భయం సృష్టించకండి

– ఛత్తీస్‌గఢ్‌ మద్యం కేసులో ఈడీకి సుప్రీంకోర్టు చురక
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణం కేసు విచారణ సందర్భంగా భయ వాతావరణం సృష్టించవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సుప్రీంకోర్టు చురక వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, కుంభకోణానికి ముడిపెట్టి ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ను మనీ లాండరింగ్‌ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ముఖ్యమంత్రిని ఇరికించే ఉద్దేశంతో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అధికారులు, వారి కుటుంబసభ్యులను అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నదని ఆరోపించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఈడీ దర్యాప్తును సవాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎ అమానుల్లాతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ఈడీ తోసిపుచ్చింది. రెండు వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఉన్నతస్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వంలోని రాజకీయ నేతల ప్రమేయం ఉందని తెలిపింది. 2019-22 మధ్యకాలంలో వీరంతా రెండు వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని సృష్టించారని ఆరోపించింది. డిస్టిలరీలు ఓ ముఠాగా ఏర్పడి మార్కెట్‌ ధరను నిర్ణయించుకోవడానికి వీలు కల్పించేందుకు ముడుపులు తీసుకున్నారని వివరించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఛత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇది జరిగిన సుమారు నెల రోజులకు మద్యం కుంభకోణంపై విచారణ ప్రారంభమైంది.
బీజేపీ యేతర ప్రభుత్వాలను భయపెట్టేందుకు, హింసించేందుకు, వాటి కార్యకలాపాలకు విఘాతం కలిగించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని బాఘెల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విమర్శించింది. ఏదైనా రాష్ట్రానికి కేంద్రంతో లేదా ఇతర రాష్ట్రాలతో వివాదాలు ఏర్పడితే ఆ రాష్ట్రం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 131వ అధికరణను ఛత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం సవాలు చేసింది.

Spread the love