– బాలబాలికలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
– ప్రజాప్రతినిధుల్లారా..అధికారుల్లారా పాఠశాలలను సందర్శించండి
– త్వరలో వర్సిటీల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ ఖాళీల భర్తీ
– గురుకులాల్లో నాసిరకం తిండి పెడితే ఊచలు లెక్కపెట్టాల్సిందే : సీఎం హెచ్చరిక
– ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రేవంతన్నగా చెబుతున్నా..గంజాయి, డ్రగ్స్ వంటి వ్యవసనాలకు బానిస కావొద్దనీ, సమాజానికి ఆదర్శంగా ఉండేలా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. వ్యసనాలకు బానిసలు కాబోమని విద్యార్థులతో హామీ తీసుకున్నారు. తెలంగాణ సమాజంలో డ్రగ్స్, గంజాయి వాడకం పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని తీసుకునే వారి పట్ల సింహస్వప్నంగా మారాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తాగుడు వ్యసనంగా మారటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కుటుంబాలు ఆగమవుతున్నాయనీ, ఇంట్లో ఎవరికైనా ఆ అలవాటు ఉంటే మాన్పించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిందనీ, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ద్రోహులుగా చూడాలని కోరారు. కులగణన వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయనీ, ఆస్తులు గుంజుకుంటారనీ, రిజర్వేషన్లు పోతాయని కొందరు చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అందించడం కోసమే కులగణన అని స్పష్టం చేశారు. కేంద్రం చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణలోనూ కులగణన చేర్చే అంశంపై కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు. 85 వేల మంది సర్వే చేస్తున్నారనీ, 8,500 మంది పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పిల్లలే దగ్గరుండి కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లకు చెప్పాలని సూచించారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని నొక్కిచెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ సభను నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తరలొచ్చారు. తమ కళారూపాలను అద్భుతంగా ప్రదర్శించారు. నెహ్రూ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంగన్‌వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్, విద్యాప్రగతి పుస్తకాలను ఆవిష్కరించారు. సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేంనరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం మొదటి ఏడాది ఉత్సవాలను ఇక్కడ బాలల దినోత్సవంతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. విద్యాసంస్కరణలు తెచ్చి అందరికీ విద్య తీసుకొచ్చిన ఘనత నెహ్రూదేనన్నారు. విద్యాహక్కు చట్టం తీసుకురావడంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కృషి మరువలేనిదని కొనియాడారు. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదనీ, బడ్జెట్‌లో ఏడు శాతానికిపైగా నిధులు కేటాయించడమే దానికి నిదర్శనమని చెప్పారు. చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 20వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామనీ, 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేశామని వివరించారు. అతి తక్కువ వ్యవధిలోనే డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యకే తమ ప్రాధాన్యమని మరోమారు చెప్పామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ టీచర్లతో బాత్‌రూమ్‌లను కడిగించిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎస్‌ఆర్ కింద సింగరేణి సంస్థ ద్వారా ఏటా వచ్చే రూ.150 కోట్లతో పాఠశాలల్లో అటెండర్స్, స్వీపర్లను నియమించామని తెలిపారు. గతంలో వీసీలను నియమించకపోవడంతో వర్సిటీలు నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడగానే అన్ని వర్సిటీలకు వీసీలను నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి విద్యా కమిషన్ నియమించుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని సగర్వంగా చెప్పారు. 26,854 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా..కేవలం 11 వేల ప్రయివేటు పాఠశాలల్లో 36 లక్షల విద్యార్థులు చదువుతుండటమేంటని ప్రశ్నించారు. లోపం ఎక్కడ ఉందనే దానిపై దృష్టి పెట్టి ముందుకెళ్లాలనీ, దీనిపై టీచర్లు ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని నొక్కి చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమానికి వెళ్లినా ముందు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలనీ, విద్యార్థులతో కాసేపు మాట్లాడి వారు చెప్పేది సావదానంగా వినాలని సూచించారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి అలాంటి చర్యలు దోహదపడుతాయని ఆకాంక్షించారు. ఇప్పటికే వారంలో రెండు రోజులను ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాలని కలెక్టర్లను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. తరుచూ ప్రభుత్వ పాఠశాలలు సందర్శించే అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రమోషన్లు, పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. హాస్టళ్లు, గురుకులాలకు నాసిరకం సరుకులు, కూరగాయలు, ఆహారం సరఫరా చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సిందేనని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్టల్స్ లో కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచిన ఘనత మన ప్రభుత్వానిదని సగర్వంగా చెప్పారు. భవిష్యత్తు తెలంగాణకు ఈ విద్యార్థులే పునాదిరాళ్లనీ, విద్యకు ప్రాధాన్యతనిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని అన్నారు. ఇక్కడ వేదిక పైన ఉన్నవాళ్లమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఈ స్థాయికి ఎదిగామనీ, కింద ఉన్న పిల్లల నుంచి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు కావాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం మారింది కాబట్టే బాలల దినోత్సవం ఇక్కడ
