ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వొద్దు

Don't let those MLAs touch the assembly gate– మేడిగడ్డ మతి ఉండి కట్టాడో.. మందేసి కట్టాడో ?
– 60ఏండ్లలో రూ. 69 వేల కోట్ల అప్పు… పదేండ్లలో ఆరు లక్షల కోట్ల అప్పు : ప్రజా భరోసా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్‌/తుంగతుర్తి/తిరుమలగిరి
కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఆ 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనీయొద్దని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా భరోసా సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వదులుకున్నాడని, కానీ కేసీఆర్‌ ఏనాడూ పదవులను వదిలేయలేదని తెలిపారు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్ల విధానంతో కేసీఆర్‌ ముందుకెళ్లాడని విమర్శించారు. నకిరేకల్‌లో చిరుమర్తిని రెండుసార్లు గెలిపిస్తే నమ్ముకున్న కార్యకర్తల గుండెలపై తన్ని పార్టీ ఫిరాయించి దొర గారి గడిలో ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడని అన్నారు. కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్‌ని ఇసుకపై మతి ఉండి కట్టాడో మందేసి కట్టాడో అని అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఆనాడు వెంకన్న వైఎస్‌తో కొట్లాడి ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించి 30 కిలోమీటర్లు టన్నెల్‌ తవ్వారని, ఇంకో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేవని అన్నారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కారణంతో ఎస్‌ఎల్బీసీని కేసీఆర్‌ పడావు పెట్టారన్నారు. 60 ఏండ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.69 వేల కోట్లు అయితే పదేండ్లలో కేసీఆర్‌ కుటుంబం చేసిన అప్పు రూ.6 లక్షల కోట్లు అని తెలిపారు. దీన్ని బట్టి ఎవడు దొంగ.. ఎవడు గజదొంగ అన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. నల్లగొండ కాంగ్రెస్‌ అడ్డా అని, ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలన్నారు. వెంకట్‌ రెడ్డి, నేను ఇద్దరం అనుకుంటే.. ఈ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ జెండా ఎక్కడా కనిపించదని చెప్పారు. 2014, 2018లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌.. రాష్ట్రాన్ని సాధించాక మొదటిగా దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీని విస్మరించి వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఇసుక, భూ మాఫియా జోరుగా సాగుతుందన్నారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో నకిరేకల్‌లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ దక్కకుండా చేయాలన్నారు. అబద్ధాలు చెప్పడంలో కల్వకుంట్ల కుటుంబం నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటుందన్నారు.
రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే, నవంబర్‌ నెల కరెంటు బిల్లు ఎవరూ కట్టవద్దనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వమే చెల్లిస్తుందని ధీమాగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నకిరేకల్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థులు వేముల వీరేశం, మందుల సామేలు, ఏఐసీసీ పరిశీలకులు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ నేతి విద్యాసాగర్‌, పీసీసీ నాయకులు అద్దంకి దయాకర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జాతీయ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు డీవీ శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love