సీట్లు ఇవ్వరట.. సీఎంను చేస్తరట..

సీట్లు ఇవ్వరట.. సీఎంను చేస్తరట..– మోడీ, కేసీఆర్‌వి కుల రాజకీయాలు
– ‘అయ్యా.. బాంచన్‌’ బతుకులు పోవాలి : కాంగ్రెస్‌ రోడ్‌ షోల్లో విజయశాంతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి/మోర్తాడ్‌/ఆర్మూర్‌
బీసీలకు సీట్లు ఇవ్వని బీజేపీ.. సీఎంను చేస్తామంటున్నదని కాంగ్రెస్‌ పార్టీ క్యాంపియన్‌ కమిటీ ఛీప్‌ కోఆర్డినేటర్‌ విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌, మోడీ ఇద్దరూ కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ప్రజలు అయ్యా బాంచన్‌ అనే విధంగా బతకాల్సి వచ్చిందని, అలాంటి పార్టీని గద్దెదించే అవకాశం వచ్చిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన రోడ్‌షోల్లో ఆమె మాట్లాడారు.
ఇబ్రహీంపట్నంలోని మహంకాళి అమ్మ ఆలయం నుంచి రోడ్‌ షోలో పాల్గొన్న ఆమె అంబేద్కర్‌ చౌరస్తాలో మాట్లాడారు. పేదల బతుకులు మార్చేది కాంగ్రెస్‌ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను రెండుసార్లు గెలిపిస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌, మోడీ మధ్య రహస్య ఒప్పందముందన్నారు. అందుకే కేసీఆర్‌ కూతురు కవిత లిక్కర్‌ స్కామ్‌లో కేంద్రం అరెస్టు చేయకుండా వెనకడుగు వేసిందని విమర్శించారు. వీరిద్దరిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తాను గ్యారంటీ అని బాండ్‌ పేపర్‌పై మల్‌రెడ్డి రంగారెడ్డి సంతకం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్రవంతి, మల్‌రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌ రెడ్డి, నాయకులు గౌస్‌పాషా తదితరులు ఉన్నారు.
‘అయ్యా.. బాంచన్‌’ బతుకులు పోవాలి.
నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ఆర్మూర్‌ల్లో జరిగిన రోడ్‌షోల్లో విజయశాంతి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్‌ను గద్దెనెక్కించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. వేల కోట్ల రూపాయలను సంపాదించుకుంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను బిచ్చగాళ్ళగా మార్చిందని, తెలంగాణ సంపదలను పందికొక్కులుగా దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా పాలనను అందించే కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతూ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ఈడీ దాడులు జరుగుతున్నారని, బీఆర్‌ఎస్‌ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. సంక్రాంతికి 500 రూపాయల సిలిండర్‌తో ప్రతి ఒక్కరూ తమ అప్పాలు చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో యువతను గంజాయి వైపు మార్చిన ఘనత అధికార పార్టీది అని, బాల్కొండ నియోజకవర్గంలో యువత గంజాయి వైపు మారేలా చేసిన మంత్రిని ఓడిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు.

Spread the love