నేతన్న అధైర్య పడొద్దు.. చేతినిండా పని కల్పిస్తాం

నేతన్న అధైర్య పడొద్దు.. చేతినిండా పని కల్పిస్తాం– నేతన్నల పేరుతో బీఆరెస్‌, బీజేపీ శవ రాజకీయం
– పదేండ్లు అధికారంలో ఉన్న వారిదే ఈ పాపం..
– కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో ఎంపీ బండి సంజరు చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ – సిరిసిల్ల
”నేతన్నల పేరుతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు శవ రాజకీయాలు చేస్తున్నాయి.. పదేండ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీలదే ఈ పాపం అని.. వారి నిర్లక్ష్యం వల్లే నేడు వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడింది. అయినా నేతన్నలు అధైర్య పడొద్దు.. చేతినిండా పని కల్పిస్తాం..” అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం.. వస్త్ర పరిశ్రమ మీద 12శాతం జీఎస్టీ వేసిందని, జాతీయ చేనేత బోర్డును రద్దు చేసిందని చెప్పారు. జాతీయ టెక్స్‌టైల్‌ బోర్డును, మహాత్మగాంధీ గుణకర్‌ బీమా యోజనను, ఐసీఐసీఐ నాబార్డు ఆరోగ్య బీమాను రద్దు చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎస్‌ఐడీపీ పథకం పారిశ్రామిక అభివృద్ధి ప్రమోషన్ల కింద రూ.వేల కోట్ల నిధులు ఇస్తే.. మన రాష్ట్రానికి అసమర్థ ఎంపీ బండి సంజరు ఎన్ని నిధులు తెచ్చారో 10వ తేదీన చేసే దీక్షలో చెప్పాలన్నారు. సిరిసిల్లకు పవర్‌లూం క్లస్టర్‌ అడిగితే కనీసం నోరెత్తని ఎంపీ బండి ఏం ముఖం పెట్టుకుని దీక్షకు పూనుకున్నారని ప్రశ్నించారు.
ఎస్‌ఐడీపీ కింద రూ.300కోట్లు ఉంటే తాము 25శాతం రాష్ట్ర వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. మిగతా నిధులు కేంద్రం నుంచి తేవాలని సవాల్‌ చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం రూ.550కోట్ల బకాయిలు చెల్లించలేదని, వీటిలో రూ.300కోట్ల బకాయిలు బతుకమ్మ చీరలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. ఈ సంక్షోభానికి కారణమైన బీఆర్‌ఎస్‌ ఎందుకు ఉద్యమం చేపడుతుందో.. ఎవరిపై కక్ష సాధించేందుకు రాజకీయం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల రెచ్చగొట్టే మాటలు నమ్మొద్దని, నేతన్నలారా అధైర్యపడొద్దు, చావు మార్గం కాదు.. ప్రతి కార్మికుడికీ పని కల్పించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని చేనేతల నుంచి వస్త్రాల కొనుగోలు కోసం జీఓ 01 తీసుకొచ్చామని, గడిచిన నాలుగు నెలల్లోనే రూ.120కోట్ల ఆర్డర్‌ సిరిసిల్లకు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన ఆర్డర్లకన్నా ఎక్కువ ఇస్తామని, పెండింగ్‌ బకాయిలు కూడా విడుదల చేస్తామని, ఇప్పటికీ రూ.180 కోట్లు విడుదల చేశామని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్చి కేకే మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love