పొరుగువారికి తోడుపడవోరు

సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం. అయితే ప్రస్తుత సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. మనకు సంబంధం లేకుండానే మార్పులు అత్యంత వేగంగా జరిగిపోతున్నాయి. అప్యాయంగా మాట్లాడే సమయమే లేకుండా పోయింది. బంధాలకు కాకుండా డబ్బుకు ప్రాధాన్యం పెరిగిపోయింది. చాలా మంది ఇంట్లో, పొరుగువారితో కలహాలతో కాలం వెల్లదీస్తున్నారు
మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. మన అనే భావన నుండి నేను- నాది అనే సప్రయోజనానికి బీజాలు పడ్డాయి. మానవతా విలువలు నశిస్తున్నాయి. నైతిక విలువలు సన్నగిల్లసాగాయి. అసలు నేటి తరానికైతే బంధం విలువ తెలియడం లేదు. దగ్గరి చుట్టాన్ని కూడా గుర్తు పట్టలేని స్థితికి చేరారు. ఇప్పటి జనరేషన్‌ ఎలా ఉందంటే చిటికి మాటికి చికాకు పడడం, చిన్న చిన్న విషయాలకే ఇతరలతో గొడవలు పడడం. ఆఫీస్‌లో ఉండే కొలీగ్‌తోనైనా, ఇంటి పక్కన ఉండే వారితోనైనా తరచు గొడవలు పడుతుండడం.
టెక్నాలజీ ఇస్తున్న విస్తృతమై సౌకర్యాలను వాడుకుంటూ మనిషి ఒంటరి అవుతున్నాడు. వాస్తవానికి పరివర్తన అనేది ఎపుడూ సానుకూల దిశలో జరగాలి. మరి ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటూ. కానీ మనం మాత్రం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతుందో మనుషులకు, మానవత్వానికి అంత దూరంగా జరిగిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషిలో మనిషి తనాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. కానీ కాపాడుకోక తప్పని స్థితి అత్యంత ఆవశ్యకమయింది.
మరి మానవ సంబంధాలు కాపాడుకోవడం ఎలా అంటారా… తెలిసిన వారు ఎదురైతే చిరునవ్వుతో ‘హలో’ చెప్పండి. ఏ స్నేహం ప్రారంభమైన చిరునవ్వు లేదా శుభోదయం లేదా హారు-హలోతోనే ఉంటుంది. అందువల్ల ఇతురులతో స్నేహ హస్తాన్ని చాచడానికి, మీ ముఖంపై చిరునవ్వుతో పొరుగువారి క్షేమం గురించి అడగడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇది మీ ఇద్దరి అవగాహనకు నాంది అవుతుంది. మీ ప్రత్యేక వంటకాన్ని పొరుగువారితో పంచుకోండి. మీరు నిజంగా పొరుగువారికి మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటే, మీకు ఇష్టమైన వంటకం లేదా మీరు బాగా తయారుచేసే ఆహార పదార్థాలను వారితో పంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇరుగుపొరుగు వారి పట్ల మంచి భావం పెరుగుతుంది.
ఎదుటి వారి యోగ క్షేమాల గురించి తెలుసుకోండి. కొన్నిసార్లు బిజీ రొటీన్‌ కారణంగా మన చూట్టూ ఉండే వారిని పట్టించుకోలేం. అటువంటి పరిస్థితిలో మీరే వారి తలుపు తట్టడానికి ప్రయత్నించండి. వారి ఆరోగ్యం, కనిపించకపోవడానికి కారణాన్ని అడగండి. వారికి సౌలభ్యంగా ఉండేలా చూసుకోండి. పొరుగువారితో స్నేహాన్ని పెంచుకోవడానికి, మీరూ సౌలభ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇల్లే కదా అని పెద్ద స్వరంతో సంగీతాన్ని ప్లే చేయకండి. అర్థరాత్రి పార్టీలతో వారి నిద్రకు భంగం కలిగించొద్దు. కారును పార్క్‌ చేస్తున్నప్పుడు కూడా, పొరుగువారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి.
పొరుగువారికి సహాయంగా ఉండండి. పొరుగువారితో కుటుంబంలా కలిసిపోండి. పక్క పక్కనే కాబట్టి ఆపద, అవసరమైన సమయాల్లో సహాయం కోసం ముందుగా చేరుకునే వారు మనమే. సిలిండర్‌ అయిపోయిందా లేదా వారు లేనప్పుడు తన పార్శిల్‌ తీసుకోవాల్సి వస్తే వాటిని రిసివ్‌ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి చిన్న సహాయాలే వారి మనసులో పదికాలాలు నిలిచిపోయి మీ స్నేహం మరింత పదిలంగా ఉంటుంది. మీ మధ్య బంధం బలపడుతుంది.

Spread the love