– దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజీ సబ్‌కాంట్రాక్టు ఎవరికిచ్చారో తేల్చాలి
– బండి సంజయ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు :కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎల్‌అండ్‌టీ సంస్థను తాను బెదిరించడంతో తన బంధువులకు సబ్‌కాంట్రాక్టు ఇచ్చిందని గాలి మాటలు మాట్లాడొద్దని, నిజమేంటో నిరూపించాలని ఎంపీ బండి సంజయ్ కి కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ప్రజలు పట్టించుకోరన్నారు. ఎల్‌అండ్‌టి సంస్థ మేడిగడ్డ సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చిందో తెలిస్తే.. పేరు బయట పెట్టాలని, అసలు మాజీ ఎంపీ ఎవరో?, అతడి బంధువులు ఎవరో? సూటిగా చెప్పాలన్నారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నానని, అంతకు ముందు పొన్నం ప్రభాకర్, కేసీఆర్, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, ఎల్.రమణ ఎంపీలుగా ఉన్నారని.. ఇందులో ఎవరి బంధువులకు మేడిగడ్డ బ్యారేజ్ సబ్ కాంట్రాక్టు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎంపీగా గెలిచి ఐదేండ్లు అవుతున్నా ప్రజలు గుర్తుకురాని బండి సంజయ్ కి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో గుర్తొచ్చారా అని ఎద్దేవా చేశారు. ఐదేండ్లలో ఐదు కొత్తలు తేలేదని, ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టం, హరితహారం, నేషనల్ హెల్త్ మిషన్ వంటి పథకా లకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినట్టు గానే తెలంగాణకు ఇచ్చిందని, ఇవన్నీ తన నిధులేనని బండి సంజయ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడూ మతం ముసుగులో రాజకీయం చేస్తూ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలకు నయాపైసా తెచ్చిన మొఖం లేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయంలో జ్యుడీషియల్ విచారణ జరిపితే అభ్యంతరం లేదని గతంలోనే తమ పార్టీ స్పష్టం చేసిందని వివరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకుల హామీద్ గంగాధర్ ఎంపీపీ శ్రీరాం, జక్కుల నాగరాజు, గవ్వ వంశీదర్‌రెడ్డి దూలం సంపత్, గందెకల్పన, వోల్లాల శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.