కుక్క పిల్ల చనిపోతే డాక్టర్లను జైల్లో వేసిన పరిస్థితి ఆనాటి ముఖ్యమంత్రిదనీ, మాసాయిపేట రైలు ప్రమాదంలో విద్యార్థులు చనిపోతే కన్నీరు కూడా కార్చలేదని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి విమర్శించారు. గత సీఎం ఏనాడైనా మీతో ఇలా సభ పెట్టారా? మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడారా? స్కూల్ ప్రారంభం రోజే యూనిఫామ్‌లు, పుస్తకాలు అందించేలా చూశారా? డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచారా? అంటూ విద్యార్థులను సీఎం అడగ్గా లేదు..లేదు..అని సమాధానమిచ్చారు. రేవంతన్న అలాంటి వాడు కాదనీ, విద్యార్థుల మధ్య నడిచి, వారి సమస్యలను తెలుసుకుని నడుచుకుంటున్న సీఎం అని చెప్పారు. ప్రభుత్వం మారింది కాబట్టే మీతో కలిసి ఇలా బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు.
ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో విద్యార్థుల పాత్ర కూడా కీలకమేనని చెప్పారు. పదేండ్లు విద్యార్థుల గురించి పట్టించుకోని వారు ఇవ్వాళ సమస్యలంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. అప్పటి ప్రభుత్వంగురుకులాలకు ఎందుకు సొంత భవనాలను నిర్మించలేదని ప్రశ్నించారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామనీ, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిల్లలకు సూచించారు. మట్టిలో మణిక్యాలని వెలికితీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యమైనా సరేగానీ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీల చెల్లింపు ఆలస్యం కావొద్దని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశానని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని నొక్కి చెప్పారు.
నెహ్రూ ఆలోచన విధానం మార్గదర్శకం :డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనా విధానం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన ఆచరణలో పెట్టిన అలీన విధానం, శాస్త్రీయ ఆలోచనా విధానం, పంచవర్ష ప్రణాళికలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. నెహ్రూ గొప్ప దార్శనీయుడని ప్రశంసించారు. లౌకికతత్వంతోనే దేశ ప్రగతి సాధ్యమని నొక్కి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఆయన దశాబ్దం పాటు జైలుజీవితం గడిపాడనీ, తన యావత్ ఆస్తిని దేశం కోసం సమర్పించాడని విద్యార్థులకు చెప్పారు. అలాంటి గొప్ప నేత అడుగుజాడల్లో తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వాదని చెప్పారు.
తెలంగాణ ఆస్తి పిల్లలే : మంత్రి పొన్నం ప్రభాకర్
దేశ భవిష్యత్, తెలంగాణ ఆస్తి పిల్లలేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలు నేటికీ నిలబడ్డాయంటే నెహ్రూ వేసిన పునాదే కారణమని చెప్పారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ నాలెడ్జి సెంటర్లను క్షేత్రస్థాయికి విస్తరిస్తామన్నారు. ప్రతి విద్యార్థి కూడా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.
క్షేత్రస్థాయి విద్య బలోపేతానికి ప్రాధాన్యం : మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి విద్యావ్యవస్థ బలోపేతానికి తమ ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. దశాబ్దకాలంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వం రాగానే పిల్లలకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే నాలుగేండ్లపాటు కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని నొక్కి చెప్పారు.
డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిపట్ల సింహస్వప్నం కావాలి.
తాగుడుతో కుటుంబాలు ఆగం..ఇంట్లో మాన్పించండి. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది..పిల్లలు సహకరించాలి. ఎన్యుమరేటర్లకు వివరాలన్నీ మీరే ఇవ్వండి.అడ్డుకునేవారిని ద్రోహులుగా చూడండి.
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
21ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు అసెంబ్లీలో తీర్మానిస్తాం
ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 25ఏండ్ల వయసు నిబంధన ఉందని సీఎం చెప్పారు. 21ఏండ్ల వయస్సులోనే కలెక్టర్లు, ఇతర ఉన్నత అధికారులుగా ఎంపికవుతూ సమర్ధవంతంగా పనిచేస్తున్నవారు చాలా మంది ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు 21 ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. 21 ఏండ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని చేసే బాధ్యతను మంత్రి శ్రీధర్‌బాబు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రాజకీయాల్లో యువతరానికి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.