దానం చేశాడు.