కుండ బద్దలు కొట్టరా!

Don't break the pot!ఎవడురా!
ఈనెలను
తన నెత్తుటితో తడిపినది.
ఎవడురా!
ఈ జాతిని
తన సత్తువతో జాగతము చేసినది
గడీలను నేలమట్టం చేసి,
వెట్టినిమట్టి కరిపించినది ఎవడు
మత పిశాసపు కోరలు పీకి
మానవతాపతాకను ఎగరేసినది ఎవడు
బందగి పోరాట జిందగీలో ఇంధనం ఎవడు
ఐలమ్మ ధైర్యానికి అభయము ఎవడు
కొమురయ్య కొరమీసానికి పౌరుషం ఎవ్వడు
కమలమ్మ గాత్రానికి కరతాళము ఎవడు
ఎవడురా !
రొమ్ములు పిండిన దొరల గుండెలు
చీల్చిన ధీరుడు ఎవడురా!
మానము దోసిన దొంగల
ప్రాణము తీసిన వీరుడు
స్వరాజ్యం గొంతుగా,
మాటల తూటాలు పేల్చినది ఎవడు.
ఆరుట్ల అడుగులకు బాటలు వేసినది ఎవడు
రావి నారాయణ మేధస్సుకు
ఉషస్సులు ఊదినది ఎవడు.
భీమిరెడ్డి కార్యములకు కారణభూతుడు
ఎవడు – ఎవడురా!
మత భూతమును ఒక వైపున
దొరల దోపిడిని మరొకవైపున
ఒక్కపెట్టున తుదముట్టించ
తలపెట్టిన శూరుడు
ఎవడురా!
పేదరికమును ఒకవైపున
అసమానతలను మరొకవైపున
అంతముసేయగా
అరుణారుణ కాంతులు పంపిన సూర్యుడు
ఎవడురా- ఎవడురా!
ఎవడురా- విమోచన ఉద్యమకారుడు
ఎవడురా -విముక్తి పోరాట యోధుడు
గుండెలు బద్దలయ్యేలా,
నిజము కుండబద్దలు కొట్టరా
వీరతెలంగాణ బిడ్డవు
నీవు కదరా, సోదరా!
– డాక్టర్‌ చందా అప్పారావు

Spread the love