నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడం తెలిసిందే. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైన, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వడగాల్పులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. అత్యధికంగా రాజమండ్రి ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రత్యేకంగా ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీంతో అత్యవసర పనులు ఉంటే తప్పించి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని వాతావరణ శాఖ సూచించింది.